logo

పుట్టగొడుగుల్లా అక్రమ కట్టడాలు

ఈ చిత్రంలో కనిపిస్తున్న భారీ వాణిజ్య సముదాయం బాపట్ల సూర్యలంక రోడ్‌లో నిర్మితమవుతోంది.   

Published : 18 Jun 2024 04:45 IST

 చెరువు స్థలాల్లోనూ నిర్మాణాలు 

కాసులు దండుకుని మౌనం వహిస్తున్న కమిషనర్లు,            

 ప్రణాళికాధికారులు నాడు సొమ్ము  చేసుకున్న వైకాపా కౌన్సిలర్లు, నేతలు

ఈనాడు-బాపట్ల : ఈ చిత్రంలో కనిపిస్తున్న భారీ వాణిజ్య సముదాయం బాపట్ల సూర్యలంక రోడ్‌లో నిర్మితమవుతోంది. వాహన రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే ఈ రహదారిలో సెల్లార్‌ లేకుండా ఏకంగా నాలుగంతస్థుల భవనం నిర్మిస్తున్నారు. ఇది వైకాపా నాయకుడికి చెందిన భవనం కావడంతో దీనికి మున్సిపల్‌ అధికారులు అభ్యంతరం చెప్పలేదు. ఇదే అదనుగా భవనం చకచకా నిర్మితమవుతోంది. అసలు దీనికి అనుమతులే సక్రమంగా లేవని చెబుతున్నారు. జీ+2 నిర్మిస్తామని దరఖాస్తు చేసి, అంతకు మించి నిర్మిస్తున్నా యంత్రాంగానికి పట్టడం లేదు. ఇతను మాజీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుయాయుడు కావటంతో నాడు ఆయన అండగా నిలిచారనే అపవాదు ఉంది.

జిల్లాలో పురపాలికల్లో సాగుతున్న అక్రమ కట్టడాలకు ఇవి మచ్చుకు మాత్రమే ఇలాంటివి సగటున ప్రతి పురపాలికలో పదుల సంఖ్యలో ఉన్నాయి. బాపట్ల, రేపల్లె, చీరాల, అద్దంకి పట్టణాల్లో గడిచిన మూడు, నాలుగు మాసాల్లో పెద్దఎత్తున అనధికార, అక్రమ కట్టడాలు చోటుచేసుకున్నాయి. అయినా యంత్రాంగం వాటిని కూల్చకుండా చోద్యం చూస్తోంది. జిల్లా కేంద్రం బాపట్లలో అయితే ఏకంగా వైకాపా నాయకుడొకరు సెల్లార్‌ లేకుండా భారీ బహుళ అంతస్థుల భవననం నిర్మిస్తున్నారు. అద్దంకిలో ఊర చెరువు స్థలాన్ని వైకాపా నేత ఒకరు దర్జాగా అక్రమించి దాన్ని కొందరికి విక్రయించి చెరువులో నిర్మాణాలు చేసుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తున్నారు. కాసుల యావలో తరిస్తున్న యంత్రాంగానికి ఇవేం పట్టడం లేదు. కనీసం కన్నెత్తి చూడటం లేదు. చీరాల గడియారం సెంటర్‌లో ఓ వాణిజ్య కాంప్లెక్సులో అనుమతి లేకుండా అదనపు అంతస్థు నిర్మించేశారు. జిల్లా కేంద్రం బాపట్లలో మొన్నటి వరకు అధికారం అనుభవించిన ప్రజాప్రతినిధి మున్సిపాల్టీని గుప్పిట పెట్టుకుని అనధికారిక కట్టడాల మాటున భారీగా సొంత లబ్ధి చూసుకున్నారు. సూర్యలంక రోడ్డు, బాపట్ల-చీరాల ప్రధాన రహదారి, ఇంజినీరింగ్‌ కశాశాలకు ఎదురుగా ఉన్న శివారు ప్రాంతాల్లో భారీగా నిర్మాణాలు సాగుతున్నాయి. వాటిల్లో చాలా వాటికి అనుమతులు లేవు. మున్సిపల్‌ కమిషనర్లు, ప్రణాళికాధికారులు నిత్యం తిరిగే ప్రధాన రహదారుల వెంబడే అనధికారిక నిర్మాణాలు సాగుతుంటే కనీసం వాటికి అనుమతులు ఉన్నాయా? లేవా.. అని చెప్పి పరిశీలించిన పాపాన పోవడం లేదంటే అక్రమార్కులతో ఎంతగా కుమ్మక్కయ్యారో ఊహించుకోవచ్చు. రేపల్లె పురపాలికకు సమీపంగానే ఓ కమర్షియల్‌ కాంప్లెక్సులో అదనపు ఫ్లోర్‌ నిర్మించారు. దానికి అనుమతులు లేవు. ప్రభుత్వ ఆసుపత్రి రోడ్‌లో 80 గజాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వైకాపా నాయకుడి అండగా జీ+1 నిర్మిస్తున్నారు. తరచిచూస్తే ఇలాంటి అక్రమ కట్టడాలు ఎన్నో వెలుగుజూస్తాయి. ఎక్కడో శివారు, మారుమూలన యంత్రాంగం పర్యటించలేని చిన్న, సన్న సంధుల్లో నిర్మితం కావడం లేదు. ప్రధాన రహదారుల వెంటే దర్జాగా చేపడుతున్నా  అధికారులకు కనిపించక పోవడం విచిత్రం.  

చెరువుల్లో  నిర్మాణాలు నిషిద్ధం

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చెరువుల్లో నిర్మాణాలు నిషిద్ధం. అయినా అద్దంకి పురపాలిక యంత్రాంగానికి ఈ అక్రమ బాగోతాలు కనిపించడం లేదు. అసలు చెరువు స్థలాన్ని విక్రయించడం ఏమిటి? వాటిల్లో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారో ఆరా తీస్తే దాని వెనక ఉన్న పెద్దలు, అమ్యామ్యాలు తీసుకుని మౌనం వహించే అధికారులు ఎవరో వెలుగులోకి వస్తారు. ఆ ప్రాంతంలో రోడ్డు సైడ్, తూర్పు ఫేసింగ్‌ అయితే సెంటు స్థలం రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు సొమ్ము చేసుకుంటున్నారు. కనీసం రెవెన్యూ అధికారులకు ఈ వ్యవహారం పట్టడం లేదు.  

ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నామని..

ప్రతి పురపాలికలోని కమిషనర్లు మొదలుకుని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది అంతా సార్వత్రిక ఎన్నికల విధుల్లోనే గడిపారు. వారు పనుల్లో నిమగ్నమై ఉన్నారని తెలుసుకుని వైకాపా కౌన్సిలర్లు, ఆపార్టీ నాయకులు తెర వెనక ఉండి అనధికారిక నిర్మాణాలకు తెరలేపారు. ఈ వ్యవధిలో అనుమతులు లేకుండా నిర్మితమైన ప్రతి కట్టడం వెనక ఆ ప్రాంత కౌన్సిలర్‌ లేదా మున్సిపల్‌ ఛైర్మన్, వైకాపా నాయకులే ఉంటారనడంలో సందేహం లేదు. తిలా పాపం తలాపిడికెడు అనేలా నేతలు వసూలు చేసి యంత్రాంగానికి వాటాలు ముట్టజెబుతూ ఈ అక్రమ కట్టడాల వ్యవహారాలను బహిర్గతం కాకుండా యంత్రాంగమే తొక్కిపెడుతోంది. 

యంత్రాంగం దృష్టిసారిస్తే..

ఇలాంటి వాటితో పురపాలికల ఆదాయానికి గండిపడింది. అధికార నేతలకు మాత్రం కాసుల వర్షం కురిసింది. ఏదైనా కట్టడం నిర్మిస్తే పురపాలికకు భవన అనుమతుల ఫీజులు, లేబర్‌ సెస్, లేఅవుట్‌ అయితే లే అవుట్‌ఛార్జీలు, ఎక్స్‌ ట్రా బెటర్‌మెంట్‌ ఛార్జీలు, ట్రీగార్డు రుసుములు, రోడ్డు కటింగ్‌ ఛార్జీలు ఇలా అనేక పద్దుల కింద ఆదాయం సమకూరుతుంది. అనధికారిక కట్టడాల వల్ల ఈ ఆదాయాన్ని కోల్పోతుంది. ఎన్నికల సమయంలో పురపాలికల కమిషనర్లు బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చినోళ్లు తాము ఎన్నికల వరకే కదా అని చెప్పి ఈ అక్రమ కట్టడాల జోలికి వెళ్లకుండా తేలిగ్గా తీసుకున్నారు. ఇలా ఎవరికివారు మౌనం వహించడం వల్లే నేతలు రెచ్చిపోయారు. ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యేలతో సమీక్షలు చేయిస్తే అనధికారిక కట్టడాల బాగోతం వెలుగులోకి రాదు. వాటిని గుర్తించి అపరాధ రుసుములు విధించి వాటిని క్రమబద్ధీకరిస్తే బోలెడు ఆదాయం వస్తుంది. ఆ దిశగా ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలి.

ఇక్కడ కనిపిస్తున్న కట్టడాలు అద్దంకి చెరువులో ఉన్నాయి. చెరువు భూముల్లో ఎలాంటి కట్టడాలు చేయకూడదు. నాడు వైకాపా ప్రజాప్రతినిధి ఒకరు దాన్ని ఆక్రమించి అమాయక ప్రజలకు విక్రయించి అక్కడ నిర్మాణాలు చేపట్టుకునేలా ఊతమిచ్చారు. వీటిపై మున్సిపల్, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ప్రస్తుతం నిర్మాణాలు వేగంగా జరిగిపోతున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని