logo

అమరావతి హరివిల్లు..ఆనందాల పరవళ్లు...

ప్రజా రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించి ఆగిపోయిన పనులు, ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు.

Updated : 21 Jun 2024 06:44 IST

సీఎం చంద్రబాబు రాకతో రైతుల హర్షాతిరేకాలు
రాజధాని రూపశిల్పికి అపూర్వ స్వాగతం

మ్యూజియంలో నమూనాలు తిలకిస్తూ.., రాజధానిలో భవనాల పరిశీలనకు వడివడిగా అడుగులు 

ప్రజా రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించి ఆగిపోయిన పనులు, ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. 
రాజధాని పనులను పట్టాలెక్కించి అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యులను చేస్తామని ప్రకటించారు. అమరావతి ప్రాంతంలో పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడుకు మహిళలు, రైతులు అపూర్వ స్వాగతం పలికారు. వైకాపా ఐదేళ్ల పాలనలో పడిన కష్టాలను గుర్తుచేసుకున్న రైతులు కూటమి అధికారంలోకి రావడంతో వెలుగు వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆయనకు హారతులు ఇచ్చి ఆహ్వానం పలికారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబునాయుడు, అభివృద్ధి ప్రదాత, స్వర్ణాంధ్ర నిర్మాత జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అమరావతిని కాపాడుకోవడానికి తాము చేయని పూజలు, మొక్కని దేవుళ్లు లేరని మహిళలు చంద్రబాబుకు వివరించారు. పుణ్య స్థలంలో మహిళలు మణిద్వీప వర్ణన, విష్ణు సహస్రనామ పారాయణం చేసి పూజలు చేశారు. 

ఉద్దండరాయునిపాలెం: శంకుస్థాపన ప్రదేశంలో పవిత్ర మట్టిని చూస్తున్న సీఎం
 

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు..

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటించారు. ప్రజావేదికతో మొదలుపెట్టి రాజధాని శంకుస్థాపన ప్రాంతం, పలు ప్రాంతాల్లో భవనాల నిర్మాణాలు, అసంపూర్తిగా ఆగిపోయిన పనులు, వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో నిలిచిపోయిన పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో రైతులు, మహిళలు, రైతుకూలీలు పెద్దఎత్తున ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. వైకాపా ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని గుర్తుచేసుకున్నారు. 2019కి ముందు తెదేపా పాలన కాలంలో రాత్రీ పగలు తేడా లేకుండా వేల మందితో రాజధాని ప్రాంతంలో జరిగిన పనులను గుర్తుకు తెచ్చుకుని మళ్లీ పూర్వ వైభవం వస్తుందని చర్చించుకున్నారు. 

స్వాగతం పలుకుతున్న రైతులు
 

అలుపెరగని పోరులో అంతిమ విజయం

ఐదేళ్ల పాటు వైకాపా గమ్యం లేని పాలనలో అనేక అవస్థలు పడ్డామని, వైకాపా నేతలు రాజధానిపై చేసిన ప్రకటనలతో అయోమయంతో తీవ్ర ఆందోళనలో గడిపామని వాపోయారు. మూడు పంటలు పండే భూములు రాష్ట్ర ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా భూసమీకరణలో ఇచ్చిన రైతులను అవమానిస్తుంటే తట్టుకోలేకపోయామన్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందన్న నమ్మకంతో ఐదేళ్ల పాటు వేచిచూశామన్నారు. మూడు రాజధానుల ప్రకటన రోజు నుంచి వైకాపా ప్రభుత్వం పతనమయ్యే వరకు అలుపెరగని ఉద్యమం చేశామన్నారు. అంతిమంగా విజయం సాధించామని, ఇక అమరావతి అభివృద్ధి పట్టాలెక్కుతుందని సంతోషం వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల పరిశీలన

 

ఐఏఎస్‌ అధికారుల భవనాల చుట్టూ పెరిగిన తుమ్మచెట్లను చూస్తున్న సీఎం చంద్రబాబు

 

అవరోధాలు అధిగమిస్తాం.. గత ప్రభుత్వం కూల్చేసిన ప్రజావేదిక వద్ద..

 

 సీఆర్డీఏ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు. పక్కన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే నరేంద్ర, ఎమ్మెల్సీ అనురాధ తదితరులు

అమరావతి రూపశిల్పిగా చరిత్రలో నిలుస్తారు

గూడూరి శేషుకుమారి, తుళ్లూరు గ్రామం

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిన అమరావతి నిర్మాణంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారు. అమరావతి నిర్మాణం కోసం ఆయన చేస్తున్న కృషి వెలకట్టలేనిది. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఆయన పడుతున్న శ్రమ మాటల్లో చెప్పలేం.

ప్రజల భాగస్వామ్యం కోరడం అభినందనీయం

గౌర్నేని స్వరాజ్యరావు, తుళ్లూరు

రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సలహాలు, సూచనలు తీసుకొని అమరావతి అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేయడం అభినందనీయం. ప్రజాభిప్రాయానికి విలువనివ్వడం ముఖ్యమంత్రి ఔన్నత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. చంద్రబాబు ప్రజల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలుస్తారు.

దేశం గర్వించేలా నిర్మాణాలు చేపట్టాలి

బెల్లంకొండ నరసింహారావు, వెంకటపాలెం

ఐదు కోట్ల ఆంధ్రులు కలలుగన్న ప్రజా రాజధాని అమరావతి. రైతుల త్యాగఫలంతో ఏర్పడిన అమరావతి దేశం గర్వించదగ్గ రాజధానిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మాణం చేస్తారు. ఐదేళ్ల పాలనలో వైకాపా రాష్ట్రాన్ని నాశనం చేసింది. తిరిగి కోలుకొని రాజధాని పునర్నిర్మాణం చేపట్టాలి.

న్యూస్‌టుడే, తుళ్లూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని