logo

చెత్తపన్ను నుంచి విముక్తి

చెత్తపన్ను భారం నుంచి పట్టణాల ప్రజలకు విముక్తి లభించింది. వైకాపా పాలనలో గతంలో ఎన్నడూలేని విధంగా చెత్తపన్నును అమల్లోకి తెచ్చి నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపారు.

Updated : 17 Jun 2024 05:09 IST

మౌఖిక ఆదేశాలతో నిలిచిన వసూళ్లు 
ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు ఊరట 
న్యూస్‌టుడే, సత్తెనపల్లి 

చెత్తపన్ను భారం నుంచి పట్టణాల ప్రజలకు విముక్తి లభించింది. వైకాపా పాలనలో గతంలో ఎన్నడూలేని విధంగా చెత్తపన్నును అమల్లోకి తెచ్చి నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపారు. పౌరసేవలకు చెత్తపన్ను ముడిపెట్టి చాలాచోట్ల నిర్భందంగా వసూళ్లు చేశారు. చివరకు సామాజిక భద్రతా పింఛన్లతోపాటు ప్రభుత్వ పథకాల లబ్ధికి చెత్తపన్నును ముడిపెట్టారు. దాని నుంచి తప్పించుకునేందుకు సామాన్యులకు మరో మార్గం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్తపన్ను భారం నుంచి శాశ్వతంగా విముక్తి కలిగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు పురపాలక సంఘాల కమిషనర్లకు చెత్తపన్ను వసూళ్లు నిలుపుదల చేస్తూ ఉన్నతస్థాయి నుంచి మౌఖిక ఆదేశాలు చేశారు. చెత్తపన్ను భారం తొలగించడం సామాన్యులకు మేలు చేస్తోంది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నరసరావుపేట, బాపట్ల, తెనాలి, చిలకలూరిపేట, మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్‌ తదితర చోట్ల వైకాపా ప్రభుత్వం చెత్తపన్ను వసూలు చేసింది. ఇంటింటా చెత్త సేకరణకు నెలకు ప్రతి ఇంటి నుంచి రూ.60, బహుళ అంతస్తుల్లో నివాసముండే వారి నుంచి రూ.90 చొప్పున వసూలు చేసింది. ప్రైవేట్‌ ఏజెన్సీల ఆటోలు పెట్టి వాటికి చెత్త సేకరణ పన్ను చెల్లించాలంటూ మార్గదర్శకాలిచ్చింది. రోజువారీ వసూళ్ల లక్ష్యాల్ని కూడా నిర్ధేశించి హడావుడి చేశారు. వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు చెత్త సేకరణ పన్నులను పౌరసేవలతో ముడిపెట్టి లక్ష్యాల్లో వెనుకబడకుండా పోటీపడ్డారు. పేద కుటుంబానికి ఏడాదికి చెత్త పన్ను రూపంలో రూ.720 చెల్లించడం కష్టమైనా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తమ వద్దకు వచ్చినప్పుడు చెత్తపన్ను చెల్లించలేకపోతున్నామని రద్దు చేయాలని కోరినా సామాన్యుల మొర ఆలకించలేదు. చెత్త పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో సర్వత్రా విమర్శలొచ్చినా గత వైకాపా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. చివరకు ప్రజలే వైకాపా ప్రభుత్వాన్ని ఓటు అస్త్రంతో సాగనంపడంతో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు చెత్తపన్ను వసూళ్లను నిలుపుదల చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పుర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని