logo

మాతాశిశువులకు మేలు జరిగేనా?

పల్నాడు జిల్లాలో 20 లక్షల మంది జనాభా. ఏటా 15వేల శిశు జననాలు.. అయినా మాతా శిశు సంరక్షణకు ప్రత్యేకంగా ప్రసూతి విభాగం లేని దుస్థితి నెలకొంది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు నామమాత్రపు సేవలకే పరిమితమయ్యాయి.

Published : 17 Jun 2024 04:33 IST

నరసరావుపేటలో అధ్వానంగా ప్రసూతి సేవలు 
స్కానింగ్‌ చేసేందుకు వైద్యుల కొరత 
న్యూస్‌టుడే, నరసరావుపేట అర్బన్‌ 

ల్నాడు జిల్లాలో 20 లక్షల మంది జనాభా. ఏటా 15వేల శిశు జననాలు.. అయినా మాతా శిశు సంరక్షణకు ప్రత్యేకంగా ప్రసూతి విభాగం లేని దుస్థితి నెలకొంది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు నామమాత్రపు సేవలకే పరిమితమయ్యాయి. కాన్పులు చేయాలని అధికారులు చెబుతున్నా ఆయా కేంద్రాల్లో ప్రసవాలు జరుగుతున్న దాఖలాలు లేవు. వెనుకబడిన జిల్లాలో రక్తహీనత, రక్తపోటు సమస్యలు తల్లులకు సమస్యగా మారుతున్నాయి. రక్తహీనత ఉండి ప్రసవానికి ప్రభుత్వ వైద్యశాలకు వస్తే గుంటూరు పంపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం మాతా శిశు సంరక్షణకు ప్రత్యేకంగా వైద్యవిభాగం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కోరినా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. 

వసతులు లేని గైనకాలజీ విభాగం

నరసరావుపేటలోని 300 పడకల ఏరియా ప్రభుత్వ వైద్యశాలను ఉన్నతీకరించామని అధికారులు చెబుతున్న మాటలు నీటిమూటలుగా  ఉన్నాయి. కొత్త భవనం నిర్మాణం చేసిన తర్వాత కూడా గైనకాలజీ విభాగాన్ని పల్నాడురోడ్డులోని పాత వైద్యశాలల్లోనే కొనసాగిస్తున్నారు. రోజూ 100 మంది మహిళలు, ఆరోగ్య సమస్యలపై వైద్యశాలకు వస్తుంటారు. వారిలో గర్భిణులు 70 మందికి పైగా ఉంటున్నారు. వీరికి వైద్యపరీక్షలు చేసి ఆరోగ్య పరిస్థితిని తెలియజేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాల్సి ఉంది. ప్రతి గర్భిణికి స్కానింగ్‌ చేసి నివేదిక ఇచ్చేందుకు రేడియాలజిస్టు తప్పనిసరిగా ఉండాలి. కాని రేడియాలజిస్టు నియామకం చేపట్టకపోవడంతో సాంకేతిక సిబ్బందికి శిక్షణ ఇచ్చి బాధ్యతలు అప్పగించారు. వారు సాధారణ పరిస్థితుల్లో ఉన్న వారికే స్కానింగ్‌ చేయగలరు. క్లిష్టమైన సమస్యలు గుర్తించలేరు. అది నిపుణులైన వైద్యులు ఉంటేనే సాధ్యం. దీంతో ప్రైవేటు స్కానింగ్‌ కేంద్రాలకు గర్భిణులను పంపుతున్నారు. దీంతో వారిపై అదనపు భారం పడుతోంది. 


మూలన పడిన 108 వాహనాలు 

అత్యవసర సేవలు అందించడానికి రోగులను తరలించే 108 వాహనాలు నిర్వహణ లేక మూలన పడ్డాయి. రొంపిచర్లలో ఉండాల్సిన వాహనాన్ని నరసరావుపేటలోనే ఉంచి వినియోగిస్తున్నారు. అలాగే నకరికల్లు, సమీప మండలాలకు అంబులెన్స్‌లు అందుబాటులో లేవు. మరమ్మతులకు గురైన వాటిని మార్కెట్‌ యార్డులో నిలిపి ఉంచారు. 


మాతాశిశు వైద్యశాల ఏర్పాటుతో మేలు

జిల్లాలో మాతా శిశు వైద్యశాల ఆవశ్యకత ఉంది. తద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. ప్రత్యేక వైద్యశాలకు సూపరింటెండెంట్, ప్రసూతి వ్యాధులకు సంబంధించిన వైద్యుల నియామకం జరుగుతుంది. అలాగే చిన్నారులకు ప్రత్యేక వైద్యవిభాగం అనుబంధంగా ఉంటుంది. అధునాతన వైద్య పరికరాల ఏర్పాటు చేస్తారు. రక్తహీనత, తదితర సమస్యలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. 


విద్యుత్తు పోతే జనరేటర్‌ వేయరా? 

ప్రతి నెలా రెండో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేత ఉంటుంది. ఆ అంశాన్ని విద్యుత్తుశాఖ అధికారులు ముందుగానే ప్రకటనల ద్వారా తెలియజేస్తారు. అయితే వైద్యశాఖ అధికారులు మాత్రం ఈ విషయం పట్టించుకోవడం లేదు. ప్రతి శనివారం పట్టణంలో విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా సరఫరా నిలిపేస్తారు. వైద్యశాలలో ఉన్న జనరేటర్‌ వేయకపోవడంతో గర్భిణులు, బాలింతలకు ఉక్కపోత తప్పడం లేదు. వార్డులోని పంకాలు పని చేయకపోవడంతో చిన్నారులు, బాలింతులు అవస్థలు పడుతున్నారు. వైద్యశాలలో నిధుల కొరత కారణంగా జనరేటర్‌ వేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని