logo

మీ ప్రమాణం.. మార్పునకు శ్రీకారం

ప్రజలు మార్పు కోరుకోవడంతో జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఒక్క స్థానాన్ని కూడా వైకాపాకు ఇవ్వలేదు. అభివృద్ధే కావాలని తీర ప్రాంత ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత శాసనసభ శుక్రవారం కొలువుదీరనుంది.

Published : 21 Jun 2024 05:59 IST

నేడు శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
నియోజకవర్గాల్లో తిష్ఠవేసిన సమస్యలు పరిష్కరించాలి 
తీరాన్ని ప్రగతి బాట పట్టించాలని ప్రజల వేడుకోలు
ఈనాడు-బాపట్ల

ప్రజలు మార్పు కోరుకోవడంతో జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఒక్క స్థానాన్ని కూడా వైకాపాకు ఇవ్వలేదు. అభివృద్ధే కావాలని తీర ప్రాంత ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత శాసనసభ శుక్రవారం కొలువుదీరనుంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు నేడు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన సభ కొలువుదీరనుండటంతో ప్రజలు వారి ఆశలు.. ఆకాంక్షలను సభ్యులు సభలో ప్రస్తావించి పరిష్కారానికి కృషిచేయాలని కోరుతున్నారు. పూర్తిగా వ్యవసాయాధారిత జిల్లా అయిన బాపట్లలో కాలువలు, వాగుల ఆధునికీకరణ, నీటి ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. కొన్ని ప్రాజెక్టులు అసంపూర్తిగా వెక్కిరిస్తున్నాయి. వాటన్నింటిని పూర్తిచేయాల్సిన బాధ్యత కొత్తగా ఎన్నికైన సభ్యులపై ఉంది. నియోజకవర్గాల వారీగా సమస్యలను పరిష్కరించి ప్రగతి పట్టాలెక్కిస్తారని ఆశిస్తున్నారు.


అద్దంకి..

రూ.83 కోట్లతో అద్దంకి పురపాలికలో రక్షిత నీటి మంచి పథకం పనులు గత ప్రభుత్వం పూర్తి చేయలేదు. ఇది పూర్తయితే 50 వేలమంది ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. గుండ్లకమ్మ ప్రాజెక్టులో కొట్టుకుపోయిన రెండు గేట్లను ఏర్పాటు చేస్తే తప్ప ప్రాజెక్టులో నీళ్లు నిలబడవు. 1.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. నామ్‌ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు అద్దంకి, గోపాలపురం, ఏల్చూరు, చక్రాయపాలెం మధ్య విస్తరణ పనులు నిధుల లేమితో అసంపూర్తిగా ఉన్నాయి. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గొట్టిపాటి రవికుమార్‌ సమస్యలపై తక్షణం దృష్టిసారించాలి.


బాపట్ల

జిల్లా కేంద్రం బాపట్లలో రెండో చెరువు లేక ఇప్పటికీ రెండు, మూడు రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు సరఫరా చేస్తున్నారు. దీనికి సంబంధించిన భూ సేకరణ సమస్య అపరిష్కృతంగానే ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. సాగునీటి, మురుగునీటి కాల్వల్లో పూడికలు తిష్ఠేశాయి. నీటి సమస్య పరిష్కారించాల్సిన బాధ్యత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే నరేంద్రవర్మపై ఉంది.


చీరాల

నియోజకవర్గంలో చీరాల, వేటపాలెం మండలాలకు రూ.350 కోట్లతో కొమ్మమూరు కెనాల్‌ నుంచి నీళ్లు ఇచ్చే పథకం కార్యరూపం దాల్చలేదు. ఇది కార్యరూపం దాలిస్తే నీటి సమస్య పరిష్కారమవుతుంది. ప్రస్తుత భూగర్భజలాల నీళ్లే దిక్కు. టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేసినా దాన్ని ఆచరణలో పెట్టలేదు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కొండయ్య పర్యాటకంగా అభివృద్ది చేస్తే యువతకు ఉపాధి లభిస్తుంది.


రేపల్లె

నియోజకవర్గం కేంద్రం రేపల్లెను తాగునీటి సమస్య పట్టిపీడిస్తుంది.. తీర గ్రామాల్లో నీరందక దాహంతో అల్లాడుతున్నారు. నిజాంపట్నం హార్బరు పనులు నత్తనడకన సాగుతున్నాయి. మారుమూలగానున్న రేపల్లెలో వైద్య సేవలు అంతంత మాత్రంగా ఉన్నాయి. కీలకమైన వాన్‌పిక్‌ ప్రాజెక్టు కదలిక తీసుకొస్తే తీర ప్రాంత యువతకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. మంత్రి అనగాని ప్రత్యేక దృష్టిసారించి రేపల్లె ప్రగతి బాట పట్టించాలి.


వేమూరు

ప్రధానంగా భూగర్భజలాలు అడుగంటిపోయి పొలాలకు నీరు అందకుండా ఇంకిపోతున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలకు శాశ్వతంగా స్వస్తి పలికేలా చర్యలు తీసుకోవాలి. కొల్లూరులోని ఇటుకబట్టీలతో కాలుష్యం ప్రజలను ఇబ్బందులు పెడుతోంది. ఆయకట్టు సామర్థ్యం మేరకు పోతార్లంక ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత నక్కా ఆనందబాబుపై ఉంది.


పర్చూరు

మార్టూరు-పర్చూరు వాగు ఆధునికీకరణ చేపట్టాలి. కొమ్మమూరు కాల్వల ఆధునికీకరణతో పాటు పంట కాల్వల్లో ఉన్న తుమ్మచెట్లు గుర్రపుడెక్క వంటివి తొలగిస్తే తప్ప నీళ్లు పొలాలకు చేరవు. వ్యాపారులకు మైనింగ్‌ పాలసీ అందుబాటులో ఉండేలా తీసుకురావాలని వ్యాపారులు కోరుతున్నారు. వాగులకు మరమ్మతులు తక్షణం చేపట్టాల్సిన బాధ్యత ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని