logo

గుణాత్మక విద్యను దెబ్బతీసే జీవో రద్దు చేయాలి

గుణాత్మక విద్యను దెబ్బతీసి ఉపాధ్యాయులపై పనిభారం పెంచుతూ గత ప్రభుత్వం తెచ్చిన జీవోనం.117ను రద్దు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

Updated : 17 Jun 2024 05:07 IST

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: గుణాత్మక విద్యను దెబ్బతీసి ఉపాధ్యాయులపై పనిభారం పెంచుతూ గత ప్రభుత్వం తెచ్చిన జీవోనం.117ను రద్దు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక కొత్తపేట మల్లయ్యలింగం భవన్‌లో ఆదివారం రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో సాయిశ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధనకు అడ్డుగా ఉన్న యాప్‌లను రద్దు చేయాలన్నారు. 12వ పీఆర్‌సీ అమలు పరిచేలోపు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులను సమావేశ పరిచి ఐఆర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఏఐఎస్‌టీఎఫ్‌ జాతీయ ఆర్థిక కార్యదర్శి జోసఫ్‌ సుధీర్‌బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న టోఫెల్‌ను కూడా రద్దు చేయాలన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలలో ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ని నియమించి ఉపాధ్యాయులకు బోధనేతర పనులను తగ్గించాలని, ఆర్థిక బకాయిలైన పీఆర్‌సీ, డీఏ అరియర్స్, బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు పెదబాబు మాట్లాడుతూ డిమాండ్‌ల పరిష్కారం కోసం సంఘం బలోపేలానికి ప్రతి ఒక్క కార్యకర్త భాగస్వామ్యం కావాలన్నారు. పుస్తకాలు, యూనిఫారం స్కూల్‌ పాయింట్‌కు అందేలా ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, రాష్ట్ర సహాధ్యక్షుడు రామచంద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసిమళ్ల ప్రసాద్, జిల్లా ఆర్థిక కార్యదర్శి వీరాంజనేయులు, జిల్లా గౌరవాధ్యక్షుడు ప్రసాద్‌బాబు, రాష్ట్ర కౌన్సిలర్లు బాజీ, జోసెఫ్, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని