logo

ఆరు నెలలు కాదు.. ఇప్పుడే చూసుకుందాం : బ్రహ్మారెడ్డి

అరాచకాలు, అక్రమాలు చేసి ప్రజల చేతిలో ఓడిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆరునెలల్లో తానేమిటో చూపిస్తానని బీరాలు పలుకుతున్నాడు. ఆరు నెలలు కాదు ఇప్పుడే రా.. చూసుకుందాం అంటూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 16 Jun 2024 05:09 IST

పేటసన్నెగండ్ల వద్ద గజమాలతో స్వాగతం  

కారంపూడి, న్యూస్‌టుడే: అరాచకాలు, అక్రమాలు చేసి ప్రజల చేతిలో ఓడిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆరునెలల్లో తానేమిటో చూపిస్తానని బీరాలు పలుకుతున్నాడు. ఆరు నెలలు కాదు ఇప్పుడే రా.. చూసుకుందాం అంటూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తీరా ఆరు నెలలంటూ అవాకులు చవాకులూ పేలుతున్నాడని ఎద్దేవా చేశారు. తాను పూర్తిగా వివాదాలకు దూరంగా ఉండాలని చూస్తుంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మరోమారు నియోజకవర్గంలో అలజడులు సృష్టించేందుకు పిన్నెల్లి సోదరులు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. శనివారం నియోజకవర్గంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వెనుకబడిన పల్నాడులో విద్య, వైద్యంతోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజలకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతోపాటు బుగ్గవాగు నుంచి మాచర్ల పట్టణానికి నీటిని అందిస్తామన్నారు.

ర్యాలీగా కార్యకర్తలతో వస్తున్న బ్రహ్మారెడ్డి 

అడుగడుగునా.. బ్రహ్మరథం

మాచర్ల(కారంపూడి), దుర్గి, వెల్దుర్తి, న్యూస్‌టుడే: అధిక మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధించి మొదటిసారిగా నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన తెదేపా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.శనివారం కారంపూడి, ఒప్పిచర్ల, నరమాలపాడు, అడిగొప్పల, ఓబులేసునిపల్లె, దుర్గి, ఆత్మకూరు, పోలేపల్లి, రాయవరం మీదుగా మాచర్లకు ర్యాలీ చేపట్టారు. మాచర్లలో పెద్దసంఖ్యలో జనం స్వాగతం పలికారు. అక్కడ్నుంచి వెల్దుర్తి మండలంలోకి అడుగుపెట్టి ఉప్పలపాడు, మండాది మీదుగా వెల్దుర్తి చేరుకున్నారు. దారిపొడవునా మహిళలు హారతులిచ్చి గుమ్మడి కాయలతో దిష్టితీశారు. పేటసన్నెగండ్ల, కారంపూడిలో కార్యకర్తలు బ్రహ్మారెడ్డికి గజమాలలు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని