logo

ఏడుగురికి ప్రాణదానం

అప్పటి వరకు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన ఆమె హఠాత్తుగా అధిక రక్తపోటుకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించగా ఆమె మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయాయని తేలడంతో బ్రెయిన్‌ డైడ్‌గా వైద్యులు ధ్రువీకరించారు.

Published : 24 Jun 2024 04:44 IST

గుడివాడ మహిళ బ్రెయిన్‌డెడ్‌ 
గ్రీన్‌ఛానల్‌ ద్వారా అవయవాల తరలింపు

మైనపు ధనలక్ష్మి

కానూరు, న్యూస్‌టుడే: అప్పటి వరకు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన ఆమె హఠాత్తుగా అధిక రక్తపోటుకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించగా ఆమె మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయాయని తేలడంతో బ్రెయిన్‌ డైడ్‌గా వైద్యులు ధ్రువీకరించారు. ఈ అనూహ్య పరిణామంతో విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు తమ బాధను గుండెలో దిగమింగుకున్నారు. ఆమె అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పెనమలూరు మండలం పోరంకి క్యాపిటల్‌ ఆస్పత్రిలోని జీవన్‌దాన్‌ను సంప్రదించారు. ఆమె చనిపోయినా కూడా మరో ఏడుగురికి ప్రాణదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. 

కృష్ణా జిల్లా గుడివాడ నాగవరప్పాడుకు చెందిన మైనపు ధనలక్ష్మి(48), ఏసుబాబులు భార్యాభర్తలు కాగా.. భర్త ఓ ప్రైవేటు పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. వారికి ఆనంద్‌కుమార్, అశోక్‌కుమార్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. ఈ నెల 21వ తేదీన సాయంత్రం 4 గంటలకు ధనలక్ష్మికి బీపీ ఎక్కువగా రావడంతో కుటుంబ సభ్యులు గుడివాడలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ బీపీ పరీక్షించగా 270గా నమోదైంది. వైద్యులు సీటీస్కాన్‌ తీసి పరిశీలించగా.. మెదడులోని నరాలు చిట్లిపోయాయని తేలింది. దీంతో ఆమెను విజయవాడ తీసుకెళ్లానని సూచించగా.. హుటాహుటిన పోరంకి క్యాపిటల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి చేజారడంతో 22వ తేదీ ఉదయం బ్రెయిన్‌ డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. ఆమె చనిపోయినా అవయవాలు మరికొందరికి ఉపయోగపడాలన్న గొప్ప ఆశయంతో కుటుంబ సభ్యులు జీవన్‌దాన్‌ ద్వారా అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. 

ఊపిరితిత్తులు, గుండె చెన్నైకు:  23వ తేదీ ఉదయం క్యాపిటల్‌ ఆస్పత్రి ఎండీ మన్నే హరీష్, ఆస్పత్రి వైద్యులు పవన్, త్రివేదిల ఆధ్వర్యంలో అవయవాల తరలింపు ప్రక్రియ చేపట్టారు. ఓ కిడ్నీ క్యాపిటల్‌ ఆస్పత్రికి(పోరంకి), మరో కిడ్నీ, లివర్‌ మణిపాల్‌ ఆస్పత్రికి(గుంటూరు జిల్లా తాడేపల్లి), ఊపిరితిత్తులు చెన్నై గ్లోబల్‌ ఆస్పత్రికి, గుండె చైన్నై ఎంజీఎం ఆస్పత్రికి, కళ్లు ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రికి(కృష్ణా జిల్లా తాడిగడప) గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా ప్రత్యేక అంబులెన్సులో తరలించారు. ఆస్పత్రి వైద్యులతో పాటు, ధనలక్ష్మి కుటుంబ సభ్యులు ఆమెకు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు.


కుమారుడి పెళ్లి చూడకుండానే..  

ధనలక్ష్మి పెద్ద కుమారుడు అనంద్‌కుమార్‌కు ఆగస్టు 19న పెళ్లి చేయడానికి నిశ్చయించారు. మెల్లగా పెళ్లి పనులు చేస్తున్నారు. కుమారుడు పెళ్లి ఆలోచనలతో ఎంతో సంతోషంగా ఉండేది. ఈలోగా అనూహ్యంగా ఆమె బ్రెయిన్‌డెడ్‌ కావడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని