logo

సాగు.. జాగు!

కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాల్లేక జలాశయాల్లోకి నీరు చేరడం లేదు. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని జలాశయాలు డెడ్‌ స్టోరేజికి చేరుకున్నాయి. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని జలాశయాల్లోనూ ఇదే పరిస్థితి.

Published : 20 Jun 2024 04:24 IST

జలాశయాల్లో కనిష్ఠ స్థాయికి నీటి నిల్వలు
వర్షాలపైనే రైతుల ఆశలు
ఈనాడు - అమరావతి

కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాల్లేక జలాశయాల్లోకి నీరు చేరడం లేదు. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని జలాశయాలు డెడ్‌ స్టోరేజికి చేరుకున్నాయి. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని జలాశయాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ కారణంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని కాలువలకు నీటి విడుదలపై సందిగ్ధం కొనసాగుతోంది. ఇక్కడ వ్యవసాయానికి కృష్ణా జలాశయాలే కీలకం. ఇటు గోదావరిలో కూడా ఆశించిన స్థాయిలో ప్రవాహాల్లేక పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో సాగునీటి సలహా మండలి సమావేశాలను కూడా నిర్వహించడం లేదు. 

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మంత్రులు బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పుడిప్పుడే ప్రాజెక్టుల్లోని నీటి నిల్వల వివరాలు, సాగునీటి అవసరాలు, కాలువల పరిస్థితి తదితర అంశాలపై జలవనరుల శాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. మంత్రి సమీక్ష తరువాత కాలువల మరమ్మతులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. 

ఇంకా సందిగ్ధం..

ఖరీఫ్‌ సీజన్‌ మొదలై 20 రోజలవుతున్నా ఆశించినస్థాయిలో సాగు పనులు ప్రారంభం కాలేదు. విత్తన మార్కెట్‌ కూడా మందకొడిగానే ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు పడుతున్నా పత్తి సాగు ఊపందుకోలేదు. గతేడాది ప్రతికూల అనుభవాలే దీనికి కారణం. ఈసారి అపరాలు, శనగ, పొగాకు సాగుకు రైతులు కొంత మొగ్గు చూపుతున్నారు. మిర్చి నర్సరీ యజమానులు కూడా 20 శాతమే నారు పెంచుతున్నారు. విత్తనం నాటిన 40 రోజుల్లో మిరప మొక్కలు నాటడానికి సిద్ధమవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని నారు పోయడం లేదు. మరోవైపు కృష్ణా పశ్చిమ డెల్టాలో కాలువలకు నీరెప్పుడు వస్తుందో తెలియక రైతులు వరి నారుమళ్లను ఇంకా ప్రారంభించలేదు. వర్షాలు కొనసాగితే జులైలో వెద పద్ధతిలో సాగుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. జలాశయాల్లోకి నీరు ఎప్పుడొస్తుందో స్పష్టంకాకపోవడంతో సాగు పనులు ఇంకా ఊపందుకోలేదని గుంటూరు జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారన్నారు.


ప్రవాహాలు లేక వెలవెల

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో 86 శాతం సాగుకు కాలువలు, ఎత్తిపోతల పథకాలే ఆధారం. మన రాష్ట్ర పరిధిలో కృష్ణా నదిపై ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటాయి. ఎగువన కర్ణాటకలో ఉన్న జలాశయాల్లోకి ఇంకా వరద నీటి ప్రవాహాలు మొదలు కాలేదు. ఆల్మట్టిలో 22 శాతమే నీటి నిల్వ ఉండగా.. జూరాలలో 93 శాతం, నారాయణపూర్‌లో 66 శాతం నీటి నిల్వలున్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టులోకి 5,291 క్యూసెక్కులు, జూరాలకు 3,782 నారాయణపూర్‌కు 195 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఈ మూడు ప్రాజెక్టుల్లోకి 113 టీఎంసీల నీరు చేరితేనేగాని దిగువకు నీటి విడుదల సాధ్యం కాదు. మరోవైపు తుంగభద్ర జలాశయంలో కేవలం 5.89 టీఎంసీల మేరకే నీరుంది. ఇంకా 94.97 టీఎంసీలు చేరితేనే ప్రాజెక్టు గరిష్ఠస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. ఇక్కడ ప్రస్తుతం 3,175 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఎగువన ఉన్న ప్రాజెక్టులు నిండాకే. మన రాష్ట్రంలోని జలాశయాలకు నీరు చేరుతుంది. ఈ నేపథ్యంలో రైతులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని