logo

పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, తురకా కిశోర్‌ ఎక్కడ?

పల్నాడు జిల్లాలో ఓ సీఐపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు, పోలింగ్‌ రోజు, మరుసటి రోజు అల్లర్లకు సూత్రధారి అయిన పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, అతని అనుచరుడు తురకా కిశోర్‌ ఇంకా పరారీలోనే ఉన్నారు.

Published : 22 Jun 2024 06:06 IST

మే 22న తప్పించుకున్నారు 
నెల రోజులైనా పట్టుకోని పోలీసులు ఈనాడు డిజిటల్, నరసరావుపేట

వెంకట్రామిరెడ్డి (పాత చిత్రం)  

పల్నాడు జిల్లాలో ఓ సీఐపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు, పోలింగ్‌ రోజు, మరుసటి రోజు అల్లర్లకు సూత్రధారి అయిన పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, అతని అనుచరుడు తురకా కిశోర్‌ ఇంకా పరారీలోనే ఉన్నారు. నేటికి నెలరోజులవుతున్నా పోలీసులు వారిని పట్టుకోలేదు. మాచర్ల అల్లర్ల కేసుల్లో పురోగతి లేదు. సాధారణ కార్యకర్తలను, చోటామోటా నేతలను అదుపులోకి తీసుకున్నారే తప్పించి ఇంతవరకూ ప్రధాన సూత్రధారులను మాత్రం అదుపులోకి తీసుకోలేదు. ముందస్తు బెయిల్‌పై మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడి నరసరావుపేటకు చేరుకుని మూడు వారాలుగా రోజూ ఎస్పీ కార్యాలయంలో సంతకం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి మాత్రం పరారీలో ఉండడం అనుమానాలకు తావిస్తోంది. చివరకు బెయిల్‌కు కూడా దరఖాస్తు చేసుకోలేదు. పోలీసులూ అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడం లేదని తెలుస్తోంది. అన్నదమ్ములిద్దరు హోం అరెస్టు ఉన్నా గత మే 16న సాయంత్రం అప్పటి సీఎం జగన్‌ను కలవడానికి మాచర్ల నుంచి తాడేపల్లి వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి మాచర్లకు వచ్చి త్వరలో అరెస్టు ఉందనే వార్తలు రావడంతో రాత్రికి రాత్రి మాచర్ల నుంచి హైదరాబాద్‌కు పరారయ్యారు. పిన్నెల్లి సోదరులు పరారీ? అని పత్రికల్లో రావడం.. పులులు అని చెప్పుకొనే వారు పిల్లుల్లా పారిపోయారని సోషల్‌ మీడియాలో మీమ్స్, రీల్స్‌ వైరల్‌ కావడంతో హైదరాబాద్‌లోనే ఉండిపోయి ఓ టీవీ ఛానల్‌లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యక్షమయ్యారు. ఎక్కడికీ పారిపోలేదని, తలచుకుంటే అరగంటలో మాచర్లలో ఉంటామని సవాల్‌ విసిరారు. ఇలా రెండురోజుల పాటు టీవీల్లో కనిపిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా పోలీసులు మాత్రం పట్టుకునే ప్రయత్నం చేయలేదు. చివరకు పోలీసులపై ఒత్తిడి పెరగడంతో మే 22న అరెస్టు చేయడానికి సంగారెడ్డి వెళ్లగా అక్కడ పోలీసుల కళ్లుగప్పి సినీ ఫక్కీలో  తమిళనాడు వెళ్లిపోయారు. తర్వాత ముందస్తు బెయిల్‌పై మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి వచ్చి నరసరావుపేటలో పోలీసుల రక్షణ వలయంలో ఉన్నారు.

దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేసి.. 

పోలింగ్‌ రోజు, మరుసటి రోజు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో పాటు ప్రధాన అనుచరుడు తురకా కిశోర్‌ పెద్ద సంఖ్యలో దాడులకు పాల్పడ్డారు. మాచర్ల పట్టణంలో 5 స్కార్పియో వాహనాలు, 50 ద్విచక్ర వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద హల్‌చల్‌ చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. మాచర్ల పట్టణం పీడబ్ల్యూడీ కాలనీలో పోలింగ్‌ కేంద్రంలో బీభత్సం చేశారు. కారుతో ఢీకొట్టడంతో పదిమందికిపైగా గాయపడ్డారు. తెదేపా నేత కేశవ్‌రెడ్డి ఇంటిపై దాడి చేసి ఇల్లు, కారును ధ్వంసం చేశారు. వెల్దుర్తి మండలం కుండ్లకుంటలో తెదేపా ఏజెంట్‌గా ఉన్న నోముల మాణిక్యరావుపై పిన్నెల్లి సోదరులిద్దరూ దాడి చేశారు. నేరుగా ఆయన ఇంటికెళ్లి భార్యాపిల్లలను చితకబాదారు. తిరిగి పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన తనపై పెట్రోబాంబులు, బరిసెలతో హత్యచేయబోయారని పోలీసులకు మాణిక్యరావు ఫిర్యాదు చేశారు. దీనిపై మంగళగిరి పోలీసుస్టేషన్‌లో జీఆరో ఎఫ్‌ఐఆర్‌ కింద 307 సెక్షన్‌ నమోదు చేశారు. తర్వాత కేసు వెల్దుర్తికి బదిలీ అయింది. పోలింగ్‌ మరుసటి రోజు కారంపూడిలో సీఐపైనే దాడి చేశారు. ఈ ఘటనలో వెంకట్రామిరెడ్డిపై 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసు నమోదైంది. అయినా ఇంతవరకూ పోలీసులు పట్టుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని