logo

హత్య కేసులో ఏడుగురి అరెస్టు

ఓ వ్యక్తి ఆర్థికంగా స్థిరపడాలనే దురాశతో మరో ఐదురుగురితో కలిసి బావమరిదిని హత్య చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు దొరికి అంతా జైలు పాలయ్యారు.

Published : 16 Jun 2024 06:11 IST

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: ఓ వ్యక్తి ఆర్థికంగా స్థిరపడాలనే దురాశతో మరో ఐదురుగురితో కలిసి బావమరిదిని హత్య చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు దొరికి అంతా జైలు పాలయ్యారు. నల్గొండ జిల్లా కనగల్‌లోని వంతెన వద్ద గత నెల 19న అనుమాన స్పద స్థితిలో మృతి చెందిన సముద్రాల కృష్ణ(51)ది హత్య అని తేల్చినట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. శనివారం ఎస్పీ అందించిన వివరాల మేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట ప్రాంతానికి చెందిన సముద్రాల కృష్ణ (అవివాహితుడు) ఒంటరిగా జీవిస్తున్నారు. కృష్ణకు వరసకు బావ అయిన నాగబండి మధు ప్రస్తుతం హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఉంటూ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన కమ్మ శ్రీనివాస్‌రావు, అదే ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఉస్మాన్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతానికి చెందిన యల్లా కృష్ణ చైతన్య, అదే ప్రాంతానికి చెందిన సలాది మణికంఠ, అడప హరికృష్ణలతో పరిచయం ఏర్పడింది. దీంతోపాటు రైస్‌పుల్లింగ్‌ కోసం ఆరు నెలల కిందట సముద్రాల కృష్ణ అనే వ్యక్తి నాగబండి మధుతో బెంగళూరులోని ఓ వ్యాపారి వద్ద రూ.1.50 కోట్లు పెట్టుబడి పెట్టించాడు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మధు డబ్బు సాయం చేయాలని కృష్ణను కోరాడు. డబ్బులు ఇవ్వక పోవడంతో ఎలాగైనా కృష్ణను హత్య చేసి అతడి చర, స్థిరాస్తులు స్వాధీనం చేసుకోవాలని మిగిలిన ఆరుగురితో కలిసి పథకం వేసుకున్నారు. గత నెల 16న సముద్రాల కృష్ణ ఇంటికి వెళ్లిన వీరు అతడి గొంతు నులిపి ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు సైనైడ్‌ వేసి హత్య చేశారు. మృతి చెందాడని నిర్ధారించుకున్న తరువాత బంగారం, వెండి వస్తువులు, రూ.45 వేల నగదు తీసుకుని కృష్ణ మృతదేహాన్ని ఆయన కారులోనే పోలీసులు, టోల్‌గేట్‌ తనిఖీలు లేని ప్రాంతాల నుంచి వంద కిలో మీటర్లకు పైగా దూరంలో ఉన్న కనగల్‌ వాగు నుంచి కిందకు పడేశారు. వాడపల్లి వద్ద కృష్ణానదిలో సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్, మృతుడి చరవాణి, ఖాళీ పెప్పర్‌ స్పే బాటిల్‌ పడేసి పరారయ్యారు. ఎత్తుకెళ్లిన బంగారం ఆభరణాలను నరసరావుపేట ప్రాంతానికి చెందిన షేక్‌బాబాకు విక్రయించగా వచ్చిన రూ.3 లక్షల నగదును తలో రూ.60 వేల చొప్పున పంపకాలు చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో నల్గొండ మర్రిగూడ బైపాస్‌ వద్ద నాగబండి మధు, కమ్మ శ్రీనివాస్‌రావులను అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో మొత్తం ఏడుగురిని అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి రూ.11.45 లక్షల విలువ చేసే రెండు కార్లు, 50 తులాల వెండి, ఐదు చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని