logo

కేటాయింపుల్లో కోత

సర్వజనాసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స అందించాలని ప్రభుత్వ ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.

Published : 17 Jun 2024 04:48 IST

సర్వజనాసుపత్రికి రావాల్సిన ఆదాయానికి గండి
ఆరోగ్యశ్రీ రోగులకు గత ప్రభుత్వంలో రూ.కోటి బకాయిలు 
గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే

ర్వజనాసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స అందించాలని ప్రభుత్వ ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అయినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో జీజీహెచ్‌లో చికిత్స పొందిన రోగులకు సుమారు రూ.కోటి బకాయిలు ఉండటం గమనార్హం. అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆసుపత్రికి కేటాయింపుల్లో కోత విధించడంతో రావాల్సిన ఆదాయం గణనీయంగా తగ్గిపోయి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఆసుపత్రి అధికారులు ఏం చేయాలో అర్థంకాక మదనపడుతున్నారు. రోగుల సంఖ్య పెరిగిన దామాషాలో ఆదాయం పెరగకపోగా, ఖర్చులు అధికం కావడంతో చెల్లింపులు చేయలేకపోతున్నారు. 2023లో చికిత్స పొందిన రోగులకు ఇప్పుడు బకాయిలు చెల్లించడం ప్రారంభించడం గమనార్హం. 

రోగులకు ఖర్చు 

గుంటూరు సర్వజనాసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద రోగి పేరు నమోదు కాగానే ఆసుపత్రిలో అందుబాటులో లేని ఔషధాలన్నీ బయట నుంచే కొనుగోలు చేయించి బిల్లులు ఇవ్వాల్సిందిగా గతంలో వైద్యులు సూచించేవారు. రోగి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేయగానే రోగి కొనుగోలు చేసిన మందుల ఖర్చులు, ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడు రోజుకు రూ.100 వంతున డైట్‌ ఛార్జీలు, రోగి ఇంటి నుంచి ఆసుపత్రికి రానుపోను ఛార్జీలు కలిపి మొత్తాన్ని అతని బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఆసుపత్రికి ఆదాయం లేకపోగా ఆరోగ్యశ్రీ కేటాయింపుల్లో కోత విధించడంతో రోగులకు సకాలంలో బకాయిలు చెల్లించలేకపోతున్నారు.

కొత్త జీవోలతో చిక్కులు 

గత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి కార్పొరేషన్‌(ఏపీఎంఈఆర్‌సీ)కి 40 శాతం నిధులను ఆరోగ్యశ్రీ పథకం కింద జీజీహెచ్‌కి వచ్చే మొత్తం నుంచి నేరుగా మినహాయించుకునేలా 2021, జూన్‌ 25న జీవో ఇచ్చారు. ఈ మొత్తాన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలు, ఆసుపత్రుల అభివృద్ధికి వినియోగించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి. 2022, అక్టోబరు 27న జారీ చేసిన మరో జీవోలో రోగులకు చికిత్స అందించిన వైద్యులు ఇతర సిబ్బందికి 25 శాతం, 5 శాతం రివాల్వింగ్‌ ఫండ్, పేషెంట్‌ కేర్‌ కింద 30 శాతం ఇస్తామని ప్రకటించారు. 40 శాతం నిధులను మాత్రం ఏపీఎంఈఆర్‌సీకి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం పాత జీవోలని రద్దుచేసి ఆరోగ్యశ్రీ నిధులు కేటాయించాలని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల ఆసుపత్రికి ఆర్థిక కష్టాలు తొలగిపోయి రోగులకు కూడా మేలు కలుగుతుందని వివరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని