logo

ఆలకిస్తే వరం.. అన్నదాతకు ఫలం

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయాలనుకున్న ప్రయోగశాలకు బాలారిష్టాలు తప్పడం లేదు. భవనాల నిర్మాణం పూర్తయి స్వాధీనం చేసుకోవడంలో అంతులేని జాప్యం జరుగుతోంది.

Published : 18 Jun 2024 05:12 IST

ఖాళీగా డీఎన్‌ఏ ప్రయోగశాల, జీవఉత్పత్తుల పరీక్షకేంద్రాలు

రూ.5 కోట్లతో నిర్మించిన భవనాలు నిరుపయోగం

ప్రారంభానికి నోచుకోని డీఏన్‌ఏ ప్రయోగశాల

ఈనాడు, అమరావతి: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయాలనుకున్న ప్రయోగశాలకు బాలారిష్టాలు తప్పడం లేదు. భవనాల నిర్మాణం పూర్తయి స్వాధీనం చేసుకోవడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. భవనాలు ప్రారంభం కాక ముందే టైల్స్‌ కుంగిపోవడం, సీలింగ్‌ జారిపోవడం, గోడలు నెర్రెలు రావడం నిర్మాణ పనుల లోపాలకు అద్దంపడుతున్నాయి. ఈ భవనాలను స్వాధీనం చేసుకోవడానికి వ్యవసాయశాఖ వెనకడుగు వేస్తోంది. ఉమ్మడి గుంటూరులోని అమరావతిలో రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూ.5కోట్లతో నిర్మించిన డీఎన్‌ఏ ప్రయోగశాల, జీవఉత్పత్తుల పరీక్ష కేంద్రం, ఎరువులు, పురుగుమందుల పరీక్ష కేంద్రాల భవనాల దుస్థితి ఇది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు మొదలై వైకాపా ప్రభుత్వంలో పూర్తయ్యాయి. పర్యవేక్షణలోపం, సకాలంలో స్వాధీనం చేసుకోకపోవడం, ప్రయోగశాలకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకురావడంలో చేసిన జాప్యం రైతులకు శాపంగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇప్పటికైనా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించి ప్రయోగశాలను అందుబాటులోకి తెస్తే ప్రయోగాల ఫలితాలు రైతులకు అందనున్నాయి. 

అమరావతి వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన భవనం 

మూడేళ్ల కిందటే పూర్తయినా..

రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల పరీక్ష కేంద్రాలు, డీఎన్‌ఏ ప్రయోగశాలతోపాటు డీకోడింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని గత తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2018లో మొత్తం 8 భవనాల నిర్మాణానికి అమరావతిలో ఒకే ప్రాంగణంలో అప్పట్లో శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ వైద్య మౌలికవసతుల అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో గుత్తేదారుకు పనులు అప్పగించారు. డిసెంబరు 2021 నాటికి ప్రయోగశాల, ఎరువులు, పురుగుమందుల పరీక్ష కేంద్రాలు, జీవ ఉత్పత్తుల పరీక్ష కేంద్రాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందుకు రూ.5కోట్ల సొమ్ము వెచ్చించారు. భవనాల నిర్మాణం పూర్తయిన వెంటనే స్వాధీనం చేసుకోవడానికి అధికారులు పరిశీలించగా అనేక లోపాలు బహిర్గతమయ్యాయి. వీటిని సరిచేయాలని గుత్తేదారుకు సూచిస్తే అరకొరగా మరమ్మతు చేసి సరిపెట్టారు. 

నిర్మాణాల్లో నాణ్యతా లోపాలు..

ఇప్పటికే ఒక భవనం స్వాధీనం చేసుకోగా నాణ్యతా లోపాలు వెలుగుచూస్తున్నాయి. ఒక అడుగు మేర టైల్స్‌ కిందకి కుంగిపోవడంతో గుత్తేదారు మళ్లీ మరమ్మతు చేసి సరిచేశారు. ఇంకా స్వాధీనం చేసుకోని డీఎన్‌ఏ ప్రయోగశాలలో సీలింగ్‌ నుంచి పెచ్చులు ఊడిపోయాయి. భవనాల చుట్టూ వేసిన టైల్స్‌ కూడా కుంగిపోయాయి. మిగిలిన భవనాలు స్వాధీనం చేసుకోకపోవడం, గుత్తేదారు మరమ్మతు చేయకపోవడంతో సందిగ్ధం కొనసాగుతోంది. భవనాల్లో లోపాలపై ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు ఏపీఎంఐడీసీ విభాగానికి మూడుసార్లు లేఖలు రాశారు. నిర్మాణం పూర్తయిన భవనాలు అందుబాటులోకి తీసుకురాకపోవడంతో రోజురోజుకు పాడవుతున్నాయి. గుత్తేదారుకు ఇంకా 30శాతం సొమ్ము చెల్లించాల్సి ఉంది. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని భవనాల మరమ్మతు పూర్తిచేసి భవనాలు అందుబాటులోకి తీసుకురావడం, గుత్తేదారుపై చర్యలు తీసుకోవడం వంటి అంశాలను త్వరగా తేల్చితే ఈ భవనాలు ఉపయోగంలోకి వస్తాయి. 

ప్రయోజనాలెన్నో..

గుంటూరులోని డీఎన్‌ఏ వేలిముద్రలు, జన్యుమార్పిడి పంటల పర్యవేక్షణ ప్రయోగశాలకు కేంద్ర వ్యవసాయశాఖ జాతీయ రెఫెరల్‌ ప్రయోగశాల హోదా కల్పించింది. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే జన్యుమార్పిడి, జీవనక్రమంలో మార్పిడికి గురైన జీవుల ఉనికి, అంతర్థానం గురించి పరిశోధనలు చేపట్టవచ్చు. విత్తనాలలో జన్యుస్వచ్ఛత, వెరైటీ నిర్ధారణ, జన్యుమార్పిడి పంటల పరీక్షలు, సంకర విత్తనాల్లో తయారీదారులు చెప్పిన లక్షణాలు విత్తనాల్లో ఉన్నాయా? లేదా? నిర్ధారించి నివేదికల ఇచ్చే వెసులుబాటు కలుగుతుంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా విత్తనాల్లో సమస్య వచ్చినప్పుడు ఇక్కడి ప్రయోగశాలలో పరీక్షలు కీలకంగా మారనున్నాయి. ఇప్పటివరకు విత్తనాల్లో జన్యువుల నిర్ధారణ, ఇతర క్లిష్టతరమైన పరీక్షలకు విదేశాలకు పంపాల్సి వచ్చేది. ఇది అందుబాటులోకి వస్తే జన్యుమార్పిడి విత్తనాల్లో ఏదైనా కొత్త సమస్య వచ్చినా ఎదుర్కొనే సామర్థ్యం ప్రయోగశాలకు లభిస్తుంది. ఇంతటి కీలకమైన ప్రయోగశాలకు సంబంధించిన భవనం పూర్తయి మూడేళ్లయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రయోగశాలకు అవసరమైన పరికరాల కొనుగోలు చేయలేదు. గుంటూరులో ఒక గదిలో అరకొర సౌకర్యాల నడుమ తాత్కాలికంగా డీఎన్‌ఏ ప్రయోగశాల నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎరువులు, పురుగుమందుల పరీక్ష కేంద్రాల భవనాలు సైతం పూర్తయ్యాయి. ఒక భవనం స్వాధీనం చేసుకుని అందులో డీకోడింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. మిగిలిన భవనాలన్నీ నిరుపయోగంగా పాడవుతున్నాయి. కృష్ణానది ఒడ్డునే ఉండటంతో ఇక్కడ నీటి వసతి, రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో అన్నివిధాలా అత్యంత సౌకర్యంగా ఉన్న కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని