logo

బదిలీలపై ఉత్కంఠ

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో జిల్లా అధికారులతో పాటు డివిజన్, మండల స్థాయి అధికారుల బదిలీలపై ఉత్కంఠ నెలకొంది.

Published : 17 Jun 2024 04:23 IST

దీర్ఘకాలం పని చేసిన అధికారులకు స్థానచలనం?

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో జిల్లా అధికారులతో పాటు డివిజన్, మండల స్థాయి అధికారుల బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో దీర్ఘకాలం కొనసాగుతున్న అధికారులను బదిలీ చేసేందుకు ప్రభుత్వ పెద్దలు భావించడమే దీనికి కారణం. జిల్లాలో కొందరు అధికారులు మూడు నుంచి అయిదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది గత ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. కొందరు పైరవీలు చేసి కీలక స్థానాలు పొందారు. ఎన్నికల సమయంలోనూ వైకాపాకు అనుకూలంగా విధులు నిర్వహించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రతి పనికీ ఓ ధర నిర్ణయించి తమ వ్యక్తిగత సిబ్బంది ద్వారా వసూళ్ల పర్వానికి దిగారనే విమర్శలు సైతం ఉన్నాయి. వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులతో సన్నిహిత సంబంధాలు నిర్వహించి కమిషన్లు పంచుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇలాంటి అధికారుల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. 

ఎక్కడకు పంపిస్తారోనని..

ప్రభుత్వం జిల్లా అధికారులు, ఉద్యోగులను సాధారణ బదిలీలు చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. దాంతో తమను ఎక్కడకు బదిలీ చేస్తారోనని భయపడుతున్నారు. 

  • జిల్లా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పని చేస్తున్న ఇద్దరు అధికారులు తమకు బదిలీ తప్పదని భావించి పొరుగు జిల్లాకు వెళ్లేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. 
  • సంక్షేమ శాఖకు చెందిన ఓ అధికారి కూడా బదిలీ తప్పదని ముందస్తుగా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను కలిసి విషయం చెప్పి పొరుగు జిల్లాకు బదిలీ చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సదరు ఎమ్మెల్యే చూద్దాం అనడంతో అక్కడి నుంచి వెళ్లారని సమాచారం. 
  • జిల్లా పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగాలకు చెందిన జిల్లా అధికారులతో పాటు డివిజన్‌ ఈఈలు, సబ్‌ డివిజన్ల డీఈల పేర్లు కూడా జాబితాలో ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. 
  • ప్రభుత్వ శాఖలకు సంబంధించి రాష్ట్ర స్థాయి అధికారులను బదిలీ చేసిన తర్వాత జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉత్తర్వులు జారీ అవుతాయని భావిస్తున్నారు. జీరో సర్వీసుతో బదిలీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉండడంతో ఉద్యోగులు ఎవరికి వారు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని