logo

ఏఎన్‌యూలో పాలన గాడిన పడేనా!

గత వైకాపా పాలనలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పలు నియామకాలకు రాజకీయ రంగు పులిమింది. ఏమాత్రం బోధనానుభవం లేని వ్యక్తిని తీసుకొచ్చి న్యాయ విభాగానికి డీన్‌ను చేసిన ఘనత వర్సిటీకే దక్కింది.

Published : 16 Jun 2024 06:25 IST

వైకాపా హయాంలో రాజకీయ నేతల జోక్యం
కొత్త ప్రభుత్వం చక్కదిద్దాలంటున్న విద్యార్థులు
ఈనాడు, అమరావతి

త వైకాపా పాలనలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పలు నియామకాలకు రాజకీయ రంగు పులిమింది. ఏమాత్రం బోధనానుభవం లేని వ్యక్తిని తీసుకొచ్చి న్యాయ విభాగానికి డీన్‌ను చేసిన ఘనత వర్సిటీకే దక్కింది. ఇలాంటి నియామకాలపై పునః సమీక్షించి వాటిని సరి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. డీన్‌గా నియామకమైనవారు సిలబస్‌ రూపకల్పన నుంచి పీహెచ్‌డీలు, వైవాలు జరిగేటప్పుడు తప్పనిసరిగా హాజరై అవి ఎలా జరుగుతున్నాయో పర్యవేక్షించాలి. ఇంతటి కీలకమైన డీన్‌షిప్‌ను ఏఎన్‌యూ తేలిగ్గా తీసుకుంది. 

ప్రత్యామ్నాయం ఉన్నా..

విశ్వవిద్యాలయంలో పీజీ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ లీగల్‌ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌ విభాగం ఎప్పటి నుంచో ఉంది. ఆ విభాగానికి డీన్‌గా వైకాపా ప్రభుత్వంలో అదనపు అడ్వకేట్‌ జనరల్‌(ఏఏజీ)గా పనిచేసిన పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని నియమించింది. ఆయనకు న్యాయవాదిగా అనుభవమే తప్ప బోధనానుభవం లేదు. సుమారు ఏడాది కిందట ఆయన నియామకమయ్యారు. అంతకుముందు వర్సిటీకి అనుబంధంగా ఉండే ఏసీ న్యాయ కళాశాల ప్రిన్సిపల్‌ గురవయ్య డీన్‌గా వ్యవహరించారు. ఆ కళాశాల యాజమాన్యంలో విభేదాలు చోటుచేసుకుని ఆయన్ని ప్రిన్సిపల్‌ పదవి నుంచి తప్పించారు. దీంతో ఏఎన్‌యూలో డీన్‌షిప్‌ కోల్పోయారు. అలా ఏర్పడిన డీన్‌ ఖాళీని గతేడాది వర్సిటీ వీసీ ఆచార్య రాజశేఖర్‌ ఏఏజీగా ఉన్న సుధాకర్‌రెడ్డితో భర్తీ చేశారు. డీన్‌ పోస్టులో ఎలాంటి జీతభత్యాలు ఉండవు. కేవలం హోదా మాత్రమే ఉంటుంది. సమావేశాలకు హాజరైనప్పుడు టీఏ, డీఏలు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. గురవయ్యను ఏసీ కళాశాల తొలగించడంతో ఏర్పడిన డీన్‌ పోస్టు ఖాళీని భర్తీ చేయడానికి వర్సిటీకి అనుబంధంగా ఉన్న జేకేసీ న్యాయ కళాశాల ప్రిన్సిపల్, ఇతరులతో భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయం ఉన్నా వారిని పక్కన పెట్టి ఏఏజీ సుధాకర్‌రెడ్డిని పెట్టడం విమర్శలకు దారితీసింది. 

అనుభవానికే పెద్దపీట వేయాలి

సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం ఓడిపోవడంతో గతంలో నామినేటెడ్‌ పోస్టుల్లో నియామకమైన వారంతా రాజీనామా చేశారు. ఏఏజీ పదవికి సుధాకర్‌రెడ్డి రాజీనామా చేశారు. దీంతో సహజంగా వర్సిటీ డీన్‌షిప్‌ పోతుందని వర్సిటీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటివరకు డీన్‌షిప్‌నకు ఆయన రాజీనామా చేశారా? లేదా అనేది మాత్రం వర్సిటీ వెల్లడించలేదు. ఇప్పటికైనా వర్సిటీ ఉన్నతాధికారులు లా విభాగం డీన్‌గా బోధనా అనుభవం తదితర అర్హతలు ఉన్న వ్యక్తిని నియమించాలని కోరుతున్నారు. 


కొత్త కోర్సులను పర్యవేక్షించే వారేరీ..?

2002లో బీఎల్‌ కోర్సును రద్దు చేసి ఎల్‌ఎల్‌ఎం కోర్సు ఒక్కటే కొనసాగిస్తూ వచ్చారు. అడ్మినిస్ట్రేషన్‌ లా, లేబర్‌ లా, లా ఆఫ్‌ క్రైమ్స్, కార్పొరేట్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ లా అనే నాలుగు కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు. వాటితో పాటు గడిచిన విద్యా సంవత్సరంలో ఐదేళ్ల వ్యవధి కలిగిన బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ హానర్స్‌ కోర్సులు ప్రవేశపెట్టారు. అనుభవం లేని డీన్‌ వల్ల ఈ కోర్సులు ఎలా నడుస్తున్నాయో చూసే నాథుడే లేకుండా పోయారు. ఆ విభాగంలో ఉన్న రెగ్యులర్‌ అధ్యాపకులు పదవీ విరమణ చేయడంతో ఒప్పంద అధ్యాపకులు, గౌరవ అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. డీన్‌షిప్‌లో ఉన్న వారికి ఎన్నో గురుతరమైన బాధ్యతలు ఉంటాయి. విశ్వవిద్యాలయాలకు సంబంధించిన నియామకాల్లో రాజకీయాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని