logo

ఎత్తిపోస్తేనే పంటలకు నీరు

గుంటూరు, పల్నాడు జిల్లాలో వైకాపా ఐదేళ్ల పాలనలో ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరు చేయకపోవడంతో నిర్వహణ అటకెక్కింది.

Published : 22 Jun 2024 06:13 IST

సుమారు రూ.150 కోట్ల నిధులు అవసరం
ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఏపీఎస్‌
ఐడీసీవైకాపా పాలనలో మూలనపడిన పథకాలు 

 నిరుపయోగంగా పసుమర్రు ఎత్తిపోతల పథకం

ఈనాడు, నరసరావుపేట, చిలకలూరిపేట గ్రామీణ: గుంటూరు, పల్నాడు జిల్లాలో వైకాపా ఐదేళ్ల పాలనలో ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరు చేయకపోవడంతో నిర్వహణ అటకెక్కింది. దీంతో వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందక అన్నదాతలు అవస్థలు పడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చేనాటికి పనులు జరుగుతున్న పథకాలు అర్ధంతరంగా ఆగిపోగా కొత్త పథకాలు ఒక్కటీ పట్టాలెక్కలేదు. మరమ్మతులకు గురైన పథకాలను పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌ సాగునీటి పారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఐడీసీ) ఇంజినీర్లు, సిబ్బందికి వేతనాలు సైతం అందని దుస్థితి. వైకాపా పాలనలో ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టుదారులతోపాటు వాటిని నిర్మించే ఇంజినీర్లు ఎన్నడూలేని గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, జలవనరులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండటంతో అర్ధంతరంగా ఆగిన పథకాలు పూర్తిచేయడంతోపాటు నిరుపయోగంగా ఉన్న పథకాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జలవనరులశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు ప్రతిపాదనలపై చర్చించి ప్రాధాన్యత క్రమంలో పథకాల నిర్మాణం పూర్తిచేయడానికి నిధులు విడుదల చేయనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడం వల్ల రూ.కోట్ల విలువైన పంట ఉత్పత్తులను రైతులు పండించే వెసులుబాటు కలుగుతుంది.

వైకాపా పాలనలో.. 

ఉమ్మడి జిల్లాలో ఎత్తిపోతల పథకాలు అధికం. జిల్లాలో కృష్ణానది, వాగుల ఆధారంగా ఎత్తిపోతల పథకాలు నిర్మించి లక్ష ఎకరాలకుపైగా పొలాలకు సాగునీరు అందిస్తున్నారు. వైకాపా పాలనలో కొత్తగా ఎత్తిపోతల పథకానికి ఒక్కరూపాయి విడుదల చేయకపోగా పాతవాటికి నిధులు ఇవ్వలేదు. దీంతో కొద్దిపాటి మరమ్మతుకు కూడా నిధుల లభ్యత లేక నిరుపయోగంగా మారాయి. కొన్ని పథకాలకు రైతులే సొంతంగా మరమ్మతులు చేయించుకుని వాడుకలోకి తెచ్చారు. రూ.కోట్ల సొమ్ము అవసరమైన పథకాలకు మాత్రం ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా బుట్టదాఖలయ్యాయి. అప్పటి ఎమ్మెల్యేలు పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. జిల్లాలో మిర్చి, పత్తి వంటి వాణిజ్యపంటలకు రైతులు దూర ప్రాంతాల నుంచి ఆయిల్‌ ఇంజిన్లు ద్వారా నీటిని తోడి ట్యూబుల ద్వారా పంటలు తడుపుకోవడంతో ఖర్చు తడిసిమోపెడయింది. గతేడాది వర్షాభావ పరిస్థితుల్లో మిర్చి పంటను కాపాడుకోవడానికి కర్షకులు పడిన కష్టాలు వర్ణనాతీతం. 

ప్రతిపాదనలు సిద్ధం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోపాటు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అన్నిస్థానాల్లో కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ఈక్రమంలో ఆయా ప్రజాప్రతినిధులు ప్రమాణ స్వీకారానికి ముందే నియోజకవర్గంలో సమస్యలపై దృష్టిసారించి వాటి పరిష్కారానికి ప్రయత్నాలు మొదలెట్టారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేసే వెసులుబాటు ఉన్న ఎత్తిపోతల పథకాల వివరాలు సిద్ధం చేయాలని ఏపీఎస్‌ఐడీసీ ఇంజినీర్లను కోరారు. ఇందుకు అనుగుణంగా గుంటూరు, పల్నాడు జిల్లాల వారీగా పథకాల పనితీరు, మరమ్మతుకు గురైన పథకాలు, అర్థంతరంగా ఆగిన పథకాల నిర్మాణాలకు నిధులు ఎంత అవసరమో లెక్కించి ప్రతిపాదనలు తయారుచేశారు. వీటిపై త్వరలోనే జలవనరులశాఖ మంత్రి ఆధ్వర్యంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని