logo

నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తాం: మంత్రి గొట్టిపాటి

రాష్ట్రంలో వైకాపా పరిపాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని, ప్రధానంగా సాగునీటి వనరుల్ని ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు

Published : 18 Jun 2024 04:39 IST

ముప్పవరం తెదేపా కార్యాలయం వద్ద  ఎన్టీఆర్‌కు నివాళి అర్పిస్తున్న మంత్రి గొట్టిపాటి

ముప్పవరం(జే పంగులూరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా పరిపాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని, ప్రధానంగా సాగునీటి వనరుల్ని ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. గుండ్లకమ్మ జలాశయం గేట్లు కొట్టుకుపోతే మరమ్మతులు పూర్తి చేయలేకపోయారన్నారు. కేవలం ఇసుక తవ్వకాలపై ఉంచిన శ్రద్ధ గేట్లు ఏర్పాటులో చూపలేకపోయారని ఎద్దేవా చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి ముప్పవరంలోని తెదేపా కార్యాలయం వద్ద కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొరిశపాడు, జే పంగులూరు మండలాలతో పాటు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు, అధికారులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఎమ్మార్పీయస్‌ నేతలు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం విలేకరులతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. వెలుగొండ, యర్రం చిన్నపోలిరెడ్డి ఎత్తిపోతల, భవనాశి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు పథకాలను పూర్తిగా విస్మరించారన్నారు. ఈకారణంగా రైతులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. వేలాది ఎకరాలకు అందాల్సిన నీరు వృథాగా సముద్రం పాలైందన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అనుభవం, పాలనాదక్షతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతామని, సీఎం చంద్రబాబునాయుడు తనపై నమ్మకంతో కీలకమైన విద్యుత్తు శాఖను అప్పగించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్తుకు ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా జరిగేలా చూస్తామన్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయానికి విద్యుత్తు అందక రైతులు ఉపకేంద్రాలను ముట్టడించే వరకు వెళ్లిన సంగతి గుర్తు చేశారు. రెండు, మూడుసార్లుగా వ్యవసాయ విద్యుత్తు అందించారని.. ఫలితంగా పంటలు చేతికి రావటం కష్టంగా మారిందన్నారు. నేటికీ విద్యుత్తు సరఫరా లేని కాలనీలు ఎన్నో ఉన్నాయని, వారందరికీ విద్యుత్తు సరఫరా అందిస్తామన్నారు. గత తెదేపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన విద్యుత్తు సంస్కరణలు దేశంలోనే ఆదర్శంగా నిలిచినట్లు గుర్తు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని