logo

యువతి హత్యతో ఉలికిపాటు

జిల్లాలో చీరాల మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం ఉదయం యువతి హత్యకు గురవడం కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే స్పందించి ఘటనా ప్రదేశానికి హోంమంత్రి అనితను పంపారు.

Published : 22 Jun 2024 06:25 IST

 సీఎం స్పందనతో యంత్రాంగం పరుగులు
 ఘటనా ప్రదేశానికి హోంమంత్రి రాక
 అజ్ఞాతంలోకి జారుకున్న గంజాయి బ్యాచ్‌ 

ఈనాడు-బాపట్ల: జిల్లాలో చీరాల మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం ఉదయం యువతి హత్యకు గురవడం కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే స్పందించి ఘటనా ప్రదేశానికి హోంమంత్రి అనితను పంపారు. దీంతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమెంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలకు పంపారు. సీఎం స్పందనతో పోలీసు యంత్రాంగం సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకునేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నారు. ప్రధానంగా ఆ ప్రాంతంలో ఉన్న టవర్‌ లోకేషన్‌కు వచ్చిన ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగితే చీమకుట్టినట్లు కూడా ఉండేది కాదని అలాంటిది ఇప్పుడు ముఖ్యమంత్రి స్పందించి ఏకంగా హోంమంత్రిని ఘటనా ప్రదేశానికి పంపటం చూస్తే శాంతిభద్రతలకు ఎన్డీయే ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం ఏమిటో ఇట్టే అర్థమవుతుందని స్థానికులు తెలిపారు. 

గంజాయికి స్వస్తి పలికే వేళ.. 

గంజాయి, డ్రగ్స్‌ ముసుగులో అరాచకాలకు పాల్పడే వారి పీచమణిచేందుకు ప్రభుత్వం పక్కా కార్యాచరణతో ముందుకు కదలుతున్న వేళ యువతి హత్యకు గురవడంతో ప్రభుత్వ, పోలీసువర్గాల్లోనే కాదు స్థానికుల్లో కలకలం రేగింది. ఘటనా ప్రదేశాన్ని హోంమంత్రి సందర్శించి తర్వాత హతురాలి కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం జిల్లా కేంద్రం బాపట్లలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో చీరాల పరిసరాల్లో గంజాయి విక్రయాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఈనిర్వాకం వల్లే చీరాల పరిసరాల్లో పెద్దసంఖ్యలో గంజాయి, డ్రగ్స్‌ మాఫియా బాగా వేళ్లూనుకుంది. 

పర్యాటక ప్రాంతమైనా పట్టించుకోలేదు

చీరాల పర్యాటక ప్రదేశం. అయినా ఇక్కడ గంజాయి విక్రయాలకు తావు లేకుండా శాంతిభద్రతలను మెరుగుపరచటంలో గత వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదనటానికి అనేక ఉదంతాలే నిదర్శనం. రాష్ట్రంతో పాటు తెలంగాణ నుంచి చీరాల పరిసరాల్లోని బీచ్‌ ప్రదేశాల సందర్శనకు పర్యాటకులు బాగా వస్తున్నారు. ఇలాంటి ప్రాంతాన్ని గత వైకాపా పాలకులు గంజాయికి అడ్డాగా మార్చేశారు. వాడరేవు, రామాపురం బీచ్‌ల్లో విచ్చలవిడిగా గంజాయి పట్టుబడిన ఉదంతాలు ఉన్నాయి. యువత గంజాయి, ఇతర పదార్థాల మత్తులో జోగుతూ అనేక అరాచకాలకు పాల్పడినా అప్పటి ప్రభుత్వం, పోలీసువర్గాలు ఆ ఘటనల్ని చాలా తేలిగ్గా తీసుకున్నాయని స్థానికులు గుర్తుచేస్తున్నారు. యువతి హత్యకు గురైన పరిసర ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్‌లు హల్‌చల్‌ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. దీంతో ఒంటరిగా కళాశాలలకు అమ్మాయిలను పంపాలంటేనే వణికిపోయే పరిస్థితి. 

అజ్ఞాతంలోకి గంజాయి బ్యాచ్‌

ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించటంతో ఆ ప్రాంతాల్లో ఉండే గంజాయి బ్యాచ్‌తోపాటు ఇతర అసాంఘిక శక్తులు వెంటనే అప్రమత్తమై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొందరి ఫోన్లు స్విచాఫ్‌ చేసుకోవటంతో పోలీసులు వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణకు ఉపక్రమించారు. మొత్తంగా యువతి చనిపోయిన తీరును చూస్తుంటే తొలుత అత్యాచారం చేసి ఆపై హత్యచేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో అసాంఘికశక్తులందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందించటంతో పోలీసు ఉన్నతాధికారులు బాపట్లకు చేరుకున్నారు. 


బాధిత కుటుంబానికి రూ.10 లక్షల అందజేత

ఘటనాస్థలానికి వస్తున్న హోంమంత్రి అనిత   

చీరాల గ్రామీణం, న్యూస్‌టుడే: చీరాల మండలంలోని బాధిత  కుటుంబ సభ్యులకు శుక్రవారం రాత్రి ప్రభుత్వం రూ.10 లక్షల చెక్కును అందజేసింది. ఎమ్మెల్యే కొండయ్య, తహసీల్దార్‌ నాసరయ్య, ఇతర నాయకులు యువతి కుటుంబ సభ్యులను కలిసి  చెక్కును అందించారు. వీరి వెంట స్థానిక నాయకులు, ఇతర అధికారులు ఉన్నారు. 

నిందితులను పట్టుకునేందుకు అయిదు ప్రత్యేక బృందాలు

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: అత్యాచారం, హత్య కేసును ఛేదించేందుకు అయిదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పేర్కొన్నారు. రైల్వే ట్రాక్‌ సమీపంలో ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా నేర స్థలానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలను క్షుణ్ణంగా చూశారు. అక్కడ నుంచి హతురాలు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తరువాత ప్రత్యేకంగా నియమించిన బృందాలకు ఐజీ పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్, అడిషనల్‌ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్, చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాదు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని