logo

సముద్రంలో నలుగురు యువకుల గల్లంతు

సముద్ర స్నానం చేస్తున్న నలుగురు యువకులు ప్రమాదవశాత్తు అలల దాటికి గల్లంతైన సంఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.

Published : 22 Jun 2024 06:19 IST

ఇద్దరి మృతదేహాలు లభ్యం.. మరో ఇద్దరి కోసం గాలింపు

గల్లంతైన నితిన్, అమల్‌ రాజు, మృతులు తేజ,  కిషోర్‌  

వేటపాలెం న్యూస్‌టుడే: సముద్ర స్నానం చేస్తున్న నలుగురు యువకులు ప్రమాదవశాత్తు అలల దాటికి గల్లంతైన సంఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. మెరైన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు...ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలకు చెందిన 11 మంది యువకులు సముద్రంలో స్నానాలు చేయడానికి ఓ వాహనంలో రామాపురం తీరానికి శుక్రవారం మధ్యాహ్నానికి చేరుకున్నారు. వీరందరూ రామాపురం- కఠారిపాలెం మధ్యలో ఉన్న ఓ ప్రైవేట్‌ అతిథి గృహం ఎదురుగా సముద్రంలో స్నానాలు చేయడానికి దిగారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు తేజ (17), కిషోర్‌(18), నితిన్‌ (18), అమల్‌ రాజ్‌ (18) అలల దాటికి సముద్రంలోకి గల్లంతయ్యారు. ఘటన జరిగిన రెండు గంటల తరువాత తేజ, కిషోర్‌ మృతదేహాలు బయటకు కొట్టుకురాగా..మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  స్నేహితులు అందరూ కలిసి హాయిగా తీరంలో గడిపేందుకు వచ్చారు. ఈ క్రమంలో దుర్ఘటన జరిగింది. మిగిలిన వారిలో విషాదంలో మునిగిపోయారు. సముద్ర స్నానానికి వచ్చిన వారిలోకొందరు చదువుకుంటున్నారు. మరికొందరు ఇతర వృత్తులు చేస్తున్నట్లు స్నేహితులు పేర్కొన్నారు. రెండు మృతదేహాలను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈపూరుపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అందరి కంటే చిన్నోడు.. అందనంత దూరానికి..

మృతుల్లో ఒకరైన జాలా కిషోర్‌ తండ్రి బోయీజు కూలి పనులు చేస్తుంటారు. వీరికి ముగ్గురు పిల్లలు. కిషోర్‌ అందరి కంటే చిన్నవాడు. తల్లిదండ్రులు గారాబంగా చూసుకుంటుంటారు. కిషోర్‌ కొంత వరకు చదివి ఆ తరువాత వంటలు చేయడం, సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయడం వంటి పనులు చేస్తుంటాడు. తల్లిదండ్రులకు భారం కాకుండా తన కాళ్లపై తాను నిలబడుతూ డబ్బులు సంపాదిస్తున్నాడు. అతని మృతితో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు.

ఉన్న ఒక్క కొడుకును కోల్పోయారు 

ఆ తల్లిదండ్రులు తమకున్న ఒక్క కొడుకునూ కోల్పోయి రోదిస్తున్నారు. మృతుల్లో ఒకరైన తేజ ఇంటర్‌ చదువుతున్నాడు. తండ్రి గొటికల డేవిడ్‌ రాడ్‌ బెండింగ్‌ పనులు చేస్తుంటారు. తేజకు సోదరి ఉంది. తల్లిదండ్రులు కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇప్పుడు కొడుకును కోల్పోయి శోకసంద్రంలో మునిపోయారు. 

మాకు ఇక దిక్కెవరు  

గల్లంతైన చంటిమాల నితిన్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. తండ్రి ఆశీర్వాదం ప్రైవేటు టీచరుగా పని చేస్తున్నారు. నితిన్‌తో పాటు కుమార్తెను చదివిస్తున్నారు. విహారయాత్రకు వెళతానని నితిన్‌ అడిగితే తల్లిదండ్రులు తొలుత వద్దన్నారు. అయినా వారిని ఒప్పించి వెళ్లాడు. నవ్వుతూ వెళ్లిన కుమారుడు గల్లంతయ్యాడని తెలిసిన ఆ తల్లిదండ్రులు..  కన్నీరుమున్నీరవుతున్నారు.

ఆ తల్లికి తీరని వ్యధే మిగిలింది 

సముద్రంలో గల్లంతైన కోరు అమల్‌రాజు తండ్రి బాలస్వామి గతంలోనే మృతిచెందారు. అప్పటి నుంచి తల్లి పావని చదివించుకుంటూ వస్తోంది. అమల్‌ రాజుకు సోదరి ఉంది. కుమారుడిపైనే కోటి ఆశలు పెట్టుకున్న ఆ తల్లికి తీరని వ్యధే మిగిలింది. అందరి వంకా బేలచూపులు చూస్తూ తనలో తాను కుమిలి పోతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని