logo

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అద్దంకిలో మూడు దొంగతనాలకు పాల్పడిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను సీఐ పి.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆదివారం అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరిచారు.

Published : 17 Jun 2024 04:26 IST

రూ.లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం

అద్దంకి, న్యూస్‌టుడే: అద్దంకిలో మూడు దొంగతనాలకు పాల్పడిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను సీఐ పి.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆదివారం అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరిచారు. ఈనెల 5న పట్టణంలో మూడు చోరీలు చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించి 6న అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. పురపాలక సంఘ కార్యాలయం సమీపంలోని విశ్రాంత న్యాయమూర్తి కేఎంకే.అచ్యుతరావు ఇంట్లో, కాకానిపాలేనికి చెందిన అనంతమ్మ ఇంట్లో, ఆయిల్‌మిల్లు రోడ్డులోని రాజేష్‌ గృహంలో జరిగిన చోరీల్లో పాల్గొన్న ముఠాను అద్దంకి భవానీకూడలి వద్ద అరెస్టు చేశారు. మూడు కేసులకు సంబంధించి వారి వద్ద మొత్తం రూ.4.33 లక్షల విలువైన బంగారం, వెండి, వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. సీఐ అందించిన సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం రాంభద్రాపురం గ్రామానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి, చీమకుర్తికి చెందిన షేక్‌ తరుణ్, నూతలపాటి రాధాకృష్ణ, చింతలపూడి శివప్రసాద్, నరసింహారావులు స్నేహితులు. ఈనెల 5న వీరంతా కారులో అద్దంకి వచ్చారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఆయా ఇళ్లలోని బంగారం, వెండి, వజ్రాలు తీసుకుని స్వగ్రామాలకు చేరుకున్నారు. దొంగతనం చేసిన ఆభరణాలు అమ్మేందుకు ఆదివారం ఉదయం నరసరావుపేటకు బయల్దేరారు. అద్దంకి భవానీకూడలి వద్ద ముందుగా అందిన సమాచారం మేరకు వారి వాహనాన్ని ఆపి, తనిఖీ చేయగా బంగారం, వెండి, వజ్రాలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో ఎక్కడెక్కడ దొంగతనాలు చేశారు, ఎంత సొత్తు అపహరించింది అంగీకరించారు. ఆమేరకు వారిని అరెస్టు చేసి అద్దంకి కోర్టుకు తరలించారు. వేణుగోపాల్‌రెడ్డిపై హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌స్టేషన్‌లో చోరీ కేసు ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని