logo

మృత్యు మార్గాలు

రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. శిథిలావస్థ వంతెనలు, అధ్వాన రహదారులు, ప్రమాదకర మలుపులు, అతి వేగం, రోడ్డు నిర్మాణ లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

Updated : 17 Jun 2024 05:00 IST

రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందల మంది మృత్యువాత 
శిథిల వంతెనలు, అధ్వానదారులతో ఘటనలు
న్యూస్‌టుడే, బాపట్ల 

రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. శిథిలావస్థ వంతెనలు, అధ్వాన రహదారులు, ప్రమాదకర మలుపులు, అతి వేగం, రోడ్డు నిర్మాణ లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నా 72 ప్రాంతాలను ఏడాదిన్నర క్రితం జిల్లా రహదారి భద్రతా కమిటీ గుర్తించింది. వేగ నియంత్రికలు ఏర్పాటు చేయటంతో పాటు మలుపుల వద్ద రహదారుల విస్తరణ, రక్షణ గోడల నిర్మాణం రైల్వే రోడ్డు వంతెనల వద్ద నిర్మాణ లోపాలు సరిద్దాలని కమిటీలో అధికారులు నిర్ణయాలు తీసుకున్నా అమలు కాలేదు. కొత్త ప్రభుత్వ హయాంలో శిథిలావస్థ వంతెనలకు మోక్షం లభించాల్సి ఉంది.  

  • బాపట్ల మండలంలో వెదుళ్లపల్లి-పర్చూరు ఆర్‌అండ్‌బీ రహదారిలో పేరలి కాలువ వంతెన రక్షణ గోడలు పూర్తిగా కూలిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి. నిత్యం ఈ మార్గంలో ఆర్టీసీ, కళాశాలలు, పాఠశాలల బస్సులు, లారీలు, ట్రాక్టర్లు తిరుగుతున్నాయి. వాహనాలు అదుపుతప్పి వంతెన పైనుంచి కాలువలో పడితే పెను ప్రమాదంతో పాటు ప్రాణనష్టం సంభవిస్తుంది. 
  • బాపట్ల-గుంటూరు రోడ్డు అత్యంత రద్దీగా ఉండే మార్గం. ఈ రహదారిలో అప్పికట్ల మురుగుకాలువపై వంతెన శిథిలావస్థకు చేరి పగుళ్లిచ్చింది. వేగంగా వచ్చే వాహనాలు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్తున్నాయి. వంతెనకు మరమ్మతులు చేసి ప్రమాదాలు నివారించాలి. బాపట్ల మండలం గుడిపూడి నుంచి కర్లపాలెం మండలం యాజలి వెళ్లే మార్గంలో తుంగభద్ర కాలువపై వంతెన రక్షణ గోడ కొంతభాగం కూలిపోయింది. 
  • 216ఏ జాతీయ రహదారి విస్తరణ పనులు రేపల్లె మండలం పెనుమూడి నుంచి బాపట్ల మండలం స్టూవర్టుపురం వరకు 65 కి.మీ. పొడవున పూర్తి చేశారు. చందోలు, యాజలి, బుద్దాం, కర్లపాలెం వద్ద గత రెండున్నరేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 15 మంది మృతి చెందారు. బుద్దాం తూర్పు తుంగభద్ర వంతెన సమీపంలో మలుపుల వద్ద ధాన్యం, గడ్డి ట్రాక్టర్లు బోల్తా పడుతున్నాయి.  


ట్రామా కేర్‌ కేంద్రం ఏర్పాటు అత్యవసరం 

వేమూరు మండలం జంపని సమీపంలో ప్రమాదకర మలుపు ఉంది. 2022 నవంబరులో ఈ మలుపు వద్ద వాహనం అదుపుతప్పి కాలువలోకి వెళ్లడంతో ఐదుగురు అయ్యప్పదీక్షదారులు మృత్యువాతపడ్డారు. వేమూరు విద్యుత్‌ ఉపకేంద్రం సమీపంలో, దోనేపూడి-కొల్లూరు రోడ్డు మలుపుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మూడు చోట్ల ప్రమాదాల నివారణకు రహదారిని విస్తరించాల్సి ఉన్నా నిధులు లేవని ఆర్‌అండ్‌బీ శాఖ చేతులెత్తేసింది. బాపట్ల-పల్నాడు జిల్లాల సరిహద్దులో మే 14 అర్ధరాత్రి టిప్పర్‌ను ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులకు సత్వర వైద్యం అందక చనిపోతున్నారు. క్షతగాత్రులను దూరంలోని గుంటూరు లేదా ఒంగోలు తరలించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రిలో క్షతగాత్రులకు అత్యవసరం వైద్యం అందించటానికి ట్రామాకేర్‌ సెంటర్‌ అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. 


ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు

- సురేష్, జిల్లా రవాణాశాఖాధికారి 

జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు, శాస్త్రీయ కారణాలు గుర్తించాం. మానవ తప్పిదాల వల్లే ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వంతెనల వద్ద వాహనాలు అదుపు తప్పి పడిపోకుండా ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు చేపడతాం. వాహనదారులకు అవగాహన కల్పించి ప్రమాదాలు జరగకుండా పోలీసు, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ అధికారులతో కలిసి పని చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని