logo

పోలీసులు కాదు.. వైకాపా వీర విధేయులు

పరిశోధించి కేసుల్ని ఛేదించడం పోలీసులు ఎప్పుడో మరిచారు.. ఎందుకంటే గత ఐదేళ్లలో వైకాపా నాయకుల సేవే సరిపోయింది కాబట్టి.. ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామాల్లో మార్పు తీసుకొచ్చి శాంతిభద్రతలను గాడిన పెట్టాలన్న కింకర్తవ్యాన్ని పట్టించుకోలేదు.

Updated : 20 Jun 2024 05:07 IST

ఐదేళ్లుగా ఆ పార్టీ పెద్దలు చెప్పిందే చట్టం
తెదేపా కార్యకర్తలు, నేతలు లక్ష్యంగా వేధింపులు
న్యాయం చేయాలని స్టేషన్‌కు వెళితే ఎదురుకేసులు
ఈనాడు డిజిటల్, నరసరావుపేట 

రిశోధించి కేసుల్ని ఛేదించడం పోలీసులు ఎప్పుడో మరిచారు.. ఎందుకంటే గత ఐదేళ్లలో వైకాపా నాయకుల సేవే సరిపోయింది కాబట్టి.. ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామాల్లో మార్పు తీసుకొచ్చి శాంతిభద్రతలను గాడిన పెట్టాలన్న కింకర్తవ్యాన్ని పట్టించుకోలేదు.. ఎందుకంటే పిన్నెల్లి సోదరులకు సలాం కొట్టాలి కాబట్టి.. దొంగతనాలను నివారించడం, మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడం వంటివి చేయాలన్న ఆలోచన వారికి దరిదాపుల్లోనూ రాలేదు.. ఎందుకంటే తాము ఆరాధించే ప్రజాప్రతినిధులకు ఇబ్బంది కలుగుతుందని.. ఇలా ప్రజాపరిరక్షణకు అండగా నిలబడాల్సిన పోలీసులు వైకాపా నాయకుల సేవే పరమావధిగా ఐదేళ్లు పని చేశారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అన్న చందంగా జిల్లాకు మొట్టమొదటి ఎస్పీగా వచ్చిన రవిశంకర్‌రెడ్డి పనితీరు చూసి కిందిస్థాయి సిబ్బంది కూడా అదే తీరున పేట్రేగిపోయారు. సమస్యలు చెప్పుకుందామని పోలీసుస్టేషన్‌కు వస్తే న్యాయం జరగకపోవడం మాట అటుంచితే, తిరిగి బాధితులపైనే కేసులు పెడుతుండడంతో పోలీసులకు ఓ దండం రా.. బాబు.. సామాన్యులు అనుకునే స్థాయికి తీసుకొచ్చారు. వైకాపా నాయకులపై స్వామి భక్తి ప్రదర్శిస్తూ ఖాకీ దుస్తులకు కళంకం తెచ్చారు. మొత్తం మీద సామాన్యులు పోలీసు వ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా వ్యవహరించారు. నాడు అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసు అధికారుల జాబితా చూస్తే పెద్దదిగానే ఉంది. వైకాపా కండువా కప్పుకోకుండానే ఒక్కొక్కరూ ఒక్కోలా అరాచకం సృష్టించారు. నాడు వైకాపా సేవలో తరించిన ఇలాంటి పోలీసులు నేడు తెదేపా ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించడం కొసమెరుపు.


ప్రస్తుతం మాచర్లలో పని చేస్తున్న ఓ ఎస్సై ఇంకా వైకాపా మాయలోంచి బయటకు రాలేదని వినిపిస్తుంది. రెండు రోజుల క్రితం తెదేపా కార్యకర్త ఫిర్యాదు చేయడానికి ఠాణాకు వెళితే తిప్పి పంపించేశారు. తనపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు తీసుకోవాలని కోరగా పట్టించుకోలేదు. దీంతో వెంటనే ఎమ్మెల్యే బ్రహ్మరెడ్డి స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అక్కడే ఉన్న సీఐ బ్రహ్మయ్య ఫిర్యాదును స్వీకరించారు. 


ప్రస్తుతం నరసరావుపేట రూరల్‌ ఎస్సైగా పనిచేస్తున్న ఒకరు స్థానిక వైకాపా నేత అండదండలతో వచ్చి తెదేపా, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ అందినకాడికి దండుకున్నాడు. ఇదే ఠాణాలో అంతకు ముందు పని చేసి పలు అవినీతి ఆరోపణలతో పక్క జిల్లాకు వెళ్లి, మళ్లీ కావాలని వచ్చి ఇంకా వైకాపా సేవలోనే తరిస్తున్నాడు.


జగన్‌కుబంటులా..

జిల్లాకు మొట్టమొదటి ఎస్పీగా వచ్చిన రవిశంకర్‌రెడ్డి పూర్తిగా వైకాపా అధినేత జగన్‌ మనిషిలా వ్యవహరించారు. పల్నాడు జిల్లాకు పోలీసు బాస్‌గా వచ్చిన ఓ మంచి అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకోవడమే కాదు కెరీర్‌లో మచ్చ తెచ్చుకున్నారు. పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామాలుండే మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కనీస చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఎన్నికలు సమీపించినా ముందస్తు చర్యలు తీసుకోలేదు. వైకాపా ఎమ్మెల్యేలు చెప్పినట్లు నడుచుకున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే బంధువుల ఇంటికొచ్చినట్టు ఎస్పీ కార్యాలయానికి వస్తూ పోతుండేవారు. మాచర్ల, గురజాలలో వైకాపా నేతలు అక్రమ మద్యం అమ్మకాలు, మైనింగ్‌ మాఫియా సాగిస్తున్నా చర్యలు తీసుకోలేదు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా కూడా స్వామిభక్తి వీడలేదు. మార్చి మొదటి వారంలో చిలకలూరిపేట బొప్పూడి వద్ద జరిగిన ప్రజాగళం సభకు ప్రధాని మోదీ హాజరైనా సరే రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. మైక్‌లు పని చేయకపోవడం.. అల్లరిమూక సభలోకి దూసుకురావడం.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరణ చేయలేకపోవడం వంటి లోపాలు కనిపించాయి. వైకాపా అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాలతో పని చేసి సభకు ఆటంకం కలిగించారు. దీనికి ప్రధాన బాధ్యుడిగా వ్యవహరించిన రవిశంకర్‌రెడ్డిపై చివరకు ఎన్నికల సంఘం వేటు వేసింది. ఇప్పటికీ పోస్టింగ్‌ దక్కించుకోలేకపోయారు. జగన్‌కు స్వామిభక్తి ఎంతలా ప్రదర్శిస్తారంటే.. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అరెస్టు చేసి తీసుకొస్తున్న కాన్వాయ్‌ చిలకలూరిపేట జాతీయ రహదారిపై నుంచి వస్తుండగా చిత్రీకరిస్తున్న విలేకరులపై రవిశంకర్‌రెడ్డినే లాఠీఛార్జి చేశారు. 


వెల్దుర్తి ఎస్సైగా పని చేసిన శ్రీహరి పూర్తిగా మాచర్ల పిన్నెల్లి సోదరులు చెప్పినట్లు నడుచుకున్నారు. పార్టీ మారతారా? కేసులు పెట్టి లోపలెయ్యాలా? అంటూ తెదేపా కార్యకర్తలను హింసించారు. చివరకు శ్రీహరి వేధింపులు తాళలేక మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా ఉన్నతాధికారులు ఇతనిపై చర్యలు తీసుకోలేదు. పిన్నెల్లి సోదరుల అండదండలు చూసుకుని రెచ్చిపోయారు. ఎక్కడా ఎస్సైగా పోస్టింగ్‌ దక్కించుకోలేకపోయారు. 


అంతా అంబటి చెప్పినట్లే ..

న బంధువు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏకంగా తన నియోజకవర్గానికే ఏరికోరి డీఎస్పీగా ఆదినారాయణను తీసుకొచ్చారు. బంధుత్వం ఉంటే ఇంట్లో చూసుకోవాలి.. కానీ విధుల్లో చూపిస్తూ తెదేపా నేతలను అణిచివేస్తూ స్వామిభక్తి చూపించారు. సత్తెనపల్లి డీఎస్పీగా పనిచేస్తూ ఆదినారాయణ పూర్తిగా అంబటి రాంబాబు మనిషిలా వ్యవహరించేవారు. తెదేపా, జనసేన నేతలు ఫిర్యాదులు చేస్తే పట్టించుకునేవారు కాదు ఉల్టాగా వారిపైనే అక్రమ కేసులు పెట్టేవారు. ఆయన డీఎస్పీగా పని చేసినంత వరకూ ముఖ్యంగా జనసేన కార్యకర్తలను హింసించారు. చాలా గ్రామాల్లో జనసేన అధినేతకు అండగా నిలిస్తున్నారని కావాలని బయటకు రాకుండా చేయాలని అక్రమ కేసులు పెడుతూ జైల్లో పెట్టేవారు. డీఎస్పీగా కాకుండా అంబటి రాంబాబు అనుచరుడిలా ప్రవర్తిస్తున్నారని, ఆయన్ను మార్చాలని కన్నా లక్ష్మీనారాయణ మొరపెట్టుకోవడంతో గోదావరి జిల్లాకు బదిలీ చేశారు.

పెదకూరపాడు పరిధిలో ..

ప్రస్తుతం పని చేస్తున్న పలువురు ఎస్సైలంతా వైకాపా సేవలో తరించినవారే. ఒకరైతే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి బంధువు. వినుకొండలో పని చేసినంతకాలం బొల్లా సేవలో తరించి, ఆనక పెదకూరపాడు వచ్చాక నంబూరు శంకర్రావుకే కాకుండా అతని సతీమణి చెప్పినట్లు కూడా నడుచుకున్నారు. నియోజకవర్గంలో బెల్లంకొండ, అమరావతి, క్రోసూరు మండలాల్లో ఎన్నికల సమయంలో తెదేపా కార్యాలయాలకు నిప్పుపెట్టినా నిందితులను ఇంతవరకు పట్టుకోలేదు. 


తెదేపా ఫిర్యాదులు బుట్టదాఖలు

గురజాల డీఎస్పీగా  పల్లంరాజు వచ్చిన్పటి నుంచి వైకాపా నాయకులు చెప్పిందే వేదంగా భావించి పనులు చేశారు. రెంటచింతలకు చెందిన ఓ బెట్టింగ్‌ కేసులో పరిధులు దాటి బెంగళూరు వరకు వెళ్లి విచారణ పేరిట పలువురు వద్ద సొమ్ములు సంపాదించారని పేరుపడింది. సంపాదనే ధ్యేయంగా పని చేయడం, అధికార పార్టీకి కొమ్ము కాయడం మినహా శాంతిభద్రతల పరిరక్షణ పట్టించుకోలేదు. రెంటచింతల మండలం పరిధిలో తెదేపా నాయకుడిని మూడు గంటల పాటు కారులో నిర్బంధించి కొట్టిన ఘటనలో వైకాపా నాయకులను రక్షించేందుకు స్వయంగా రాజీ ప్రయత్నాలు చేశారు. చివరికి పోలీసు బెదిరింపులతో బాధితుడు ఫిర్యాదు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది. వెల్దుర్తి, మాచర్ల, దుర్గి, కారంపూడి వంటి ప్రాంతాల నుంచి తెలుగుదేశం నేతలు అనేక ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. వైకాపా నాయకులకు వంతపాడుతూ చివరకు ఎన్నికల విధులకు దూరమయ్యారు. 


వినుకొండ రూరల్, వినుకొండ టౌన్, మాచర్ల రూరల్, కారంపూడి పోలీసు స్టేషన్లలో సీఐగా పని చేసిన చినమల్లయ్య వైకాపా నాయకులు చెప్పినట్లు నడుచుకున్నారు. 2021లో పురపాలక ఎన్నికలు జరుగుతున్న సమయంలో వినుకొండ టౌన్‌ సీఐగా ఉన్నారు. అప్పుడు 32వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారని బీఎస్పీకి చెందిన రాజు, సీపీఐ నాయకులు చిన్న పోదాల శీను సీఐకు ఫిర్యాదు చేస్తే, ఆయన వీరిపైనే ఎదురుదాడికి దిగారు. డీఎస్పీ ఎదుటే బాధితులు సీఐతో సామాన్యులను నా కొడకా అంటావా? అంటూ ప్రశ్నించారు. కారంపూడిలో తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ చేతిలో పిస్తోలుతో బెదిరించారు. చివరకు వీఆర్‌లోకి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని