logo

యూనివర్సిటీని వదల్లేదు!

చెరువులో మట్టి తవ్వకాలను తలదన్నేలా... ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం(ఏఎన్‌యూ)లో భారీ ఎత్తున ఎర్రమట్టి తవ్వారు. ఎకరాల కొద్దీ భూముల్లో తవ్వకాలు చేపట్టారు.

Published : 24 Jun 2024 04:38 IST

ఏఎన్‌యూలో మట్టి అక్రమ తవ్వకాలు
విచారణకు విద్యార్థి సంఘాల డిమాండ్‌

ఇంజినీరింగ్‌ కళాశాల వెనుక వైపు మట్టి తవ్వే ప్రాంతంలో ఉన్న పొక్లెయిన్‌

ఈనాడు-అమరావతి: చెరువులో మట్టి తవ్వకాలను తలదన్నేలా... ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం(ఏఎన్‌యూ)లో భారీ ఎత్తున ఎర్రమట్టి తవ్వారు. ఎకరాల కొద్దీ భూముల్లో తవ్వకాలు చేపట్టారు. ఆ ప్రాంతాలు లోయను తలపిస్తున్నాయి. పొక్లెయిన్లు పెట్టి 60-70 అడుగుల లోతున తవ్వినట్లు భారీ గుంతలను చూస్తే తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో నాణ్యమైన ఎర్రమట్టి చేబ్రోలు మండలంలో లభ్యమవుతుంది. ఆ తర్వాత అంత నాణ్యత కలిగిన మట్టి ఏఎన్‌యూలోనే దొరుకుతుంది. ఇక్కడి మట్టికి చాలా డిమాండ్‌ ఉంటుందని వర్సిటీ వర్గాలే చెబుతున్నాయి. సుమారు వంద ఎకరాల విస్తీర్ణం కలిగిన వర్సిటీలో ఖాళీ భూములున్నాయి. అవి చెట్లు, దట్టమైన పొదలతో నిండి ఉన్నాయి. వాటి మాటున గుట్టుగా ఎర్రమట్టి తవ్వకాలు సాగిపోయాయి. ఇంజినీరింగ్‌ కళాశాల వైపు, వర్క్‌షాపునకు సమీపంలో భారీ గుంతలు దర్శనమిస్తున్నాయి. మట్టి అక్రమ తవ్వకాల మాటున ఎవరు లాభ పడ్డారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

విశ్వవిద్యాలయంలో ఎర్రమట్టి భారీఎత్తున తవ్వేశారు. ఏ అవసరాలకు వినియోగించారనేది ప్రశ్నార్థకంగా మారింది. వర్సిటీలో గడిచిన ఐదేళ్లలో అనేక నిర్మాణాలు చేపట్టారు. ఆర్కిటెక్చర్‌ కళాశాల, బాలురు, బాలికల వసతి గృహాలు, న్యాయ కళాశాల భవనాలు నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఆ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వసతి గృహాలున్న ప్రదేశాల్లో భూగర్భ డ్రైనేజీ, అంతర్గత రహదారులు, డివైడర్ల నిర్మాణాలు చేపట్టారు. మరికొన్ని నిర్మాణాలు సాగుతున్నాయి. వీటికి మట్టి ఎక్కడ నుంచి తెచ్చారో  ఆరా తీయాల్సి ఉంది.

అనుమతులు అవసరం : ఇసుక మాదిరిగా ఎర్రమట్టి సైతం చాలా ఖరీదైన వస్తువుగా మారిపోయింది. లారీ మట్టికి రూ.10 వేల దాకా వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యాశకు పోయి ఎవరైనా ఇక్కడ మట్టిని గుట్టుగా తవ్వి సొమ్ము చేసుకున్నారా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ వర్సిటీ అవసరాలకే అనుకుంటే.. అంత పెద్ద మొత్తంలో మట్టి తవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ అవసరాలకైనా బయట కొని తెచ్చుకోవాలే తప్ప ఇష్టారాజ్యంగా వర్సిటీ భూములు తవ్వి మట్టి తీస్తామంటే నిబంధనలు అనుమతించవు. 

  • మట్టి తవ్వాలంటే గనుల శాఖ అనుమతులు పొందాలి. అనుమతుల కోసం తమకు దరఖాస్తు చేయలేదని గనుల శాఖ వర్గాల సమాచారం. ఎకరాల మేర మట్టి ఎందుకు తవ్వాల్సి వచ్చింది? ఎవరి ఆదేశాలతో భారీ మొత్తంలో తవ్వారో వర్సిటీ అధికారులే సమాధానం చెప్పాలి. ఒకవేళ వర్సిటీలో మేరువ పనులు చేపట్టినా.. అందుకు అవసరమైన మట్టిని నింపుకోవటానికి కూడా అనుమతులు తీసుకోవాలి. ఆపై పాలక మండలిలో చర్చించాలి. ఎన్ని మెట్రిక్‌ టన్నుల మట్టి తీశారు. ఎక్కడెక్కడ ఎంత వినియోగించారో రాసి పెట్టుకోవాలి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని