logo

నగరపాలక సంస్థలో అవినీతిపై విచారణ జరిపించండి

గుంటూరు నగరపాలక సంస్థలో గత అయిదేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని నారెడ్కో అధ్యక్షుడు నాగవంశీ కోరారు.

Published : 17 Jun 2024 04:46 IST

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు నగరపాలక సంస్థలో గత అయిదేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని నారెడ్కో అధ్యక్షుడు నాగవంశీ కోరారు. పురపాలక శాఖ మంత్రి నారాయణను ఆదివారం ఆయన మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు నగరపాలక సంస్థలోని టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో జరిగిన అవినీతిని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయిదేళ్లుగా కమిషనర్, సిటీ ప్లానర్, డిప్యూటీ సిటీ ప్లానర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్స్‌ అనుమతులు సకాలంలో ఇవ్వకండా ఇబ్బంది పెట్టిన తీరును వివరించామన్నారు. వసూళ్లపై ఉన్న శ్రద్ధ అనుమతుల మంజూరులో చూపలేదని, ఆక్యుపెన్సీ ఇచ్చాక మార్ట్‌గేజ్‌ ఇవ్వకుండా నెలల తరబడి జాప్యం చేయడంతో తాము తీవ్రంగా నష్టపోయామన్నారు. ఎన్నో ఇబ్బందులు పెట్టారని, సీఆర్‌డీఏ నిబంధనలు తుంగలో తొక్కి గుంటూరు నగరపాలక సంస్థలో ఏవిధంగా ప్రత్యేక రాజ్యాంగం నడిపారో తెలియజేసి, ఈ అక్రమాలన్నింటిపై విచారణ జరిపించాలని కోరామన్నారు. దీనికి మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించి సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారన్నారు. కార్యక్రమంలో నారెడ్కో ప్రతినిధులు శ్రీనాథ్, దుర్గాప్రసాద్, తిరుపతిరావు, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని