logo

అప్పుడే ప్రదక్షిణలు మొదలెట్టేశారు!

సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎంపీడీవోలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులు బదిలీపై వెళ్లారు

Published : 18 Jun 2024 08:54 IST

పోస్టింగ్‌ ఇప్పించాలంటూ తెదేపా నేతల ప్రసన్నానికి ప్రయత్నాలు
వైకాపాతో అంటకాగిన ఉద్యోగుల తీరిది

ఈనాడు-అమరావతి: సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎంపీడీవోలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులు బదిలీపై వెళ్లారు. ఎన్నికలు ముగిసినందున వీరంతా తిరిగి ఉమ్మడి గుంటూరు జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులను కలిసి అప్పట్లో తాము ఏకపక్షంగా పని చేయడానికి దారితీసిన పరిస్థితులు వివరించి ప్రస్తుత ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసుశాఖకు చెందిన అధికారులు ఎక్కువగా ప్రజాప్రతినిధులను కలుస్తున్న వారిలో ఉన్నారు. తొలుత ఉమ్మడి గుంటూరుకు వచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇక్కడికి వచ్చాక వారు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో విధులు నిర్వహించేలా చక్రం తిప్పుతున్నారు. 

ఆచితూచి వ్యవహరిస్తున్న నాయకులు

ఉద్యోగులు, అధికారులు వచ్చి కలుస్తున్నా ప్రజాప్రతినిధులు వారికి హామీ ఇవ్వకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతంలో వారు ఎక్కడ పనిచేశారు? వారి పనితీరు ఏమిటి? తదితర వివరాలను సేకరించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తామని సన్నిహితులతో చెబుతున్నారు. ఆయా ప్రభుత్వ విభాగాల్లో నేతలకు తెలిసినవారి ద్వారా ఆరా తీసి ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నారు. గతంలో నియోజకవర్గంలో కొందరు ఉద్యోగులు ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ఎన్నికల్లో నష్టపోయామని, ఈసారి తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నామని ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిచ్చే వారిని ఎంపిక చేసుకునే దిశగా కసరత్తు చేస్తున్నామన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు ఆదివారం, సోమవారం సెలవు కావడంతో రెండు రోజుల్లో వీలైనంత మంది ప్రజాప్రతినిధులను కలిసి వారి విన్నపాలు అందించారు. ఉద్యోగులు వారికి తెలిసిన వారి ద్వారా సిఫారసులు చేయిస్తున్నారు. 

 కీలక స్థానాల కోసం ఆరాటం 

ఇన్నాళ్లూ వైకాపా నేతలతో అంటకాగిన ఉద్యోగులు కొందరు ఆ ముద్ర నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు. కీలకమైన స్థానాల్లో పని చేయడానికి వీలుగా పావులు కదుపుతున్నారు. వీటిని గమనిస్తున్న ప్రజాప్రతినిధులు పని చేసే వారికే ప్రాధాన్యం ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో ఎంపీడీవో నుంచి పదోన్నతి పొంది జిల్లా అధికారిగా పని చేస్తున్న అధికారి ఒకరు వైకాపా నేతలు చెప్పిందే వేదంగా పనిచేశారు. ఇప్పుడు కూడా కీలకమైన పోస్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన మరో జిల్లా అధికారి తాను పనిచేస్తున్న శాఖలో విచారణ జరిపితే అనేక అక్రమాలు వెలుగులోకి వస్తాయని అక్కడి నుంచి బయటపడటానికి పావులు కదుపుతున్నారు. జిల్లాలో రెవెన్యూ శాఖలో కీలకమైన అధికారి ఒకరు చేసిన అక్రమాలు అన్నీఇన్నీ కావు. సదరు అధికారి పని చేసిన కాలంలో పరిష్కరించిన దస్త్రాలపై ప్రత్యేక దర్యాప్తు చేయించాలని పల్నాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. వీటన్నింటి నేపథ్యంలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. 

వైకాపా ఐదేళ్ల పాలనలో నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా నేతలు చెప్పిన పనులు చేసిన అధికారులు, ఉద్యోగులు ఇప్పుడు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వైకాపా అధికారం కోల్పోవడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులను కలిసి ఆయా నియోజకవర్గాల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఐదేళ్లుగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతల ఫోన్లకు కూడా అందుబాటులోకి రాని అధికారులు ఇప్పుడు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. తాము కోరుకున్న పోస్టులు రాకపోగా ఇన్నాళ్లూ చేసిన తప్పులు వెలుగులోకి తెస్తే తమ పరిస్థితి ఏంటన్న ఆందోళనలో గడుపుతున్నారు. అధికార పార్టీలో తెలిసిన నేతలు, బంధువులు, స్నేహితుల ద్వారా ఎలాగైనా గండం నుంచి గట్టెక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని