logo

వైద్యం.. దైన్యం..

ఓ రోగి తీవ్రమైన గుండెనొప్పితో ఆదివారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆయన్ను వైద్యులు పరిశీలించి యాంజియోగ్రామ్‌ చేయించుకోవాలని సూచించారు

Published : 18 Jun 2024 05:00 IST

ఆరోగ్యశ్రీ లేదని యాంజియోగ్రామ్‌కు నిరాకరణ
ప్రజాప్రతినిధి జోక్యంతో దిగొచ్చిన వైద్యాధికారులు
కొన్ని వైద్య పరీక్షలు, మందులకు బయటకు వెళ్లాల్సిందే

ఈనాడు, అమరావతి: ‘‘ ఓ రోగి తీవ్రమైన గుండెనొప్పితో ఆదివారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆయన్ను వైద్యులు పరిశీలించి యాంజియోగ్రామ్‌ చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న రోగులకు ఆ పరీక్షను జీజీహెచ్‌లోనే చేస్తారు. ఆ రోగికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో డిశ్ఛార్జి చేయబోయారు. రోగి బంధువులు ఆ విషయాన్ని ఓ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన నేరుగా ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫోన్‌ చేశారు. కార్డు లేదని రోగికి వైద్యం చేయకుండా డిశ్ఛార్జి చేయడం ఏమిటి? ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే అన్నీ ఉచితంగా చేయాలి కదా? అని నిలదీయడంతో అప్పటికప్పుడు నాన్‌ ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు యాంజియోగ్రామ్‌ పరీక్ష చేయించడానికి చర్యలు తీసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.’’  - ఇలా ఎంత మంది రోగులు ప్రజాప్రతినిధులను ఆశ్రయించి వైద్యం చేయించుకోగలరనేది ఉన్నతాధికారులు ఆలోచించాలి. 

ఒప్పందంలో ఏం ఉందో చూడరా!

ఐదేళ్ల కిందటే జీజీహెచ్‌లో క్యాథ్‌ ల్యాబ్‌ సేవలను ప్రైవేటుపరం చేశారు. విజయవాడకు చెందిన కార్డియాలజిస్టు డాక్టర్‌ విజయ్‌కు చెందిన శ్రీలక్ష్మీ ఆరుష్‌ సంస్థ క్యాథ్‌ ల్యాబ్‌ సేవలను అందించడానికి జీజీహెచ్‌తో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ 2026 వరకు సేవలు అందించేలా ఒప్పందం కుదిరింది. ఆస్పత్రిలో చికిత్స పొందే రోగులకు ఎమ్మారై, యాంజియో తదితర గుండె సంబంధిత పరీక్షలన్నింటిని ఈ ఏజెన్సీకి చెందిన వైద్యులే చేసి రిపోర్టులు అందజేస్తారు. రోగికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కింద చెల్లింపులు చేస్తారు. అది లేని వారికి నాన్‌ ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రి హెచ్‌డీఎస్‌ ఖాతా నుంచి చెల్లింపులు చేసి రోగులకు అన్ని సేవలు ఉచితంగా అందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. కానీ ఎంఓయూలో రాసుకున్న నిబంధనలు ఏమిటో తెలుసుకోకుండా రోగుల వద్ద ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే ఆ పరీక్షలు చేయించుకోవాలని, లేనివారు బయట చేయించుకుని వస్తే ఆ తర్వాత వైద్యం అందిస్తామనే పరిస్థితిలో ఉన్నారు. 

ఉన్నవే అడగాలి.. లేనివి కొనాలి..

ప్రభుత్వ ఆస్పత్రి అంటే అన్ని రకాల పరీక్షలు చేయాలి. ఒకవేళ స్థానికంగా లేకపోతే బయట ల్యాబ్‌లకు పంపి రోగికి అయ్యే వ్యయాలను సైతం ఆస్పత్రి నుంచి చెల్లింపులు చేయాలి. ఈ దిశగా చర్యలు తీసుకుంటే తప్ప రోగి జేబుకు చిల్లు పడకుండా ఉంటుంది. ఇప్పటికీ జనరల్‌ మెడిసిన్, న్యూరాలజీ, గుండె, ఎముకలు-కీళ్ల వైద్యానికి సంబంధించిన కొన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు స్థానికంగా చేయడం లేదు. వ్యయ, ప్రయాసలకోర్చి రోగులే వాటిని బయట చేయించుకుంటున్నారు. మెడికల్‌ స్టోర్స్‌లో ఉన్న ఔషధాలు ఇచ్చి మిగిలినవి బయట కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తంగా రోగుల జేబుకు చిల్లు పడుతోంది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం జీజీహెచ్‌లో నెలకొన్న ఈ సమస్యలపై దృష్టి సారించి తమకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు.

  మొన్న న్యూరోసర్జరీ విభాగంలో..

ఈ మధ్య న్యూరోసర్జరీ విభాగంలో కొందరు రోగులను సర్జరీకి అవసరమైన ఇంజెక్షన్లు, ఔషధాలు బయట నుంచి తెచ్చుకోవాలని ఒత్తిడి చేశారు. దీనిపై స్పందనలో ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని వార్డుల తనిఖీలకు వెళ్లిన సందర్భంలో సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ఆస్పత్రిలో ఉన్న రోగులను తమ ప్రైవేటు క్లినిక్‌లకు రావాలని కొందరు వైద్యులు కోరడంపై ఒంగోలు రిమ్స్‌ వైద్యులతో విచారణకు ఆదేశించారు. వారు మూడు రోజుల కిందట ఆస్పత్రికి వచ్చి విచారణ జరిపారు. వారిచ్చే నివేదికను అనుసరించి చర్యలు ఉంటాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఉచితంగానే యాంజియో చేయించాం

ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా నాన్‌ ఆరోగ్యశ్రీ కింద రోగిని క్యాథ్‌ల్యాబ్‌కు పంపి యాంజియో పరీక్ష చేయించామని జీజీహెచ్‌ ఆరోగ్యశ్రీ విభాగం అధికారులు తెలిపారు. రోగిని డిశ్ఛార్జి చేయబోయిన విషయం తమకు తెలియదని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి కొన్ని పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు వస్తున్నాయని, వాటిని అధిగమించాల్సి ఉందని వైద్యులు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని