logo

ఏఎన్‌యూ వీసీ రాజీనామా చేయాలి

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం అమరావతి రైతుల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. మూడు రాజధానులకు మద్దతుగా ఏఎన్‌యూలో సదస్సు నిర్వహించిన వీసీ రాజశేఖర్‌ వెంటనే రాజీనామా చేయాలంటూ రైతులు నినాదాలు చేశారు.

Published : 20 Jun 2024 04:12 IST

రాజధాని రైతులు, విద్యార్థుల ఆందోళన
వైకాపాకు తొత్తుగా వ్యవహరించిన రాజశేఖర్‌ తప్పుకోవాలని డిమాండ్‌

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం అమరావతి రైతుల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. మూడు రాజధానులకు మద్దతుగా ఏఎన్‌యూలో సదస్సు నిర్వహించిన వీసీ రాజశేఖర్‌ వెంటనే రాజీనామా చేయాలంటూ రైతులు నినాదాలు చేశారు. రైతులకు మద్దతుగా టీఎన్‌ఎస్‌ఎఫ్, జనసేన, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు వచ్చారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రైతులు వీసీ కార్యాలయానికి చేరుకునేలోపు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి తాళాలు వేశారు. వీసీ బయటకు రావాలంటూ రైతులు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైకాపాకు తొత్తుగా వ్యవహరించిన వీసీ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. పెదకాకాని సీఐ వీరాస్వామి ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడారు. మూడు రాజధానులకు మద్దతుగా సదస్సు నిర్వహించిన సమయంలో తాము ఏఎన్‌యూ వద్ద ఆందోళన చేయగా అవహేళనగా మాట్లాడంతోపాటు దాడికి పాల్పడ్డారని రైతులు చెప్పారు. వీసీ వచ్చి తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వీసీ కిందకి వచ్చి వారితో మాట్లాడారు. మూడు రాజధానులకు మద్దతుగా సదస్సు ఎందుకు పెట్టారని రైతులు ప్రశ్నించగా.. అప్పటి ప్రభుత్వం ఆదేశం మేరకు నిర్వహించానన్నారు. సదస్సు పెట్టాలని ఉత్తర్వులున్నాయా అంటే లేదని సమాధానమిచ్చారు. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఎలా నిర్వహించారని ప్రశ్నించగా.. ఇప్పుడున్న ప్రభుత్వం అమరావతికి మద్దతుగా సమావేశం పెట్టమంటే అందుకూ సిద్ధమేనని వ్యంగ్యంగా చెప్పారు. రైతులు మాట్లాడుతుండగా చేతులు దించాలని.. వీసీకి తగులుతున్నాయని సీఐ స్వామిభక్తి ప్రదర్శించారు. ఎన్నికల సమయంలో తెదేపాకు అనుకూల ఉద్యోగులను ఎందుకు ఇబ్బంది పెట్టారని నంబూరుకు చెందిన జయరామిరెడ్డి ప్రశ్నించగా అలాంటిదేమీ లేదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని మాత్రమే చెప్పానన్నారు. దీంతో కాజకు చెందిన బొమ్ము శ్రీనివాసరెడ్డి మీరు ఎందుకు విశ్వవిద్యాలయంలో రాజకీయాలు చేశారంటూ నిలదీశారు. అక్కడే ఉన్న వికాస అధ్యక్షులు అనిల్‌.. వీసీపై కోపంగా మాట్లాడతారా అని రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య వాదన పెరుగుతుండటంతో సీఐ వీరాస్వామి వీసీని లోపలికి తీసుకెళ్లారు. తమకు క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్‌ చేశారు. రాజీనామా విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలిపెడుతున్నామని రైతులు చెప్పారు. కార్యక్రమంలో రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు కళ్లం రాజశేఖర్‌రెడ్డి, రైతులు ఆలూరి యుగంధర్, కొమ్మినేని వరలక్ష్మి, కామినేని గోవిందమ్మ, అరుంధతి, పోలు దుర్గ, చిలకా బసవయ్య, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు నితీష్‌ యాదవ్, జనసేన విద్యార్థి విభాగం నాయకులు జగదీష్, పవన్‌సాయి, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు నాసరయ్య తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని