logo

వైకాపా కౌన్సిలర్‌ అరెస్టు

కత్తులతో బెదిరించి ఆర్‌ఎంపీ ఆస్తి రాయించుకున్న కేసులో తెనాలి పట్టణ 33వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ మొఘల్‌రహమత్‌బేగ్‌ అలియాస్‌ మొఘల్‌అహ్మద్, అతని సోదరుడు ఫయాజ్‌బేగ్, బంధువు జాన్‌సైదాలను మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

Updated : 18 Jun 2024 13:45 IST

ఆర్‌ఎంపీని బెదిరించి ఆస్తి రాయించుకున్న వైనం  

కౌన్సిలర్‌ మొఘల్‌ రహమత్‌బేగ్‌ 
తెనాలి టౌన్, న్యూస్‌టుడే: కత్తులతో బెదిరించి ఆర్‌ఎంపీ ఆస్తి రాయించుకున్న కేసులో తెనాలి పట్టణ 33వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ మొఘల్‌రహమత్‌బేగ్‌ అలియాస్‌ మొఘల్‌అహ్మద్, అతని సోదరుడు ఫయాజ్‌బేగ్, బంధువు జాన్‌సైదాలను మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం... పట్టణ పరిధి బాలాజీరావుపేటలో జోజికుమార్‌ అనే వ్యక్తి ఆర్‌ఎంపీగా ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 29న ఆయన క్లినిక్‌కు గ్యాస్‌ సమస్యతో బాధపడుతున్న స్థానిక 35వ వార్డుకు చెందిన మహిళను కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. ఆ సమయంలో జోజికుమార్‌ లేకపోవడంతో ఆయన భార్య జయశ్రీ భర్తకు ఫోన్‌లో విషయాన్ని తెలపగా ఒక ఇంజక్షన్‌ చేయమన్నారు. ఆ ఇంజక్షన్‌ను జయశ్రీ మహిళకు చేసిన కొద్ది సేపటికి ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆమె కుటుంబసభ్యులు జయశ్రీను తిట్టగా ఆమె కంగారుపడి భర్తకు ఫోన్‌ చేశారు. ఏదైనా వైద్యశాలకు తీసుకెళదామంటే మేము ప్రభుత్వ వైద్యశాలకు వెళుతున్నామని చెప్పి ఆటోలో వెళ్లిపోయారు. తరవాత జోజికుమార్, జయశ్రీ ప్రభుత్వ వైద్యశాలకు వెళితే వారు అక్కడ లేరు. మే 1న కొంత మంది క్లినిక్‌ వద్దకు వచ్చి దంపతులను కొట్టి గందరగోళం చేశారు. ఈ దశలో రంగప్రవేశం చేసిన వార్డు కౌన్సిలర్‌ మొఘల్‌రహమత్‌ బేగ్‌ ‘మీరు చేసిన చికిత్స వల్ల ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. వారు మీ క్లినిక్‌ పగులగొడతామంటున్నారు. నేను మాట్లాడి పంచాయితీ చేస్తాన’ని చెప్పి బెదిరించటం ప్రారంభించాడు. జయశ్రీ బంగారు నగలు తాకట్టు పెట్టి రూ.5 లక్షలు నగదు ఇచ్చారు. కొన్ని ఖాళీ కాగితాలు, ప్రాంసరీ నోట్లపై సంతకాలు తీసుకున్నాడు. ఫైనల్‌ సెటిల్‌మెంట్ అంటూ మే 2న మొఘల్‌రహమత్‌బేగ్, ఫయాజ్‌బేగ్, జాన్‌సైదా కత్తులతో బెదిరించి బాలాజీరావుపేటలో జోజికుమార్‌కు ఉన్న 36 గజాల స్థలం, అందులోని చిన్న నిర్మాణాన్ని మొఘల్‌రహమత్‌బేగ్‌ పేరుపైన రాయించుకున్నారు. ఆ తర్వాత ఎవరైతే చనిపోయారని బెదిరించి ఇదంతా చేశారో ఆ మహిళ జీవించే ఉందని దంపతులకు తెలియటంతో.. ఇదంతా కావాలని జరిగిన కుట్రగా నిర్ధారించుకుని ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేసి కేసులో తొలి ముగ్గురిని అరెస్టు చేశారు. క్లినిక్‌ వద్ద గొడవ చేసిన వారు, ఇతరులపై చర్యలు తీసుకోవాల్సి ఉందని పోలీసులు వివరించారు. కౌన్సిలర్‌ మొఘల్‌రహమత్‌బేగ్‌పై గతంలోనూ పలు వివాదాలు ఉన్నాయి.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని