logo

సిరులు పండేలా..పొలాలకు నీరు అందేలా..

Published : 22 Jun 2024 06:22 IST

కృష్ణా పశ్చిమ డెల్టాలో 191 పనులకు రూ.13.80 కోట్లతో ప్రతిపాదనలు 
కాలువల్లో అత్యవసర మరమ్మతులకు పచ్చజెండా

గుర్రపు డెక్క పెరిగిన ఈస్ట్‌స్వాంప్‌ మురుగుకాలువ

న్యూస్‌టుడే, బాపట్ల : ఖరీఫ్‌ సీజన్‌ నేపథ్యంలో కృష్ణా డెల్టా పరిధిలోని కాలువల్లో అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాలని జలవనరుల శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కాలువలకు నీరు విడుదల చేసే లోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. సాగు, మురుగు నీటి కాలువల్లో రూ.13.80 కోట్ల వ్యయంతో 191 పనులు చేపట్టడానికి జలవనరుల శాఖ ఈఎన్‌సీకి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. సోమవారం లోగా అన్ని అనుమతులు వస్తాయని వెంటనే పనులు ప్రారంభిస్తామని జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి. 
 వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో డెల్టాలో అన్ని సాగు, మురుగునీటి కాలువలు అధ్వానంగా మారాయి. తూతూమంత్రంగా మరమ్మతులు చేసి చేతులు దులిపేసుకున్నారు. డెల్టాలో చివరి ఆయకట్టులోని లక్ష ఎకరాలకు సాగునీరు పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారు. డీజిల్‌ ఇంజిన్లతో నీటిని తోడి తడులు ఇచ్చి పంటలను కాపాడుకోవటానికి అన్నదాతలు పడరాని పాట్లు పడ్డారు. తుపానుల వేళ మురుగుకాలువలు దారుణంగా ఉండి నీటి ప్రవాహం ముందుకు కదలక లక్ష ఎకరాల్లో పంటలు నీట మునిగి దెబ్బతిని సాగుదారులు అప్పుల పాలయ్యారు. రంగు మారిన ధాన్యాన్ని విక్రయించటానికి తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో రైతులే స్వచ్ఛందంగా శ్రమదానం చేసి కాలువలను బాగు చేసుకోవాల్సి వచ్చింది. కాలువల్లో మరమ్మతులు చేపట్టటానికి గత ఫిబ్రవరిలో రూ.23 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి జలవనరుల శాఖ అధికారులు పంపించారు. అప్పటి వైకాపా ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. 

  • కాలువల కట్టలు కోతకు గురై బలహీనపడ్డాయి. షట్టర్లు తుప్పుపట్టి దెబ్బతిని కొన్నిచోట్ల విరిగిపోయాయి. గుర్రపుడెక్క, ముళ్ల కంపలు, తూటుకాడ, నాచు విపరీతంగా పెరిగాయి. వాటి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవడంతో సాగు, మురుగునీటి కాలువలపై దృష్టి పెట్టింది. కాంక్రీటు పనులు చేపట్టడానికి ప్రస్తుతం తగిన సమయం లేనందున వాటిని పక్కన పెట్టాలని, కాలువల్లో పూడిక తీత, తూటుకాడ, గుర్రపుడెక్క తొలగింపు పనులకు ప్రతిపాదనలు పంపించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి విజయవాడలోని ఈఎన్‌సీకి శుక్రవారం సమర్పించారు. 
  • కాలువల్లో అత్యవసర మరమ్మతుల పనులు చేపట్టటానికి సోమవారం లోగా అనుమతులు రానున్నాయి. వచ్చిన వెంటనే అన్ని కాలువల్లో పూడిక తీత తొలగింపు పనులు చేపట్టి జులై రెండో వారం లోగా పూర్తి చేయటానికి అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రధానంగా కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డులేకుండా చివరి ఆయకట్టుకు నీరు చేరేలా పనులు చేయనున్నారు. మురుగుకాలువల్లో పూడిక తీత పనులు చేపట్టి భారీవర్షాలు కురిస్తే పంట పొలాల్లో నుంచి నీరు వెంటనే బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టనున్నారు. సాగునీటి కాలువల్లో రూ.4.98 కోట్లతో 85 పనులు, మురుగునీటి కాలువల్లో రేపల్లె డివిజన్‌లో  రూ.4.73 కోట్లతో 64 పనులు, చీరాల డివిజన్‌లో  రూ.3.75 కోట్లతో 37 పనులు చేపట్టాలని ప్రతిపాదనలు రూపొందించి ఈఎన్‌సీకి అందజేశారు. 

అత్యవసర పనులు చేపడతాం 

కాలువల్లో అత్యవసర పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశాం. రెండు, మూడ్రోజుల్లో అనుమతులు వస్తాయి. సాగునీరు విడుదల చేసే లోగా అన్ని కాలువల్లో పూడిక తీత, గుర్రపుడెక్క, తూటుకాడ, నాచు తొలగింపు పనులు సత్వరమే పూర్తి చేస్తాం.

 మల్లికార్జునరావు, జలవనరుల శాఖ ఈఈ
 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని