logo

చేయి తడిపితేనే అనుమతులు లేకుంటే కొర్రీలు

భవన నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పట్టణ ప్రణాళికాధికారులు కొందరు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు.

Published : 17 Jun 2024 04:58 IST

అవినీతిమయంగా గుంటూరు నగరపాలక సంస్థ
ప్రణాళికా విభాగంపై  పలు ఆరోపణలు
ఈనాడు-అమరావతి

భవన నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పట్టణ ప్రణాళికాధికారులు కొందరు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. అన్ని పత్రాలు సరిగా ఉన్నా వెంటనే అనుమతులు ఇవ్వకుండా చేయితడిపిన వారికి మాత్రమే  మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాము ఆశించిన మొత్తం ఇవ్వని వారికి అనుమతులు ఇవ్వడానికి కొర్రీలపై కొర్రీలు విధిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల బిల్డర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు బాహాటంగానే ఆరోపించారు.

కావాలనే ఇబ్బందులు పెడుతూ..

2022 నుంచి ఈనెల 11 వరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 4403 మంది భవన నిర్మాణాలకు ప్లాన్లు కోరుతూ దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో 726 అర్జీలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి.  ఏడాదికి పెగాౖ ఈ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు ఈ భవన అనుమతులకు సంబంధించిన డీపీఎంఎస్‌ పోర్టల్‌లో పురోగతి తెలుసుకునే అవకాశం ఉంది. కానీ ఎందుకు పెండింగ్‌లో పెట్టారని ప్రశ్నించిన పాపాన పోలేదు. వారు మౌనంగా ఉండిపోవడానికి ప్రణాళికాధికారులు కొందరు ముక్కుపిండి వసూలు చేసే మొత్తంలో నుంచి ఎవరి వాటాలు వారికి ముడుపులు అందడమే కారణం.  అధికారుల తీరుతో బిల్డర్లు , ఇతర నిర్మాణదారులు విసిగిపోతున్నారు. ఇందుకు శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో చోటుచేసుకున్న వివాదమే నిదర్శనం.

అధికారుల ఎదుటే వాగ్వాదం

బిల్డర్లు తమ సమస్యలను కమిషనర్‌కు చెప్పుకునేందుకు శుక్రవారం ఉదయం నగరపాలక ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అప్పటికి కమిషనర్‌ ఇంకా ఛాంబర్‌కు రాలేదని తెలుసుకుని వారంతా ప్రణాళిక విభాగానికి చేరుకుని సిటీ ప్లానర్‌(సీపీ)తో సమావేశమయ్యారు. ఆయనతో ప్రణాళికా విభాగం తీరు బాగోలేదని ప్రతి పనికి డబ్బులు ఆశించి దస్త్రాలు పెండింగ్‌లో పెడుతున్నారని చెప్పి కమిషనర్‌ను కలవడానికి బయటకు రాగా అదే సమయంలో వారికి డిప్యూటీ సిటీప్లానర్‌ మహాపాత్ర తారసపడ్డారు.  ఈ అధికారే తమను ఇబ్బంది పెడుతున్నారని బిల్డర్లు, అధికారులు కార్యాలయంలోనే వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది. అనంతరం కమిషనర్‌ను కలిసి బిల్డర్లు తమ సమస్యలు వివరించారు.

ఆధారాలు చూపించినా చర్యలు లేవు

నగర ప్రణాళిక విభాగం అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని బాహాటంగానే ఆధారాలతో సహా భవన నిర్మాణదారులు పలువురు బయటపెట్టారు. నిర్మాణాలకు అనుమతులిచ్చి తీరా ఆక్యుపెన్సీ ఇచ్చేటప్పుడు ఖాళీస్థలం పన్ను, నాలా పన్ను పెండింగ్‌లో ఉన్నాయని ఆ పత్రం ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. భవనం పూర్తయిన తర్వాత పెండింగ్‌లో పెట్టడం ఏమిటి? నిర్మాణం చేపట్టే క్రమంలోనే వాటిని గుర్తించి నిలుపుదల చేయాలి? ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మిస్తే  తనిఖీలకు వెళ్లిన సమయంలోనే దాన్ని కూల్చాలి. అవేం చేయకుండా ఇప్పుడు ఎలాగూ నిర్మాణం పూర్తయింది కదా? ఆక్యుపెన్సీ పత్రం ఇవ్వకుండా ఇబ్బంది పెడితే డబ్బులిస్తారని చెప్పి నాడు ఉల్లంఘనల్ని చూసీ చూడనట్లు వదిలేశారనే విమర్శలు లేకపోలేదు. 

పరిశీలనలో ఉన్నాయి 

ప్లాన్లు, ఆక్యుపెన్సీలు ఇవ్వకుండా ప్రణాళికాధికారులు ఇబ్బంది పెడుతున్నారని బిల్డర్లు చేసిన ఆరోపణలపై కమిషనర్‌ చేకూరి కీర్తి వివరణ ఇచ్చారు. ఆక్యుపెన్సీల కోసం 469 దరఖాస్తులు రాగా వాటిల్లో 386 మంజూరు చేశామనీ, మరో 20 షార్టుపాల్స్‌. ఇంకో 65 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు.


నాలా పన్ను విధించడం ఏంటీ

గర నడిబొడ్డున నిర్మించే భవనాలకు నిబంధనలకు విరుద్ధంగా ‘నాలా’ పన్ను చెల్లించాలని అధికారులు కోరడం విచిత్రంగా ఉందని  బిల్డర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు అంటున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి నిర్మాణాలు చేపడితే వాటికి మాత్రమే నాలా పన్ను కట్టాలి. అది కూడా ఈ పన్ను ఆర్డీఓకు చెల్లిస్తారు. నగర ప్రణాళికాధికారులు ఆ పన్ను చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆర్డీఓకు చెల్లించాల్సిన పన్నును ఏ పద్దు కింద తీసుకుంటారో ప్రణాళికాధికారులు సమాధానం చెప్పాలని బిల్డర్లు పట్టుబడుతున్నారు. నాలా పన్ను పెండింగ్‌ ఉందని చెప్పి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకపోవడం, ఆక్యుపెన్సీ పత్రాలు ఇవ్వకుండా తొక్కిపెడుతూ నిర్మాణదారులను ఇబ్బంది పెట్టడం ప్రణాళికా విభాగం తీరు కాబోతుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని