logo

కాటేస్తున్న కలుషిత జలం

రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట కలుషిత జలాలతో అస్వస్థతకు గురై పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్న ఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి.

Published : 22 Jun 2024 06:10 IST

మురుగుకాల్వల్లో నుంచి తాగునీటి పైప్‌లైన్లు 
బ్లీచింగ్‌ చల్లి మమ అనిపిస్తున్న అధికారులు

కేసానుపల్లి ఎస్సీ కాలనీలో మురుగు కాల్వ వద్దే తాగునీటి కనెక్షన్‌ 

ఈనాడు డిజిటల్, నరసరావుపేట:  రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట కలుషిత జలాలతో అస్వస్థతకు గురై పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్న ఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. మొన్న గుంటూరు, నిన్న విజయవాడలో జరిగిన ఘటనలు మరువకముందే జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం రెంటచింతలలో అదే తరహాలో ఇటీవల ఒకరు మృతి చెందడమే కాకుండా పలువురు ఆస్పత్రిపాలయ్యారు. తాజాగా దాచేపల్లిలో ఎస్సీకాలనీ వాసులు డయేరియాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంత జరిగినా దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో సిబ్బంది చొరవ చూపడంలేదు. కేవలం బ్లీచింగ్‌ చల్లి వదిలేశారు. మురుగు కాల్వల్లోంచే తాగునీటి పైపులు పోతున్నా, అక్కడ అపరిశుభ్రత ఉన్నా పట్టించుకోవడం లేదు. 

రెంటచింతలలో ఒకరు చనిపోయినా..

రెంటచింతల మండల కేంద్రంలో వడ్డెర బావి సమీపంలో ఈనెల 8 రాత్రి కొందరు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. మందులు వేసుకున్నా తగ్గకపోవడంతో ఆస్పత్రులకు పరుగెత్తారు. కొందరు మాచర్ల వెళ్లగా, మరికొందరు పిడుగురాళ్ల ఆస్పత్రులలో చేరారు. వారిలో పేరూరి చినచంద్రయ్య(72) వాంతులు, విరేచనాలతో బాధపడుతూ నీరసించి, పరిస్థితి చేయిదాటడంతో మృతిచెందాడు. కలుషిత జలాల బాధితులు రెండు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. మూడురోజులుగా దాచేపల్లిలోని ఎస్సీ కాలనీవాసులు కలుషిత జలాలు తాగి వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలయ్యారు. మూడురోజులుగా ఇంటికొకరు చొప్పునా డయేరియాతో బాధపడుతున్నారు. ఇలా జిల్లాలో ఎక్కడో ఒకచోట కలుషిత జలాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ట్యాంకులను శుభ్రం చేయడం లేదు

రెంటచింతల పంచాయతీ ఓవర్‌హెడ్‌ ట్యాంకు నుంచి మండల కేంద్రంలోని అన్ని కాలనీలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ట్యాంకులో పాకుడు పేరుకుపోయిందని, శుభ్రపరచడం లేదని కాలనీవాసులు చెబుతున్నారు. అంతేకాకుండా కాలనీలకు వెళ్లే తాగునీటి పైపులు మురుగు కాల్వల్లోంచి వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో కలుషిత తాగునీటి వల్లే ఒకరు చనిపోయారని, మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని స్థానికులు చెప్పారు. అయినా ట్యాంకును శుభ్రపరచలేదని, తాగునీటి పైపులను కూడా మార్చడం లేదని వాపోయారు. కేవలం బ్లీచింగ్‌ చల్లి వెళ్లిపోయారని చెప్పారు. దాచేపల్లి మండలం కేసానుపల్లి ఎస్సీకాలనీలో మురుగు మధ్యే తాగునీటి ట్యాంకులున్నాయి. వాటిని శుభ్రపరచడం లేదు. నాచు పేరుకుపోతోంది. చుట్టుపక్కల మురుగును తొలగించడం లేదు. ఇవేకాకుండా మారుమూల పల్లెలు, తండాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి.

దిద్దుబాటు చర్యలేవీ?

కలుషిత జలాలు తాగి గుంటూరు, విజయవాడలో పలువురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆయా ఘటనలు చూసైనా పల్నాడు జిల్లాలో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు. నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల, దాచేపల్లి ఇలా ప్రధాన పట్టణాలే కాకుండా, మండల కేంద్రాల్లోనూ తాగునీటి పైపులు మురుగు కాల్వల్లోంచి వెళుతున్నాయి. అయినా మున్సిపల్‌ సిబ్బంది మొద్దునిద్ర వీడడం లేదు. ఇటీవల నరసరావుపేటలో కూడా రంగుమారి తాగునీరు సరఫరా అయింది. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పసుపు రంగు నీరు కొళాయిల ద్వారా వచ్చింది. తాగునీరు కలుషితమవుతున్నా అధికారు ముందస్తు చర్యలు చేపట్టడం లేదు. రెంటచింతలలో జరిగిన ఘటనను తేలికగా తీసుకోకుండా, ఇలాంటి ఘటన మరోచోట పునరావృతం కాకుండా చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని