logo

మూల్యాంకనం అధికారులుగా అతిథి అధ్యాపకులు?

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులను బీఈడీ మూల్యాంకన అధికారులుగా నియమించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Published : 21 Jun 2024 05:47 IST

ఎ.ఎన్‌.యు, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులను బీఈడీ మూల్యాంకన అధికారులుగా నియమించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం అధికారులుగా కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న అధ్యాపకులనే నియమించాలి. రెండేళ్ల అనుభవం కూడా లేని అతిథి అధ్యాపకులను ప్రశ్నాపత్రాల మూల్యాంకనం అధికారులుగా నియమించడం విమర్శలకు దారితీస్తోంది. ఏఎన్‌యూలో బీఈడీ నాలుగో సెమిస్టర్‌ ప్రశ్నపత్రాలను ఈనెల 6 నుంచి మూల్యాంకనం చేస్తున్నారు. ఒక్కో అధ్యాపకుడితో బలవంతంగా రోజుకు 60 నుంచి 90 ప్రశ్నపత్రాలు చేయిస్తున్నారు. ఈ లెక్కన మూడు నిమిషాలకే ఒక పేపర్‌ను మూల్యాంకనం, స్క్రూట్ని చేయడం కష్టంగా ఉందని చెప్పినా అధికారులు వినడం లేదని అధ్యాపకులు వాపోతున్నారు. గతంలో రోజుకు 45 ప్రశ్నపత్రాలు చేసేవాళ్లమని, ఇప్పుడు 90 చేయడం కష్టం ఉందని పీజీ పరీక్షల సమన్వకర్త ఆచార్య ఉదయ్‌కుమార్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా గవర్నర్‌కు ఫిర్యాదు చేసుకోవాలని ఎగతాళిగా సమాధానం ఇచ్చారని తెలిపారు. చివరికి వీసీ రాజశేఖర్‌ని కలిసి తమ గోడును వినతి పత్రంలో ఇచ్చేందుకు యత్నించగా ఆయన తన పీఏకి ఇవ్వాలని సూచించడంతో వాళ్లు నిరాశతో వెనుదిరిగారు. 90 ప్రశ్నపత్రాలు మూల్యాంకనం చేయిస్తే రెండు డీఏలు ఇవ్వాలని, గతంలో 45 పేపర్‌లకు ఒక డీఏ ఇచ్చారని, వీసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. లేకపోతే ప్రశ్నపత్రాలు మూల్యాంకన చేయలేమని వీసీకి ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని