logo

క్రికెట్ జట్ల ఎంపికలోనూ రాజకీయం

క్రికెట్ జట్ల ఎంపికలోనూ రాజకీయం చేయడంపై జిల్లా క్రికెట్ అసోసియేషన్‌పై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసోసియేషన్‌లోని కొందరు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిభ కలిగిన క్రీడాకారుల అవకాశాలకు గండి కొడుతున్నారని తల్లిదండ్రులు,

Published : 16 Jun 2024 05:04 IST

జిల్లా అసోసియేషన్‌ తీరుపై తీవ్ర విమర్శలు 

గుంటూరుక్రీడలు, న్యూస్‌టుడే: క్రికెట్ జట్ల ఎంపికలోనూ రాజకీయం చేయడంపై జిల్లా క్రికెట్ అసోసియేషన్‌పై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసోసియేషన్‌లోని కొందరు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిభ కలిగిన క్రీడాకారుల అవకాశాలకు గండి కొడుతున్నారని తల్లిదండ్రులు, క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జిల్లా క్రికెట్ అసోసియేషన్‌ ఎంపికలు నిర్వహిస్తోంది. అంతకుముందు వరకు ఎంపికలు నిర్వహించిన మెన్, ఉమెన్‌ క్రికెట్ అసోసియేషన్‌ తప్పుకొంది. ఈ వ్యవహారంపై క్రికెట్ అసోసియేషన్ల నేతల మధ్య అప్పట్లో మాటల యుద్ధం జరిగింది. ఇటీవల జరిగిన అండర్‌-16 క్రికెట్ జట్ల ఎంపికలో రాజకీయం చేయడంపై తల్లిదండ్రులు, క్రీడాకారులు తప్పుబడుతున్నారు. జట్ల ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ క్రికెటర్ల భవిష్యత్తుకు గండికొడుతున్నారని విమర్శిస్తున్నారు.

ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. జిల్లా క్రికెట్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌-16, అండర్‌-19 బాలుర జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇవి జరిగాక అండర్‌-14 ఎంపికలు జరుగుతాయి. అండర్‌-14 వయస్సు ఉన్న ఏడుగురు క్రికెటర్లను అండర్‌-16లోకి ఎంపిక చేశారు. అండర్‌-16లో అండర్‌-14 క్రికెటర్లు ఆడడంతో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు.అండర్‌-16 ప్రాబబుల్స్‌ టీమ్‌లో 30 మంది ఉన్నారు. వీరిలో అండర్‌-14 ఆటగాళ్లు ఏడుగురు ఉన్నారు. అలా ఎంపిక చేయడం వల్ల అండర్‌-16 వయసుకు దగ్గర్లో ఉన్నవారికి అన్యాయం జరిగింది. అండర్‌-14 క్రికెటర్లను అండర్‌-16లో ఆడించమని బీసీసీఐ ఏమైనా చెప్పిందా...అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 14 సంత్సరాల్లోపు వయస్సు ఉన్న వారు అండర్‌-16కు ఆడడంతో ఎటువంటి ఉపయోగం ఉండదని క్రీడాకారులు పేర్కొంటున్నారు. పోనీ వీరంతా ఎంతో ప్రతిభావంతులని గుర్తించి రాష్ట్ర క్రికెట్ జట్టులో ఆడిస్తారన్న నమ్మకం కూడా లేదు. అండర్‌-16 ఎంపికలు జరుగుతున్నాయని జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలియజేయాల్సి ఉండగా అసోసియేషన్‌ కనీసం ఆపని కూడా చేయకుండా ఏకపక్షంగా ఎందుకు వ్యవహరించిందని ప్రశ్నిస్తున్నారు. ఈ తతంగంపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ ఏమి సమాధానô చెబుతుందని తల్లిదండ్రులు, క్రీడాకారులు నిలదీస్తున్నారు. దీనిపై వివరణ కోరేందుకు జిల్లా క్రికెట్ అసోసియేషన్‌ కార్యదర్శిని ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని