logo

కోడెలపై పెట్టిన కేసు జగన్‌కు వర్తించదా?: ఎమ్మెల్యే జీవీ

జగన్‌ నియంత మనస్తత్వానికి నిదర్శనం విశాఖ రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణామని.. తాను నివాసం ఉండేందుకు ప్రజల సొమ్ము రూ.500 కోట్లు ఖర్చు చేశారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు

Published : 18 Jun 2024 05:18 IST

వినుకొండ, న్యూస్‌టుడే : జగన్‌ నియంత మనస్తత్వానికి నిదర్శనం విశాఖ రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణామని.. తాను నివాసం ఉండేందుకు ప్రజల సొమ్ము రూ.500 కోట్లు ఖర్చు చేశారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. తన కార్యాలయంలో ఎన్డీఏ నేతలతో కలిసి సోమవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. పేదలకు సెంటు ఇంటి స్థలం ఇచ్చి.. తాను కట్టుకున్న భవంతిలో స్నానాల గదిని సెంటు స్థలంలో నిర్మించుకున్నారని.. పేదల ప్రతినిధిని అని చెప్పుకున్న పెత్తందారి జగన్‌ నిర్వాకం చూసి ప్రజలు ఆశ్చర్య పోతున్నారని తెలిపారు. తాడేపల్లిలోని ఆయన ఇంటికి రూ.40 కోట్ల ప్రజల సొమ్ము ఖర్చు పెట్టారని.. నాడు స్పీకర్‌గా ఉన్న డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు ఎన్నికల్లో ఓటమి చెందగానే తన క్యాంపు కార్యాలయంలోని ఫర్నీచరు తీసుకెళ్లాలని లేఖ రాసినా వైకాపా ప్రభుత్వం పట్టించుకోకుండా ఆయనపైన కేసు పెట్టి మానసిక క్షోభకు గురి చేశారని చెప్పారు. ఇప్పుడు జగన్‌ నివాసంలో ఉన్న ఫర్నీచర్‌ విషయంలో ఆ చట్టం వర్తించదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంత పాలన అంతమైందని.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని అన్నారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తారని తామంతా ఆయన జట్టులో సభ్యులుగా కష్టపడి పని చేస్తామన్నారు. మూడోసారి తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన నియోజకవర్గ బాధ్యుడు కె.నాగశ్రీనురాయల్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో భాజపా పట్టణ అధ్యక్షుడు రాఘవులు, తెదేపా నేతలు ఆంజనేయరెడ్డి, పీవీ సురేష్, గోవిందరాజులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని