logo

అక్కాచెల్లెళ్లు.. క్రీడల్లో మెరికలు

తెనాలి పట్టణానికి చెందిన ప్రసాద్, లక్ష్మి దంపతుల కుమార్తెలు హర్షిత, సుస్మిత క్రీడల్లో సత్తా చాటుతున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి అధిగమించి జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు.

Published : 21 Jun 2024 05:56 IST

సాధించిన పతకాలతో హర్షిత, సుస్మిత

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి పట్టణానికి చెందిన ప్రసాద్, లక్ష్మి దంపతుల కుమార్తెలు హర్షిత, సుస్మిత క్రీడల్లో సత్తా చాటుతున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి అధిగమించి జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. హర్షిత ఇంటర్‌ రెండో సంవత్సరం, సుస్మిత పదో తరగతి చదువుతున్నారు. చదువులో ముందంజలో ఉన్న ఇరువురు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తమకు నచ్చిన హ్యాండ్‌ బాల్‌ ఆటలో 8 సంవత్సరాల కిందట సాధన ప్రారంభించారు. 4వ తరగతి చదువుతున్న సమయంలో వారి సాధన మొదలైంది. తొలి నాలుగు సంవత్సరాలు విజయవాడలో గురువు హేమ వద్ద తర్ఫీదు తీసుకున్నారు. అందు కోసం రోజూ పాఠశాలల వేళలు ముగిసిన తరవాత తెనాలి నుంచి విజయవాడ వెళ్లే వారు. అటుపై గత నాలుగు సంవత్సరాలుగా తెనాలిలో గురువు నాగరాజు వద్ద శిక్షణ కొనసాగిస్తున్నారు. రోజూ ఉదయం రెండు, సాయంత్రం రెండు గంటలు సాధన చేస్తున్నారు.

జాతీయ స్థాయిలో గుర్తింపు.. జిల్లా స్థాయి ప్రతిభతో పదుల సంఖ్యలో పతకాలు తెచ్చుకున్న సోదరీమణులు గత ఏడాది చివరిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గుంటూరు జిల్లా తరఫున ఆడి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. చెల్లెలు సుస్మిత సబ్‌ జూనియర్స్‌ బాలికల జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. ఆమె నేతృత్యంలోని జట్టు ఈ ఏడాది జనవరిలో రాజస్థాన్‌లో జరిగిన జాతీయ పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. సుస్మిత వెయిట్ లిఫ్టింగ్‌లోనూ జిల్లా స్థాయిలో బంగారు పతకాలు సాధించింది. పరుగులోనూ ప్రతిభ చూపుతుంది. హర్షిత మంచి చిత్రకారిణి కూడా. చక్కటి చిత్రాలను ఆవిష్కరిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. హ్యాండ్‌ బాల్‌ జాతీయ జట్టులో స్థానాలు సంపాదించి అంతర్జాతీయ పోటీల్లో ఆడాలన్నది క్రీడలపరంగా తమ ధ్యేయమన్నారు. డాక్టర్‌ కావాలని హర్షిత, ఐపీఎస్‌ సాధించాలని సుస్మిత తమ లక్ష్యమని వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని