logo

ఆహ్లాద ‘యోగం’ ఆనందభాగ్యం

యోగా అతి పురాతనమైనదే గానీ అమూల్యమైంది. అతి ప్రాచీనమైనదే గానీ నిత్యనూతనమైంది. పద్ధతేదైనా మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయడమే యోగా లక్ష్యం.

Published : 21 Jun 2024 06:03 IST

యోగా సాధన

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: యోగా అతి పురాతనమైనదే గానీ అమూల్యమైంది. అతి ప్రాచీనమైనదే గానీ నిత్యనూతనమైంది. పద్ధతేదైనా మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయడమే యోగా లక్ష్యం. ఆసనాలతో అన్ని అవయవాలను సున్నితంగా మర్దన చేస్తూ.. ధ్యానంతో చంచలమైన మనసుకు కళ్లెం వేసి కూర్చోబెడుతూ.. ప్రాణాయామంతో ప్రాణశక్తి కేంద్రాలను ఉద్దీపింప జేస్తూ.. శారీరకంగా, మానసికంగా మనిషిని అజేయశక్తిగా మలుస్తుంది. యోగా అనగానే అదేదో కఠినమైన సాధనగానే చాలామంది భావిస్తుంటారు. నిజానికి చాలా తేలికైన ఆసనాలతోనూ ఎన్నెన్నో ప్రయోజనాలు పొందొచ్చు. మనసును లగ్నం చేసి క్రమం తప్పకుండా సాధన చేస్తే మనిషిని శారీరకంగా, మానసికంగా యోగా ఉన్నత స్థితికి చేరుస్తుంది. ఆధునిక జీవనశైలితో ముడిపడిన ఎన్నో జబ్బులను దూరం చేసుకోవచ్చు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం. 

ప్రభుత్వ యునాని, నాచురోపతి యోగా వైద్యశాల

సర్వజనాసుపత్రిలో శిక్షణ 

సంప్రదాయ వైద్య చికిత్సా పద్ధతులు అందుబాటులోకి తెచ్చేందుకు ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో సర్వజనాసుపత్రిలో ప్రభుత్వ యునానీ, నాచురోపతి యోగా వైద్యశాలను ఏర్పాటు చేశారు. చక్కటి ఆరోగ్యం, మంచి రోగనిరోధకశక్తి, బరువు అదుపులో ఉండడం, నిగనిగలాడే చర్మం, మది నిండా ఆహ్లాదం, ఆనందం, ఇలాంటివన్నీ యోగాభ్యాసనంతోనే దక్కుతాయని ఆ కేంద్రంలో నిపుణులు చెబుతున్నారు. మన రోజూవారీ జీవితంలో యోగా ద్వారా దక్కే ప్రయోజనాలను ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్నారు. పలు వ్యాధులను నయం చేసేందుకు మార్గాలను సూచిస్తున్నారు. సర్వజనాసుపత్రి నాట్కో క్యాన్సర్‌ విభాగం పక్కనే ఉన్న యునానీ వైద్యశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిపుణులు అందుబాటులో ఉంటారు. అక్కడే పేర్లు నమోదు చేసుకుంటారు.

బామ్మ.. భళా

70 ఏళ్ల వయసులోనూ చురుకుగా యోగా సాధన 

యోగాసనలో పిన్నమనేని ఉషారాణి 

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి పట్టణం ఉడాకాలనీకి చెందిన పిన్నమనేని ఉషారాణి (70) భర్త సాంబశివరావు విశ్రాంత ఉద్యోగి. వారి కుమారుడు, కుమార్తెలకు వివాహాలు అవ్వగా.. మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. తొలి నుంచి ఆమె ఆరోగ్య స్పృహతో ఉన్నారు. తన ఇంటి సమీపంలో ఇండోర్‌ స్టేడియంలో యోగా శిక్షణ శిబిరం నడుస్తూ ఉంటే అక్కడ గురువు కోడూరి మల్లికార్జునరావు వద్ద యోగ సాధన చేశారు. రెండు సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా కొనసాగించారు. 2014 నుంచి ఇండోర్‌ స్టేడియంలో యోగా సాధకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. రోజూ తెల్లవారుజామున 5.30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు తాను సాధన చేయడంతో పాటు శిక్షణ ఇస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ హషారుగా ఉంటూ.. మరింత మందికి యోగా చేరువ చేస్తున్నారు. శుక్రవారం యోగా దినోత్సవం సందర్భంగా ఉషారాణి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ నిత్య యోగా సాధన వల్ల అనారోగ్య తదితర సమస్యలు దరి చేరవని, ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. ముందు శరీరంలోని అన్ని అవయవాలు సులువుగా కదులుతాయని, అందరూ ఆచరిస్తే మేలు జరుగుతుందని చెప్పారు.

ఉచితంగా సాధన: డాక్టర్‌ మౌనిక, వైద్యాధికారి, యునాని వైద్యశాల గుంటూరు 

యోగా చాలా తేలికైంది, సరళమైంది. ఆసనాలు ఒకసారి నేర్చుకుంటే చాలు ఎవరికివారే చేసుకోవచ్చు. ఎలాంటి ఉపకరణాలు అవసరం లేదు. పెద్దగా సమయం కూడా పట్టదు. క్రమంగా సాధన చేస్తే జీవితాంతం తోడుగా నిలుస్తుంది. అన్ని కోణాల్లోనూ మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేస్తుండటమే దీని ప్రత్యేకత. యునానీ వైద్యశాలలో సుశిక్షితులైన, అనుభవం గల నిపుణుల పర్యవేక్షణలోనే సాధన చేయిస్తున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. పాఠశాలలు, కళాశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులుంటే అక్కడికే వెళ్లి శిక్షణ ఇస్తున్నాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని