logo

మిర్చి ధరల నేలచూపు

సీజన్‌లో ఆశాజనకంగా ఉన్న మిర్చి ధరలు వేసవి సెలవుల అనంతరం నేలచూపు చూస్తున్నాయి. అటు వ్యాపారులు, ఇటు రైతులు ఊహించని విధంగా ధరలు తగ్గుతున్నాయి.

Published : 20 Jun 2024 04:14 IST

ఎగుమతులు మందగించడమే కారణం
మిర్చియార్డు, న్యూస్‌టుడే

సీజన్‌లో ఆశాజనకంగా ఉన్న మిర్చి ధరలు వేసవి సెలవుల అనంతరం నేలచూపు చూస్తున్నాయి. అటు వ్యాపారులు, ఇటు రైతులు ఊహించని విధంగా ధరలు తగ్గుతున్నాయి. విదేశాలతో పాటు దేశీయంగానూ ఎగుమతులు నిలిచిపోవడంతో ఆ ప్రభావం మిర్చి ధరలపై పడింది. ఫలితంగా క్రయవిక్రయాలు మందగిస్తున్నాయి. ధరలు తగ్గుముఖం పడుతుండటంతో రైతులు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. వారం, పది రోజుల్లో ఎగుమతులు ఊపందుకుంటే మళ్లీ  పెరుగుతాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. వేసవి సెలవులకు పది రోజులు ముందు నుంచే ధరలు తగ్గడం ప్రారంభించాయి. అప్పట్లో దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి, ఆ తర్వాత కౌంటింగ్‌ ఉండటంతో ధరలు తగ్గినా పెద్దగా ప్రభావం చూపలేదు. చివరి కోతలు కావడంతో నాణ్యత లేమి కారణంగా మిర్చి ధరలు గతంలో తగ్గుతూ వచ్చాయి. 

ఎగుమతులు ఊపందుకుంటేనే..

గతేడాదితో పోలిస్తే అన్ని రకాల మిర్చి ధరలు తగ్గాయి. సాధారణ రకం మిర్చి కనిష్ఠ ధర రూ.1,000, గరిష్ఠ ధర రూ.5,000 వరకు తగ్గింది. ప్రత్యేక రకం మిర్చి ధరలు కనిష్ఠంగా రూ.1,500, గరిష్ఠంగా రూ.4,000 వరకు తగ్గుముఖం పట్టాయి. తాలు రకం కూడా రూ.1,500 వరకు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే కోల్ట్‌స్టోరేజ్‌ల్లో 17,00,000 మిర్చి బస్తాలు అధికంగా నిల్వ ఉన్నాయి. ఎగుమతులు ఊపందుకుంటే మిర్చి ధరల్లో కదలిక వస్తుందని వ్యాపారులు, అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే సోమవారం నుంచి మిర్చి ధరలు కొంతమేరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 


శీతల గిడ్డంగుల్లో తరగని నిల్వలు

అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇటీవల ముగిసిన మిర్చి సీజన్‌లో ధరలు తక్కువగా ఉండటంతో రైతులు శీతల గిడ్డంగుల్లో నిల్వలకు మొగ్గు చూపారు. ప్రారంభంలో ధరలు బాగుండటంతో రైతులు మిర్చి సాగుకు ఆసక్తి కనబర్చారు. ఫలితంగా గతేడాది మిర్చి పంట విస్తీర్ణం పెరిగింది. పంట చేతికి అంది వచ్చేసరికే సీజన్‌లో మిర్చి ధరలు మందగించడంతో రైతులు సరకు విక్రయించకుండా శీతలగిడ్డంగులకు తరలించారు. ఫలితంగా ఎప్పుడూ నిండని కోల్డ్‌స్టోరేజ్‌లు కూడా ఈ ఏడాది నిండాయి. గతేడాది జూన్‌లో 63,50,000 మిర్చి బస్తాలు నిల్వ ఉండగా, ఈ ఏడాది ప్రస్తుతం 80,50,000 బస్తాలు నిల్వ ఉన్నాయి. చైనా, బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు ఎగుమతులు ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయాయి. బక్రీద్‌ పండగకు ముందు అయిదు రోజులు, తర్వాత అయిదు రోజులు పాటు మొత్తం పది రోజులు వరకు బోర్డర్‌లో అనుమతించరని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు చైనాకు ఎగుమతులు గతంలో వలే సాగడం లేదు. అక్కడ తక్కువ ధరకు మిర్చిని అమ్ముకోవాల్సి వస్తుండటంతో ఎగుమతి వ్యాపారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు దేశీయంగానూ ఎగుమతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు