logo

నగరాభివృద్ధికి ప్రణాళికలు

నగరాభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ నగరపాలక వర్గాలను ఆదేశించారు

Updated : 18 Jun 2024 05:56 IST

సమీక్షకు సిద్ధం చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని ఆదేశం

ప్రతిపాదనల దస్త్రాలు బయటకు తీస్తున్న యంత్రాంగం 

ఈనాడు, అమరావతి: నగరాభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ నగరపాలక వర్గాలను ఆదేశించారు. త్వరలోనే దీనిపై సమీక్షిస్తానని పేర్కొన్నారు. దీంతో పెండింగ్‌ పనులతో పాటు నగరాభివృద్ధికి సంబంధించి గతంలో చేసిన ప్రతిపాదనలు, తాజాగా చేపట్టాల్సిన నూతన ప్రతిపాదనల దస్త్రాలు రూపొందించే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు. 

  వంతెనల విస్తరణ, భూగర్భ డ్రైనేజీ పూర్తి ప్రధానం..

ప్రజలను వేధిస్తున్న ట్రాఫిక్‌ సమస్యలకు పరిష్కారంగా శంకర్‌విలాస్‌ వంతెన విస్తరణతో పాటు శ్యామలానగర్, గడ్డిపాడు వద్ద ఆర్వోబీలు నిర్మించాలని గతంలోనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ మేరకు వాటిల్లో కొన్నింటిని కేంద్రానికి పంపారు. అక్కడ పెండింగ్‌లో ఉన్నాయి. గత తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.900 కోట్లతో భూగర్భ మురుగు నీటి పథకం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి సుమారు 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ పనుల్లో అవినీతి జరిగిందని, విచారణ చేయించాలని, రివర్స్‌ టెండర్లు పిలవాలని అనేక ప్రతిపాదనలు తెరమీదకు తీసుకొచ్చింది. కానీ ఏ ఒక్క పని చేయలేదు. ఏమాత్రం వైకాపా ప్రభుత్వం ఆ పనులను కొనసాగించినా ఇప్పటికే ప్రాజెక్టు పూర్తయి వినియోగంలోకి వచ్చి ఉండేది. ఈ ప్రాజెక్టును బీవోటీ విధానంలో చేపట్టారు. పనులు పూర్తయిన నాటి నుంచి ఐదేళ్ల పాటు గుత్తేదారు దాని నిర్వహణ బాధ్యతలు చూసి ఆ తర్వాత నగరపాలికకు అప్పగించేలా ఒప్పందం ఉంది. ఈ వ్యవధి కూడా ఇప్పటికే అయిపోయింది. తూర్పు నియోజకవర్గంలో ఈ పనులు ఎక్కువ శాతం నిర్వహించాల్సి ఉంది.

 

 విస్తరణకు నోచుకోని అరండల్‌పేట బ్రిడ్జి

మానస సరోవరం పునరుద్ధరణకు..

నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు అధిగమించటానికి మార్కెట్‌ సెంటర్, అరండల్‌పేట ప్రాంతాల్లో అండర్‌ ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఆర్టీసీ ద్వారా సీటీ బస్సులు నడపాలని గతంలో ప్రతిపాదించారు. ఇవేమి కార్యరూపం దాల్చలేదు. మానస సరోవరం పార్కు శిథిలావస్థలో ఉంది. దీన్ని పునరుద్ధరించి నగర ప్రజలకు ఆహ్లాదం కలిగించాలి. తక్షణమే ఈ పనులు పూర్తి చేస్తే నగర ప్రజలకు ఊరట కలుగుతుంది. ఈ పనులకు సంబంధించిన పాత ప్రతిపాదనల దస్త్రాలు బయటకు తీయడంతో పాటు నూతన ప్రణాళికలు రూపొందించే పనిలో నగరపాలిక అధికారులు ఉన్నారు. ఇప్పటికే ఎంపీ నగరపాలిక అధికారులకు ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పడంతో ఏ క్షణాన అయినా సమీక్ష చేసే అవకాశం ఉందని ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు ఈ దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని