logo

సుద్దముక్కకు పైసల్లేవు

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిర్వాహకంతో ప్రభుత్వ పాఠశాలల్లో సుద్దముక్కకు పైసలు అందుబాటులోలేని దుస్థితి ఏర్పడింది. రెండు విద్యా సంవత్సరాల్లో పాఠశాల నిర్వహణ గ్రాంట్‌ను ప్రభుత్వం మంజూరు చేయలేదు.

Published : 17 Jun 2024 04:25 IST

రెండేళ్లు పాఠశాల నిర్వహణ నిధులు ఇవ్వని జగన్‌ ప్రభుత్వం
కొత్త ప్రభుత్వంపై గురువుల ఆశలు
సత్తెనపల్లి, న్యూస్‌టుడే 

గన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిర్వాహకంతో ప్రభుత్వ పాఠశాలల్లో సుద్దముక్కకు పైసలు అందుబాటులోలేని దుస్థితి ఏర్పడింది. రెండు విద్యా సంవత్సరాల్లో పాఠశాల నిర్వహణ గ్రాంట్‌ను ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఆ నిధులపై ఆశతో ప్రధానోపాధ్యాయులు పాఠశాలల నిర్వహణ భారాన్ని భరించారు. అదిగో.. ఇదిగో వస్తాయని ఎదురుచూసి చివరకు వారు నిట్టూర్చారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు కూడా పైసా నిధులు ఇవ్వలేదు. తీరా బడిగంట మోగిన తర్వాత పాఠశాలల నిర్వహణ ఖర్చుల భారం గురువులపైనే పడుతోంది. నూతన ప్రభుత్వం విద్యాపరంగా కొన్ని కార్యక్రమాల్ని అమలు చేసింది. పాఠశాల సంసిద్ధతతో పాటు నేను బడికి వెళ్తా కార్యక్రమాల్ని తాజాగా అమల్లోకి తెచ్చింది. వాటితో పాటు రోజువారీ పాఠశాల నిర్వహణకు నిధుల్లేక గురువులు ఇబ్బందిపడుతున్నారు. నిధుల కోసం కొత్త ప్రభుత్వం వైపు చూస్తున్నారు.

  • పాఠశాలల విద్యుత్తు ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని పాఠశాల మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గతేడాది జులైలో ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఫలితంగా విద్యుత్తు శాఖ నుంచి అందిన నోటీసులకు భయపడి పాఠశాలల విద్యుత్తు బిల్లులను ప్రధానోపాధ్యాయులే చెల్లించారు. సుద్ద ముక్కకు కూడా పైసా జగన్‌ ప్రభుత్వం ఇవ్వలేదు. తెల్ల కాగితాలు, రికార్డు పుస్తకాలు, చీపుర్లు, ఇతర సామగ్రికి సైతం ఉపాధ్యాయులే సొంత డబ్బులు వెచ్చించారు.
  • ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేశారు. అవి తిరిగి వస్తాయా లేవా అనే అనుమానాలు ప్రస్తుతం నెలకొన్నాయి.
  • పాఠశాల నిర్వహణ గ్రాంటు (ఎస్‌ఎంజీ) కింద పైసా నిధుల్ని 2023- 24 విద్యా సంవత్సరంలో జగన్‌ ప్రభుత్వం విడుదల చేయలేదు. 2022- 23లోనూ అదే దుస్థితి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా.. 0 నుంచి 30 మందిలోపు ఉంటే రూ.10 వేలు, 31 నుంచి 100 మందిలోపు విద్యార్థులుంటే రూ.25 వేలు, 101 నుంచి 250 మంది విద్యార్థులుంటే రూ.50 వేలు, 251 నుంచి వెయ్యి మందిలోపు ఉంటే రూ.75 వేలు, 1000కి పైబడి ఉంటే రూ.లక్ష వరకు ఇస్తామని మొండిచెయ్యి చూపించారు. మరోవైపు ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చామంటూ చెత్త ప్రచారం చేసుకున్నారు. పాఠశాల నిర్వహణకు పైసా నిధులు ఇవ్వకుండా మెరుగ్గా బడులు ఎలా నడపాలనే ఉపాధ్యాయ సంఘాల ప్రశ్నకు సమాధానం లేదు.
  • వాస్తవానికి పాఠశాల నిర్వహణ గ్రాంట్‌ కింద ఇస్తున్న ఈ నిధులు విద్యుత్తు బిల్లుల చెల్లింపునకు కూడా సరిపోవట్లేదు. పెరిగిన ఖర్చులతో అవి ఏమూలకు సరిపోని పరిస్థితి. జిల్లాలో 1536 పాఠశాలలకు రూ.99 లక్షలు విడుదల చేయాల్సి ఉండగా పైసా ఇవ్వలేదు. రెండేళ్లలో రూ.1.50 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయి. పాఠశాల నిర్వహణ గ్రాంట్‌ సర్దుబాటు కావాల్సి ఉందని, ఉన్నత స్థాయి నుంచి నిధులు మంజూరవగానే బడుల ఖాతాలకు సర్దుబాటు చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
     
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని