logo

చైనాలో పందిళ్లపల్లి కుర్రోడి సత్తా

ఆ యువకుడి చిన్నతనంలో విధి వక్రీకరించింది... దీంతో కుడిచేయి మణికట్టు పై వరకు పోగొట్టుకున్నారు.. అయినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు..

Published : 17 Jun 2024 04:36 IST

వేటపాలెం, న్యూస్‌టుడే 

ఆ యువకుడి చిన్నతనంలో విధి వక్రీకరించింది... దీంతో కుడిచేయి మణికట్టు పై వరకు పోగొట్టుకున్నారు.. అయినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు... వాలీబాల్‌ ఆటలో ప్రావీణ్యం సంపాదించారు.. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభ కనబరిచారు... అతడే పిచ్చుక నాగరాజు.

వేటపాలెం మండలం పందిళ్లపల్లి.. నాగరాజు సొంతూరు. చిన్నప్పుడు ప్రమాదంలో కుడిచేయి మణికట్టు వరకు తీసివేశారు. అయినా కృషి, పట్టుదలతో వాలీబాల్‌ ఆటలో మెలకువలు నేర్చుకుని, రాణిస్తున్నారు. దాదాపు 14 సంవత్సరాలుగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని పతకాలు కైవసం చేసుకున్నారు. తాజాగా గత నెల చైనాలో జరిగిన పారా వాలీబాల్‌ పోటీల్లో దేశం తరఫున వెళ్లిన ఆటగాళ్ల బృందానికి ఇతడు కెప్టెన్‌గా వ్యవహరించారు. మొదటి రెండు రోజుల పాటు విజేతగా నిలిచారు. చివరకు పోలాండ్‌పై జరిగిన బెస్ట్‌ ఆఫ్‌ మ్యాచ్‌లో తొలి రెండు ఆటల్లో ఓటమి చూడడంతో ద్వితీయ స్థానంలో నిలిచి, కాంస్య పతకాన్ని సంపాదించారు. ఇప్పటి వరకు 2009లో కాంబోడియా, 2011 జర్మనీలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని రజిత, కాంస్య పతకాలు కైసవం చేసుకున్నారు. ఇక జాతీయ స్థాయిలో బెంగళూరు, జయపూర్, చంఢీగర్, చెన్నైలలో జరిగిన పోటీలకు హాజరై అక్కడా వెండి పతకాలు పొందారు. పోటీలు ఎక్కడ ఉన్నా దానికి ముందుగానే కొన్ని రోజుల పాటు రోజుకు పదిగంటల చొప్పున సాధన చేస్తానని ‘న్యూస్‌టుడే’కు నాగరాజు తెలిపారు. మన దేశం తరఫున ఒలింపిక్‌లో ఆడాలనేది తన ఆశయమని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా తనకు చేయూత అందిస్తే మరిన్ని పోటీలకు వెళ్లి విజయం సాధించేందుకు కృషిచేస్తాననే ధీమాను వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని