logo

నాన్న ఓ వరం.. వెలకట్టలేని త్యాగం

నాన్నే మనందరి తొలి హీరో. కష్టాలు, కన్నీళ్లు దిగమింగుతూ బిడ్డల ఎదుగుదలకు నిరంతరం తపించే ఓ తపస్వి. ఓటమి పలకరించినప్పుడు  నేనున్నానంటూ ధైర్యం నూరిపోసే ఓ యోధుడు. అడుగులు తడబడితే సరిచేసే ఓ స్నేహితుడు.

Published : 16 Jun 2024 06:24 IST

నేడు ఫాదర్స్‌ డే

నాన్నే మనందరి తొలి హీరో. కష్టాలు, కన్నీళ్లు దిగమింగుతూ బిడ్డల ఎదుగుదలకు నిరంతరం తపించే ఓ తపస్వి. ఓటమి పలకరించినప్పుడు  నేనున్నానంటూ ధైర్యం నూరిపోసే ఓ యోధుడు. అడుగులు తడబడితే సరిచేసే ఓ స్నేహితుడు. విజేతలకు సైతం ప్రపంచాన్ని పరిచయం చేసే ఓ దిక్సూచి. ఎన్నిచ్చినా..ఏం చేసినా ఆ త్యాగానికి వెలకట్టలేం. నేడు ‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా ప్రత్యేక కథనం.


జీవితాన్నే అర్పించే దైవం 

సోమన్న (పాత చిత్రం), బూర్ల రామాంజనేయులు

ప్రత్తిపాడు: కన్న బిడ్డలకు తండ్రి సర్వం అర్పించి జీవితాన్ని ఇస్తాడు. నాన్న సోమన్న కష్టం వల్లే ఐఏఎస్‌గా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాను. చిన్నతనంలో నాన్న మాకు దూరమైనప్పటికీ ఆయన చూపిన మార్గం, ఆదర్శాలతో ఇప్పటికీ పయనిస్తున్నాం. నిజాయితీ, పట్టుదల ఉండాలని ఆయన తరచూ చెప్పిన మాటలే నేటికీ మా అన్నదమ్ములకు విజయ సూత్రాలు. తండ్రి స్థానం గురించి ఎమ్మెల్యే చెప్పిన మాటల్లో... తండ్రి బిడ్డలకు రూపాన్ని ఇస్తాడు. తల్లి మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. వీరిద్దరే మనకు కంటి ముందు కనపడే దేవతలు. మనలో ఏ గొప్పతనం ఉన్నా వారిచ్చిందే. తండ్రి సోమన్న పేరుతో స్వగ్రామమైన కర్నూలు జిల్లా ఆలూరులో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ఆర్థికసాయం చేస్తున్నాం. 

డాక్టరు బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్యే, ప్రత్తిపాడు 


తీర్చుకోలేని రుణం..

తండ్రి రవిప్రసాద్‌తో ఎమ్మెస్కే

మేడికొండూరు: మేడికొండూరుకు చెందిన మన్నవ రవిప్రసాద్, కమలాదేవి దంపతులకు నేను రెండో సంతానం. ఎవరైనా జీవితంలో ఎదిగితే అలాంటి వాళ్లకు తల్లిదండ్రుల సాకారం తప్పనిసరిగా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టం. ఆ దిశగా నాన్న ఎంతో ప్రోత్సహించేవారు. ఆరో తరగతి చదువుతున్న సమయంలో జిల్లా క్రికెట్‌ జట్టుకు ఎంపికయ్యాను. కొద్ది రోజులకే ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడలో సెంట్రల్‌ జోన్‌  పోటీలు నిర్వహించారు. అభ్యర్థులంతా తమ పుట్టిన రోజుకు సంబంధించి ఒరిజినల్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకోవాలని చెప్పారు. కానీ ముందు రోజే విజయవాడ చేరుకోవడంతో ఆ పత్రం తెచ్చుకోలేకపోయా. కొద్దిసేపటిలో పోటీలు ప్రారంభమవుతాయనగా నాన్న సర్టిఫికెట్‌ తెచ్చి ఇచ్చారు. దానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. తెల్లవారుజామున స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఇంటికి వెళ్లగా.. గేటుకు తాళం వేసి ఉంది. దీంతో గోడ దూకి మరీ లోపలికి వెళ్లి సర్టిఫికెట్‌ అవసరాన్ని ప్రిన్సిపల్‌కు వివరించారు. బడి తెరవకముందే దాన్ని తీసుకుని విజయవాడ వచ్చారు. ఆయన రుణం తీర్చుకోలేనిది.

మన్నవ శ్రీకాంత్‌ ప్రసాద్‌ (ఎమ్మెస్కే), బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌


ప్రజా సేవకు ఆయనే స్ఫూర్తి..

తండ్రి జ్వానేసుతో ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ (పాత చిత్రం) 

తుళ్లూరు: స్వామ్యవాద భావాలు ఉన్న తండ్రి జ్వానేసు స్ఫూర్తితోనే ప్రజాసేవలోకి వచ్చా. ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఉప్పుడి అనే చిన్న పల్లెటూరిలో జన్మించా. తల్లిదండ్రులు జ్వానేసు, అన్నమ్మ దంపతులు ఇరువురూ ఉపాధ్యాయులే. చిన్ననాటి ఆయన నేర్పిన క్రమశిక్షణతో మెలిగేవారం. వృత్తిరీత్యా నాన్న అనేక పాఠశాలల్లో పనిచేశారు. ఎక్కడ ఉన్నా 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేసేవారు. మమ్మల్ని క్రమం తప్పకుండా గ్రంథాలయాలకు పంపి పుస్తక పఠనాన్ని అలవర్చారు. ఇప్పుడు రాజకీయ రంగంలో ఆ జ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతోంది. నాన్న మంచి ఉపాధ్యాయుడే కాకుండా పౌరాణిక నాటికలకు దర్శకత్వం వహించేవారు. కబడ్డీ కోచ్‌గా ఎంతో మందిని తర్చిదిద్దారు. యూటీఎఫ్‌ జిల్లా జనరల్‌ సెక్రటరీగా పని చేసి ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేశారు. ఆయన ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వచ్చిన డబ్బుతో గ్రామంలో రోడ్లు, తాగు నీటి ట్యాంకు నిర్మించడం నాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చింది. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా పోరాడాలని, ఓటమి దరిచేరినప్పుడు కుంగిపోకూడదని ఆయన చెబుతుండేవారు. ఇప్పటికీ అదే నాకు దివ్యమంత్రం.

తెనాలి శ్రావణ్‌ కుమార్, ఎమ్మెల్యే, తాడికొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని