logo

వీరు మారరంతే

రాష్ట్రంలో వైకాపా పాలన పోయి కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడినా ఇంకా కొందరు పోలీసులు వైకాపాకు అండగా నిలుస్తున్నారు. ఆ పార్టీ నాయకులపై అందే ఫిర్యాదులను తేలిగ్గా తీసుకుంటున్నారు.

Published : 17 Jun 2024 05:04 IST

వైకాపా శ్రేణులపై చర్యలకు వెనకడుగు 
పోలీసు ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు 
ఈనాడు-అమరావతి

రాష్ట్రంలో వైకాపా పాలన పోయి కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడినా ఇంకా కొందరు పోలీసులు వైకాపాకు అండగా నిలుస్తున్నారు. ఆ పార్టీ నాయకులపై అందే ఫిర్యాదులను తేలిగ్గా తీసుకుంటున్నారు. మొక్కుబడిగా కేసుల నమోదుకే పరిమితమవుతున్నారు. దర్యాప్తును మాత్రం పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. గతనెలలో తాడేపల్లి, ఈనెలలో గుంటూరు నగరంపాలెం స్టేషన్‌లో అందిన ఫిర్యాదుల ఉదంతాలే అందుకు నిదర్శనం. కనీసం బాధ్యులైన వారిని స్టేషన్‌కు పిలిచి విచారించిన పాపాన పోలేదంటే వైకాపా వారి విషయంలో పోలీసుల మెతకవైఖరి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అదే గత ప్రభుత్వ హయాంలో తెదేపా నాయకులపై ఫిర్యాదు అందడమే ఆలస్యం యంత్రాంగం ఆగమేఘాలమీద స్పందించి వారిని స్టేషన్లకు పిలిపించి వెంటనే రిమాండ్‌కు పెట్టేవారు.  ప్రస్తుతం ఆచొరవ పోలీసుల్లో లోపించిందని చెప్పాలి. 

వైకాపా సోషల్‌ మీడియా విభాగంపైనా..

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాలు నిషిద్ధం. ఆ సమయంలోనూ రాష్ట్రంలో వైకాపా సోషల్‌ మీడియా విభాగం ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి ప్రచారం చేసిందని, పోలింగ్‌రోజున ప్రచారం కొనసాగించిందని ఆధారాలతో సహా విశాఖపట్నానికి చెందిన న్యాయ విద్యార్థి కొండేటి సోమశేఖర్‌ తగు ఆధారాలతో మే 12న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఫిర్యాదును రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపగా రాష్ట్ర ఎన్నికల సీఈఓ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని గుంటూరు జిల్లా పోలీసులను ఆదేశించారు. దీనికి సంబంధించిన తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అంతటితో సరిపుచ్చారు. 

భార్గవరెడ్డిపై కేసు కట్టలేదు

వైకాపా సోషల్‌మీడియా విభాగంలో సజ్జల తనయుడు భార్గవ్‌రెడ్డి కీలకంగా వ్యవహరించేవారు. ఆయనపై కేసు పెట్టలేదు. 188, 171-ఎఫ్, 505 ఐపీసీ, 66 ఐటీఏ సెక్షన్లు పెట్టి కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ కల్యాణరాజు తెలిపారు. కేసు ఎవరిపై నమోదు చేశారని వివరణ కోరితే ఫిర్యాదుదారు వైకాపా సోషల్‌మీడియా విభాగం అని మాత్రమే పేర్కొన్నారు. మా దర్యాప్తులో ఆ ప్రచారం ఎవరు చేశారో నిర్ధారించుకుని బాధ్యులపై కేసు నమోదు చేస్తామని చెప్పడంం గమనార్హం. ఇప్పటికే కేసు నమోదై నెల గడిచిపోయినా ఇప్పటికీ కేసు విచారణే కొలిక్కిరాలేదు. 


రఘురామ ఫిర్యాదుపైనా మీనమేషాలే

ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ఱరాజు తాను నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు సీఐడీ పోలీసులు తనపై అక్రమంగా కేసు బనాయించి పోలీసు కస్టడీలో ఉండగా తనను తీవ్రంగా కొట్టి గాయపరిచారని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనను పోలీసులు తీవ్రంగా కొట్టడానికి కారకులైన అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి సీఐడీ విభాగాధిÅపతి సునీల్‌కుమార్, నాటి ఇంటెలిజెన్సీ డీజీ పీఎస్‌ఆర్‌ రామాంజనేయులు, గుంటూరు సీఐడీ ఏఎస్పీ విజయపాల్‌పై పిర్యాదు చేసి కేసులు పెట్టాలని కోరారు. ఇప్పటి వరకు ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదు. దీనిపై పోలీసులను వివరణ కోరగా ఉన్నతాధికారుల సలహా తీసుకుని ముందుకెళతామని చెప్పడం గమనార్హం. 


సజ్జలంటే ఎందుకో అంత ప్రేమ

మే 31న తాడేపల్లి స్టేషన్‌లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదైౖంది. ఆనెల 29న తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఆపార్టీ కౌంటింగ్‌ ఏజెంట్ల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఓట్ల లెక్కింపు సందర్భంగా వైకాపా తరఫున ఉండే ఏజెంట్లు నిబంధనలు పాటించే వారు అవసరం లేదని గొడవలకు పాల్పడాలనే అర్థం వచ్చేలా వివాదాస్పదంగా మాట్లాడారు. అవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అని వాటివల్ల సమాజంలో వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాలు ఏర్పడి గొడవలు జరగటానికి ఆస్కారం ఉందని తెదేపా లీగల్‌సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడపాటి లక్ష్మీనారాయణ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి సజ్జలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి పోలీసులు వెంటనే స్పందించి సజ్జలపై ఎఫ్‌ఐఆర్‌ 273/2024 కట్టారు. 153, 505(2) ఐపీసీతో పాటు 125ఆర్‌పీఏ 951 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని న్యాయవాది లక్ష్మీనారాయణ తన ఫిర్యాదులో పేర్కొని ఆయనపై క్రిమినల్‌ కేసులతో పాటు ప్రజాప్రాతినిద్య చట్టం 1951 చట్టాన్ని అనుసరించి 153ఎ, 505(2), 171ఎఫ్, 171జె ఐపీపీ సెక్షన్లు నమోదు చేయాలని కోరారు.ఆ ఫిర్యాదు కేసు నమోదుకే పరిమితమైంది. 

దర్యాప్తులో ఉందంటూ దాటవేత

505(2) నాన్‌బెయిలబుల్‌ సెక్షన్‌ అయితే ఏడేళ్లలోపు శిక్ష పడే కేసు కావడంతో ఆ సెక్షన్‌ కింద సజ్జలను అరెస్టు చేసి జడ్జి వద్ద ప్రవేశపెట్టి జడ్జి ఆదేశాలను అనుసరించి బెయిల్‌ ఇవ్వడమా? పోలీసులే స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేయడమో ఏదో ఒకటి చేయాలి. అయితే ఇప్పటివరకు ఆ రెండింటిలో ఏదీ చేయలేదు. స్టేషన్‌కు పిలిచి 41ఎ నోటీసు అయినా ఇచ్చి సంతకం తీసుకున్నారా లేదా అనేది పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు. దీనిపై సీఐ కల్యాణరాజును వివరణ కోరగా కేసు దర్యాప్తులో ఉందని చెప్పారే తప్ప స్టేషన్‌కు పిలిపించారా లేదా అని ప్రశ్నిస్తే స్పష్టత ఇవ్వలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని