logo

నేడు శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

ప్రజలు మార్పు కోరుకోవడంతో జిల్లాలో ఉన్న ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఒక్క స్థానాన్ని కూడా వైకాపాకు ఇవ్వలేదు. అంతేకాకుండా అన్నిచోట్లా తెదేపా అభ్యర్థులు రికార్డు స్థాయి మెజార్టీలతో గెలిచారు.

Updated : 21 Jun 2024 06:50 IST

పల్నాడును ప్రగతి బాట పట్టించాలని ప్రజల వేడుకోలు
ఈనాడు డిజిటల్, నరసరావుపేట

ప్రజలు మార్పు కోరుకోవడంతో జిల్లాలో ఉన్న ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఒక్క స్థానాన్ని కూడా వైకాపాకు ఇవ్వలేదు. అంతేకాకుండా అన్నిచోట్లా తెదేపా అభ్యర్థులు రికార్డు స్థాయి మెజార్టీలతో గెలిచారు. అభివృద్ధే కావాలని పల్నాడు ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత శాసనసభ నేడు కొలువుదీరనుంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు శుక్రవారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన సభ కొలువుదీరనుండటంతో ప్రజలు వారి ఆశలు.. ఆకాంక్షలను సభ్యులు సభలో ప్రస్తావించి పరిష్కారానికి కృషిచేయాలని కోరుతున్నారు. అభివృద్ధే అజెండాగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడంతో పాటు యువతకు ఉపాధి, పర్యాటకాభివృద్ధి, సాగర్‌ కుడి కాల్వలకు మరమ్మతులు చేపట్టి తాగు, సాగునీటిని అందివ్వడం తొలి ప్రాధాన్యంగా గుర్తించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. నియోజకవర్గాల వారీగా సమస్యలను పరిష్కరించి ప్రగతి పట్టా లెక్కిస్తారని ఆశిస్తున్నారు.


ఉపాధి మాట పుల్లారావు నోట పలకాలి

చిలకలూరిపేట..

అమృత్‌ పథకం కింద చిలకలూరిపేటలో చేపట్టిన పనులు తిరిగి మొదలుపెట్టాలి. కొండవీడు కోటను అభివృద్ధి చేయాలి. స్పైసెస్‌ పార్కుకు అదనంగా కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలి. పత్తి ఆధారిత పరిశ్రమలకు కేంద్రంగా ఉన్న పేటలో మరింత మందికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుపై ఉంది.


పారిశ్రామికీకరణకు ప్రయత్నించాల్సింది యరపతినేనే

గురజాల..

సహజ వనరులకు నిలయం గురజాల. ఎర్ర మట్టి, నాపరాయి, సున్నపురాయి, రంగురాళ్లు.. సంబంధిత పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి చూపాలి. గురజాలకు విద్యాసంస్థలు, పరిశ్రమలను తీసుకురావాలి. కృష్ణానదిపై ఉన్న ఎత్తిపోతల పథకాలను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలి. సిమెంట్‌ పరిశ్రమలే కాకుండా వాటి అనుబంధ పరిశ్రమలను కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై ఉంది. 


భాష్యం ప్రవీణ్‌ భళా అనిపించుకొనేనా..

పెదకూరపాడు.. 

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం అమరావతి అభివృద్ధి సంగతి దేముడెరుగు తెదేపా హయాంలో చేపట్టిన పనులను అటకెక్కించారు. నదీతీరాన వెలిసిన ఆధ్యాత్మిక కేంద్రాలకు పూర్వవైభవం తీసుకురావాలి. బెల్లంకొండ మండలం ఎమ్మోజీగూడెం వాసులకు పునరావాసం కల్పించాలి. ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలి. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భాష్యం ప్రవీణ్‌ అభివృద్ధిపై తన మార్క్‌ ఏంటో చూపించాలి.


బ్రహ్మారెడ్డి భుజాలపై బృహత్తర బాధ్యత

మాచర్ల..

అక్రమ మద్యం, నాటు సారా, గుట్కా వ్యాపారం, అక్రమ మైనింగ్‌ వంటివి చేస్తూ నియోజకవర్గాన్ని గత పాలకులు భ్రష్టు పట్టించారు. వీటికి చెక్‌ పెట్టాలి. నాగార్జునసాగర్, ఎత్తిపోతల జలపాతం, అనుపు రేవు.. ఇలా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి కల్పించవచ్చు. మాచర్ల పట్టణం రూపురేఖలు మారాలి. తండాలకు వెళ్లే రోడ్లు సరిగా లేవు. మార్పు ఏంటో చూపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి భుజస్కంధాలపై ఉంది.  


ఆంజనేయులపై కొండంత ఆశలు

వినుకొండ..

నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఉన్న ఎత్తిపోతల పథకాలను మూలకు చేర్చారు. మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. బొల్లాపల్లి మండలంలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలి. వినుకొండలో పరిశ్రమలు కాని, ఉన్నత విద్యాసంస్థలు కానీ లేవు. ఇది వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన జీవీ ఆంజనేయులుకు వినుకొండను గాడిన పెట్టడం పెద్ద సమస్యేమి కాదని స్థానికులు భావిస్తున్నారు. 


ప్రగతి పట్టాలెక్కించాల్సింది కన్నానే 

సత్తెనపల్లి.. 

సత్తెనపల్లి పట్టణం విస్తరణకు నోచుకోలేదు. వరద ముంపు సమస్య వెంటాడుతోంది. మాజీ సభాపతి కోడెల తీసుకొచ్చిన తారక రామ సాగరంలో బోటింగ్‌ను నిలిపివేశారు. గతంలో పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో కన్నా లక్ష్మీనారాయణ అభివృద్ధి పనులు చేపట్టి సత్తెనపల్లిని ప్రగతి బాట పట్టించాలి. 


రూపురేఖలు మార్చాల్సింది అరవిందబాబే

నరసరావుపేట..

నరసరావుపేట కేంద్రంగా జిల్లా ఏర్పడినా అందుకనుగుణంగా వసతులు కల్పించడంలో గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పట్టణంలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొత్తగా నీటి పైపులైన్లు వేయలేదు. ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోయింది. మల్లమ్మసెంటర్‌పై ఒత్తిడి తగ్గించాలి. బస్టాండ్‌ కూడా ప్రయాణికుల రద్దీకనుగుణంగా మార్పు చెందలేదు. పట్టణానికి చెంతనే ఉన్న కోటప్పకొండను వైకాపా ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. మొత్తంగా జిల్లా కేంద్రం రూపురేఖలను మార్చాల్సిన బాధ్యత ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుపై ఉంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని