logo

వైకాపా పాలకుల నిర్లక్ష్యం.. విద్యార్థులకందని పౌష్టికాహారం

వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. జిల్లాలో తొలి రోజు నుంచే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. అయితే చిక్కీలు, కోడిగుడ్లు లేకుండానే విద్యార్థులకు భోజనం వడ్డన చేయడం కనిపిస్తోంది.

Published : 16 Jun 2024 06:25 IST

గుత్తేదారులకు చెల్లించని బకాయిలు

ఈనాడు, అమరావతి: వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. జిల్లాలో తొలి రోజు నుంచే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. అయితే చిక్కీలు, కోడిగుడ్లు లేకుండానే విద్యార్థులకు భోజనం వడ్డన చేయడం కనిపిస్తోంది. వాటికి సంబంధించిన సరఫరాదారులకు బిల్లులు పేరుకుపోయాయని వారు పంపిణీ చేయడం లేదు. అందువల్లే అవి లేకుండా భోజనం పెడుతున్నామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. గుంటూరు జిల్లాలో ఎక్కడా వాటి నిల్వలు లేవు. పల్నాడు, బాపట్ల జిల్లాలకు కొత్త చిక్కీలు కొన్ని స్కూళ్లకు పంపడంతో అక్కడ పంపిణీ చేస్తున్నారు. కోడిగుడ్లు కూడా అన్ని స్కూళ్లల్లో లేవు. బకాయిలు ఉన్నాయని గుడ్ల సరఫరాదారు సరకు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం చిక్కీలు, కోడిగుడ్ల సరఫరాదారులకు బిల్లులు ఇవ్వకపోవడం వల్లే ఈ సమస్య వచ్చింది. తమకు బకాయిలు చెల్లించాలని గుత్తేదారులు స్పష్టం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ఆ బిల్లులపై ఒక నిర్ణయం తీసుకుంటే కానీ చిక్కీలు, గుడ్ల సమస్య పరిష్కారం కాదు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టక ముందే ఉన్నతాధికారులు స్పందించి చిక్కీలపై జగన్‌ చిత్రం లేకుండా చర్యలు తీసుకున్నారు. 

రవాణా వ్యయాలు ఎలా?

మధ్యాహ్న భోజనానికి అవసరమైన బియ్యాన్ని ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా పంపుతుంది. ఆ బియ్యాన్ని రేషన్‌ డీలర్లు ఇప్పటివరకు ఎండీయూ వాహనాల ద్వారా స్కూళ్లకు చేర్చేవారు. దీంతో ప్రధానోపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం ఎండీయూ వాహనాలు పాడయ్యాయని, పాఠశాల పాయింట్‌కు బియ్యం బస్తాలు చేర్చలేమని తమ వద్దకు వచ్చి తీసుకెళ్లాలని రేషన్‌ డీలర్లు హెచ్‌ఎంలకు సూచిస్తున్నారు. డీలర్‌ వద్ద నుంచి బడికి ఒక్కో బస్తా చేర్చడానికి రవాణా వ్యయాలు రూ.50 నుంచి రూ.వంద వరకు ఆటో కిరాయి, కూలీ కింద వసూలు చేస్తున్నారు. ఈ వ్యయాలు ఎక్కడి నుంచి అధిగమించాలని హెచ్‌ఎంలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి రెండు, మూడు రోజులకు ఒకసారి 50 కిలోల బస్తా అయిపోతుంది. ఇలా ప్రతి బస్తాకు రూ.50 చొప్పున రవాణా వ్యయాలు లెక్కిస్తే నెలకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఖర్చు వస్తుంది. ఈ మొత్తాన్ని ఎన్నాళ్లు భరించాలని వారంటున్నారు. మరోవైపు పాఠశాల ఖాతాలో నిధులు కూడా లేవని, ఉన్న కొద్దిపాటి నిధులను వీటికి వెచ్చిస్తే సుద్దముక్కల కొనుగోలు, ఇతర అత్యవసరాలు ఏర్పడితే వాటికి ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టాలని ప్రధానోపాధ్యాయులు లబోదిబోమంటున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని