logo

వైకాపా నేత.. మాన్యం భూమి మేత

పల్నాటి ఇలవేల్పు చెన్నకేశవస్వామి మాన్యం భూమిని ఆక్రమించి.. తమ పూర్వీకుల నుంచి సంక్రమించినట్లుగా తప్పుడు సర్వే నంబర్లతో వైకాపా ప్రజాప్రతినిధి భర్త రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు.

Published : 24 Jun 2024 04:41 IST

అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆక్రమణ.. ఆపై రిజిస్ట్రేషన్‌
రెస్టారెంట్‌ నిర్మించి అద్దెకిచ్చిన ఎంపీపీ భర్త

రహదారి పక్కనున్న మాన్యం భూమిలో నిర్మించిన రెస్టారెంట్‌

కారంపూడి, న్యూస్‌టుడే: పల్నాటి ఇలవేల్పు చెన్నకేశవస్వామి మాన్యం భూమిని ఆక్రమించి.. తమ పూర్వీకుల నుంచి సంక్రమించినట్లుగా తప్పుడు సర్వే నంబర్లతో వైకాపా ప్రజాప్రతినిధి భర్త రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండదండలతో దేవుడి మాన్యం ఆక్రమించినా అధికారులు మిన్నకున్నారు. రూ.60 లక్షల విలువ చేసే మాన్యం భూమిలో రెస్టారెంట్‌ కట్టి అద్దెకిచ్చినా అధికారులు నోరెత్తలేదు.

  • శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి మాన్యం భూమి కారంపూడిలోని దాచేపల్లి రహదారి పక్కనే సర్వే నంబరు 369లో 4.94 ఎకరాలు ఉంది. ప్రతి రెండేళ్లకు దేవాదాయ శాఖ అధికారులు ఈ భూమి సాగు చేసుకునేందుకు వేలం పాటలు నిర్వహిస్తుంటారు. ఈ భూమిలో 40 సెంట్ల వరకు నిరుపయోగమైన భూమి రహదారిని ఆనుకొని ఉంది. ఇందులో రైతులు పండించిన పంటలు ఆరబెట్టుకుంటూ కళ్లంగా ఉపయోగిస్తుంటారు. రహదారి పక్కనే ఉన్న 40 సెంట్ల భూమి రూ.80 లక్షల వరకు పలుకుతుండటంతో వైకాపా నాయకుడి కళ్లు పడ్డాయి. గత ఏడాది జనవరిలో వైకాపా నేత ఒకరు తప్పుడు సర్వే నంబర్లు వేసి.. హద్దులు మాత్రం మాన్యం భూమివి చూపి తన పూర్వీకుల నుంచి సంక్రమించినట్లుగా సర్వే నంబరు 272-4గా చూపుతూ అందులోని 21 సెంట్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. అందులో రెస్టారెంట్‌ నిర్మించాడు. దీన్ని ఏడాది రూ.2 లక్షలకు అద్దెకిచ్చాడు. అప్పట్లో అధికారమే అండగా, ఎమ్మెల్యే పిన్నెల్లి ఆశీస్సులున్నాయని దేవుడి మాన్యాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేశాడు. అదేమని దేవాదాయ శాఖ అధికారులు అడిగే ధైర్యం చేయలేదు. ఇపుడు తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రావటంతో సదరు మాన్యాన్ని వైకాపా నాయకుల చేతిలోంచి విడిపించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కొలతలు తీయించమన్నాం
- కృష్ణమరాజు,  దేవాదాయశాఖ  అధికారి, కారంపూడి 

దేవాదాయ శాఖకు చెందిన భూమి సర్వే కొలతలు తీయించాలని రెవెన్యూ అధికారులను కోరాం. వారం రోజుల్లో పూర్తిస్థాయి చర్యలు తీసుకొని అందులోని నిర్మాణాలు తొలగిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని