logo

రాజధాని రైతులపై కేసులను ఎత్తివేయాలి

రాజధానిని కొనసాగించాలని కోరుతూ కొన్నేళ్లుగా చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్న రైతులపై మోపిన క్రిమినల్‌ కేసులన్నింటిని ఎత్తివేయాలని అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య కన్వీనర్‌ మాదల శ్రీనివాస్‌ కోరారు.

Published : 22 Jun 2024 06:16 IST

అమరావతి అభివృద్ధిపై ఐకాస నాయకుల తీర్మానం

మాట్లాడుతున్న మాదల శ్రీనివాస్, పక్కన ఐకాస నాయకులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: రాజధానిని కొనసాగించాలని కోరుతూ కొన్నేళ్లుగా చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్న రైతులపై మోపిన క్రిమినల్‌ కేసులన్నింటిని ఎత్తివేయాలని అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య కన్వీనర్‌ మాదల శ్రీనివాస్‌ కోరారు. ఈ మేరకు గుంటూరు చంద్రమౌళీనగర్‌లో సమాఖ్య, అమరావతి రాజధాని ఐకాస నాయకులు శుక్రవారం సమావేశమయ్యారు. మాదల శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాజధాని కోసం రైతులు అనేక ఉద్యమాలు చేశారని, అందులో పాల్గొన్న వారిపై గత ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసిందన్నారు. వాటన్నింటిని ప్రభుత్వం తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి కార్యాచరణను రూపొందించి అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న కౌలును చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా రాజధానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం సంస్థలను త్వరగా నెలకొల్పేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తీర్మానించారు. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వానికి సమాఖ్య తరఫున, రాజధాని రైతుల తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయా తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వివరించారు. తొలుత రాజధాని ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. సమావేశంలో నాయకులు బెల్లంకొండ నరసింహారావు, కల్లం రాజశేఖర్‌రెడ్డి, ఆకుల ఉమా, స్వరాజ్యారావు, ఆలూరు శ్రీనివాస్‌రావు, జమ్మల శ్యామ్‌కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని