logo

అన్నదాతల చూపు.. ఆకాశం వైపు

కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షాలు లేక నదికి ప్రవాహాలు లేకపోవడంతో జలాశయాలకు నీటి చేరిక లేదు. కృష్ణానదిపై ఉన్న జలాశయాలపై ఆధారపడి గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వ్యవసాయం సాగుతోంది.

Published : 20 Jun 2024 03:58 IST

కృష్ణానదికి ప్రారంభం కాని ప్రవాహాలు
జూన్‌ నెల సగం గడిచినా కానరాని చినుకు జాడ
ఈనాడు, నరసరావుపేట

కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షాలు లేక నదికి ప్రవాహాలు లేకపోవడంతో జలాశయాలకు నీటి చేరిక లేదు. కృష్ణానదిపై ఉన్న జలాశయాలపై ఆధారపడి గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వ్యవసాయం సాగుతోంది. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని జలాశయాలు డెడ్‌ స్టోరేజ్‌లోనే ఉండటంతో రైతులు వరుణుడి కరుణపైనే ఆధారపడ్డారు. దీనికితోడు మన ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని జలాశయాల్లోకి నీటిచేరిక లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జూన్‌ 20 వచ్చినా కృష్ణానదికి ప్రవాహాలు లేకపోవడంతో కాలువలకు సాగునీటి విడుదలపై సందిగ్ధం కొనసాగుతోంది. అటు గోదావరి నదికి కూడా ఆశించినస్థాయిలో ప్రవాహాలు లేకపోవడంతో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు చేయడం లేదు. దీంతో కృష్ణానదికి ప్రవాహాలు మొదలైతేనే సకాలంలో పంటల సాగుకు సాధ్యమవుతుంది. జలాశయాల్లో నీటిలభ్యత లేకపోవడం, కృష్ణా, గోదావరి నదులకు నీటి ప్రవాహాలు లేకపోవడంతో సాగునీటి సలహా మండలి సమావేశాలు నిర్వహించడం లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మంత్రులు బాధ్యతలు చేపట్టడంతో ఇప్పుడిప్పుడే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, సాగునీటి అవసరాలు, కాలువల పరిస్థితి తదితర అంశాలపై జలవనరులశాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. మంత్రి సమీక్ష తర్వాత కాలువల మరమ్మతుకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. 

వెలవెలబోతున్న జలాశయాలు

పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 86 శాతం వ్యవసాయం కాలువలు, ఎత్తిపోతల పథకాల ఆధారంగా సాగు జరుగుతోంది. కృష్ణానదిపై ఉన్న జలాశయాల ద్వారా కాలువలకు సాగునీరు అందుతోంది. కృష్ణానదిపై మన రాష్ట్రంలో ఉన్న జలాశయాల్లో నీటినిల్వలు అడుగంటాయి. ఎగువన కర్ణాటక రాష్ట్రంలోని జలాశయాల్లోకి కూడా ఇంకా వరద నీటి ప్రవాహాలు మొదలుకాలేదు. ఆల్మట్టీలో 22శాతం నిల్వలు ఉండగా, జూరాలలో 93 శాతం, నారాయణపూర్‌లో 66 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టులోకి 5291 క్యూసెక్కులు, జూరాలకు 3782, నారాయణపూర్‌కు 195 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఈ మూడు ప్రాజెక్టుల్లోకి 113 టీఎంసీలు వస్తే కానీ దిగువకు నీటి విడుదల సాధ్యం కాదు. మరోవైపు తుంగభద్ర జలాశయంలో కేవలం 5.89 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇంకా 94.97 టీఎంసీలు నీరు వస్తే ప్రాజెక్టు గరిష్ఠస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. ప్రస్తుతం 3175 క్యూసెక్కుల ప్రవాహం ఇన్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం జలాశయాల్లోకి నీటిప్రవాహాలు ఆశాజనకంగా లేకపోవడంతో సందిగ్ధం కొనసాగుతోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టులు నిండితే కానీ ఆంధ్రప్రదేశ్‌లోని జలాశయాలకు నీటి చేరిక సాధ్యం కాదు. వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకున్న రైతులు సాగుపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 


సాగుపై సందిగ్ధం..

ఖరీఫ్‌ సీజన్‌ మొదలై 20 రోజులు అవుతున్నా ఆశించిన స్థాయిలో పంటల సాగు ప్రారంభం కాలేదు. విత్తన మార్కెట్‌ కూడా మందకొడిగా సాగుతోంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వర్షాలు పడుతున్నా పత్తి సాగు ఊపందుకోలేదు. పత్తి సాగులో గతేడాది ప్రతికూల పరిస్థితులు చవిచూసిన రైతులు అంత ఆసక్తి చూపడం లేదు. ఈసారి అపరాల సాగుకు కొంత మొగ్గుచూపుతున్నారు. శనగ, పొగాకు సాగుకు కూడా సిద్ధమవుతున్నారు. జలాశయాల్లో నీటి నిల్వలు లేకపోవడం, ప్రవాహాలపై స్పష్టత లేక మిర్చి నర్సరీ యజమానులు కూడా ఇంకా 20శాతం మాత్రమే నార్లు పెంచుతున్నారు. విత్తనం నాటిన తర్వాత 40 రోజుల్లో మిరప మొక్కలు నాటడానికి సిద్ధమవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని నార్లు పోయడం లేదు. మరోవైపు కృష్ణా పశ్చిమ డెల్టాలో కాలువలకు ఎప్పుడు నీరు విడుదల చేస్తారో తెలియక పోవడంతో రైతులు నారుమళ్లు ఇంకా ప్రారంభించలేదు. వర్షాలు కొనసాగితే జులై నెలలో వెదపద్ధతిలో వరి సాగుకు రైతులు పొలాలు దుక్కులు చేసుకుని సిద్ధమవుతున్నారు. జలాశయాల్లోకి నీటిచేరికపై సందిగ్ధం కొనసాగుతుండటంతో సాగు ఇంకా ఊపందుకోలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. స్థానికంగా వర్షాలు పడటంతోపాటు కృష్ణానది పరివాహక ప్రాంతంలో పడే వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు