logo

హక్కు పత్రాలకు ఎదురుచూపులు

ఖరీఫ్‌ వ్యవసాయ పనుల సీజన్‌ ప్రారంభమైంది. దుక్కులు దున్నడం, పొలాలకు పశువుల ఎరువు తరలించడం, పంట వ్యర్థాలను శుభ్రం చేసుకోవడం తదితర పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.

Published : 17 Jun 2024 05:01 IST

పత్రాలకు కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు కీలకం 
ఈనాడు-అమరావతి

ఖరీఫ్‌ వ్యవసాయ పనుల సీజన్‌ ప్రారంభమైంది. దుక్కులు దున్నడం, పొలాలకు పశువుల ఎరువు తరలించడం, పంట వ్యర్థాలను శుభ్రం చేసుకోవడం తదితర పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. భూముల కౌలు ధరలు సైతం ఖరారవుతున్నాయి. పంటల సాగుకు సిద్ధమైన తరుణంలో కౌలురైతులకు కీలకమైన పంటసాగుహక్కు పత్రాల జారీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. 

మ్మడి గుంటూరు జిల్లాలో సాగుదారుల్లో 70శాతం వరకు కౌలు రైతులు ఉన్నారు. సొంత పొలం సాగు చేసుకుంటూ మరికొంత పొలం కౌలుకు తీసుకుని సాగుచేసే రైతులు ఎక్కువగా ఉన్నారు. ఏప్రిల్‌ నెల ప్రారంభం నుంచి పంటసాగుహక్కు పత్రాలు(సీసీఆర్‌సీ) జారీ చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలు రావడం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, అధికారుల బదిలీల నేపథ్యంలో సీసీఆర్‌సీ మంజూరు ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసి సకాలంలో కౌలు రైతులకు అందేలా చూస్తే వారికి ప్రయోజనం కలుగుతుంది. 

సింహభాగం వారిదే

గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో భూయజమానుల కంటే కౌలురైతులే ఎక్కువగా సాగులో ఉన్నారు. వీరందరికీ సకాలంలో పంటసాగుహక్కు పత్రాలు మంజూరుచేస్తే విత్తనాల నుంచి పంట ఉత్పత్తులు విక్రయం వరకు ప్రతి దశలోనూ వారికి సీసీఆర్‌సీ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. రైతు భరోసా కేంద్రంలోని గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ సచివాలయంలో గ్రామ రెవెన్యూ అధికారి సమన్వయంతో కౌలు రైతులను గుర్తించి కొత్తగా సీసీఆర్‌సీ కార్డులు మంజూరు చేయడం, పాతకార్డుల ఆధారంగా రెన్యువల్‌ చేయడం వంటి పనులు వేగవంతం చేయాలి. 11 నెలల కాలవ్యవధితో కార్డులు మంజూరు చేస్తారు. వీటి ఆధారంగా కౌలుదారులకు పంట రుణాలు, సున్నావడ్డీ, పంటల బీమా, పెట్టుబడి రాయితీ, ధాన్యం సేకరణ, సాగుకు యంత్ర పరికరాలు, రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు వంటివి సరఫరా చేస్తారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి మొదలైనా ఇప్పటికీ నత్తనడకన సాగుతోంది. 

మంజూరులో అప్రమత్తత

పంటసాగు హక్కు ధ్రువపత్రాలు మంజూరు చేయడంలో వీఏఏ, వీఆర్వో సమన్వయంతో జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. గతేడాది సీసీఆర్‌సీ కార్డుల రెన్యువల్‌ సమయంలో లక్ష్యం పూర్తి చేయాలన్న ఉద్దేశంతో అంతకు ముందు ఏడాది ఇచ్చినవాటిని సరైన పరిశీలన చేయకుండానే కొందరు వీఆర్వోలు కార్డులు రెన్యువల్‌ చేశారు. వీటి ఆధారంగా ఈ-పంట నమోదు చేయడంతో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినప్పుడు వాస్తవంగా సాగుచేసిన రైతుకు పెట్టుబడి రాయితీ అందని పరిస్థితి నెలకొంది. ఇలాంటివి పలు గ్రామాల్లో అధికారుల దృష్టికి వచ్చాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని సీసీఆర్‌సీ కార్డులు రెన్యువల్‌ చేసే సమయంలో గతేడాది సాగుచేసిన భూమినే కౌలుకు చేస్తున్నారా? ఈఏడాది చేయడం లేదా? వంటి అంశాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కార్డులు ఇవ్వాలి.  ఈ విషయమై గుంటూరు జిల్లా వ్యవసాయాధికారి నున్నా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇప్పటికే సీసీఆర్‌సీ కార్డుల మంజూరు ప్రక్రియ మొదలైందని వీలైనంత తొందరగా లక్ష్యం పూర్తిచేసే దిశగా పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని