logo

ఆశలు.. ఆకాంక్షలు

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత శాసనసభ నేడు కొలువుదీరనుంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు శుక్రవారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Published : 21 Jun 2024 06:07 IST

సమస్యలు తీరాలి.. ప్రగతి పట్టాలెక్కాలి

విస్తరించాల్సిన అరండల్‌పేట పైవంతెన 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత శాసనసభ నేడు కొలువుదీరనుంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు శుక్రవారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లా నుంచి కూటమి తరఫున ఏడుగురు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. నూతన సభ కొలువుదీరనుండడంతో ప్రజలు వారి ఆశలు.. ఆకాంక్షలను సభ్యులు సభలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు. వైకాపా ఐదేళ్ల పాలనలో జిల్లాలో ప్రగతి పడకేసింది. రాజధాని ప్రాంతం అమరావతిలో అభివృద్ధికి సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ప్రజావేదిక విధ్వంసంతో పాలన ప్రారంభించిన వైకాపా అన్ని రంగాలను నిర్వీర్యం చేసింది. దీనిని గుర్తించిన జిల్లా ప్రజలు వైకాపాకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా కూటమి అభ్యర్థులను రికార్డు మెజారిటీలతో గెలిపించారు. రాజధాని అమరావతితో పాటు జిల్లాలో అనేక సమస్యలను పరిష్కరించి ప్రగతి పట్టాలెక్కించాల్సిన తరుణమిదే. 

గుంటూరు వాహిని విస్తరణతోనే..

ప్రత్తిపాడు నియోజకవర్గంలో అటు సాగర్‌ కాలువలు, ఇటు డెల్టా కాలువలు చివరలో ఉండడంతో దశాబ్దాలుగా తాగు, సాగు నీటి సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించడానికి గుంటూరు వాహిని విస్తరణ ఒక్కటే మార్గం. తెదేపా హయాంలో గుంటూరు వాహిని పొడిగింపు, విస్తరణకు టెండర్లు పిలిచి గుత్తేదారుకు పనులు అప్పగించింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో గుంటూరు వాహిని విస్తరణ, పొడిగింపు పనులను వెంటనే ప్రారంభించాలి. నల్లమడ వాగు విస్తరణ చేపట్టకపోవడం, కట్టలు బలహీనమవడంతో వర్షం వస్తే నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, కాకుమాను మండలాలు వరదనీటితో చిగురుటాకులా వణికిపోతున్నాయి. వాగు విస్తరించి కట్టలు బలోపేతం చేయాల్సి ఉంది. 

రాజధాని అభివృద్ధితోనే ప్రగతి

రాజధానిలో రోడ్లు ధ్వంసం చేసి ఇసుక, ఇనుము, కంకర దొంగలు ఎత్తుకెళ్లారు. పునాది దశలో ఆగిపోయిన నిర్మాణాలతో ఇనుము తుప్పుపట్టి పనికిరాకుండా పోయింది. ప్రముఖ విద్యా సంస్థలకు వెళ్లే దారులు ఛిద్రమయ్యాయి. 90శాతం పూర్తయిన భవనాలను గత పాలనలో నిరుపయోగంగా వదిలేశారు. రాజధానిలో పనులు మొదలుపెట్టి పూర్వ వైభవం తీసుకురావాల్సి ఉంది. తాడికొండ నియోజకవర్గంలో ఆయకట్టుకు నీరు అందేలా కాలువలు బాగు చేయాలి.

గుంటూరులో వసతులు కల్పించాలి..

గుంటూరు నగరంలో పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. గుంటూరు నగరంలో గత తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థను వైకాపా ప్రభుత్వం మూలనపడేసింది. గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అర్ధంతరంగా ఆపేసి వెళ్లిపోయారు. దీంతో నగరంలోని వీధులు మొత్తం గోతులమయమయ్యాయి. ఈ పనులు పూర్తి చేయాలి. 

నగరంలో సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడపడానికి ఒక్క ఉద్యానవనం కూడా అభివృధ్ధి చేయలేదు. నగరంలో కీలకమైన శంకర్‌ విలాస్‌ వంతెన నిర్మాణం పదేళ్లుగా ప్రతిపాదనల దశలోనే ఉంది. వీటిని పట్టాలెక్కించాలి. నెహ్రూనగర్, శ్యామలానగర్‌ తదితర ప్రాంతాల్లో ఆర్‌యూబీలు నిర్మించాలి. నందివెలుగు రహదారిలో రైల్వేమార్గంపై వంతెన పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఇక్కడి సమస్యలను శాసనసభలో ప్రస్తావించి దశలవారీగా పరిష్కరించాలి.

సాగునీటి సమస్యల పరిష్కారానికి.. 

పొన్నూరు నియోజకవర్గంలో వ్యవసాయం మొత్తం డెల్టా కాలువలపై ఆధారపడి సాగుతోంది. ఐదేళ్లుగా వైకాపా పాలనలో కాలువల నిర్వహణ అటకెక్కడంతో సాగు నీటి ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో ఆయకట్టు చివరిభూములకు సాగునీరు అందడం లేదు. తెదేపా హయాంలో చేపట్టి సగం పూర్తయిన ఎత్తిపోతల పథకాలను ఆపేశారు.వీటికి నిధులు ఇచ్చి అందుబాటులోకి తేవాలి.పొన్నూరులో రోడ్లు, మౌలిక వసతులకు నిధులు కేటాయించాల్సి ఉంది.

డెల్టాలో కాలువల నిర్వహణకు నిధులు

తెనాలి నియోజకవర్గంలో డెల్టా కాలువల నిర్వహణ అటకెక్కడంతో అధ్వానంగా తయారయ్యాయి. రైతులు సాగు నీరు అందక ఆయిల్‌ ఇంజిన్లు పెట్టి పొలాలు తడపాల్సిన దుస్థితి నెలకొంది. కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాల్సి ఉంది. తెనాలి పట్టణంలో పేదలకు నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తే వారికి సొంతింటి కల నెరవేరుతుంది.అధ్వానంగా ఉన్న రోడ్లను బాగు చేయాల్సి ఉంది.

ప్రత్యేక నిధులు కేటాయిస్తేనే..

మంగళగిరి విహంగ వీక్షణం

వైకాపా మూడు రాజధానుల ప్రకటనతో మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో నిర్మాణాలు నిలిచిపోయాయి.భూముల ధరలు పతనమయ్యాయి. నిర్మాణాలు నిలిచిపోవడంతో ఉపాధి కరవైంది. ఐటీ కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి. కొత్తగా ఏర్పడిన నగరపాలక సంస్థకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పిస్తే ప్రగతి పరుగులు తీస్తుంది. పెదవడ్లపూడి వద్ద అర్ధంతరంగా ఆగిపోయిన ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని