logo

యథేచ్ఛగా బైక్‌ రేస్‌లు

నగరంలో బైక్‌ రేస్‌లు పెరగడంతో పాదచారులు, వాహన చోదకులు భయాందోళన చెందుతున్నారు. కొందరు యువకులు, విద్యార్థులు ఖరీదైన క్రీడా వాహనాల (స్పోర్ట్సు)తో రద్దీ రహదారులపై రెచ్చిపోతున్నారు.

Published : 24 Jun 2024 04:48 IST

ఆందోళనలో పాదచారులు, వాహన చోదకులు 

బృందావన్‌ గార్డెన్స్‌ రహదారిపై యువకుల బైక్‌రేస్‌, ఎన్టీఆర్‌ స్టేడియం సమీపంలో బైక్‌ రేసర్ల విన్యాసాలు 

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: నగరంలో బైక్‌ రేస్‌లు పెరగడంతో పాదచారులు, వాహన చోదకులు భయాందోళన చెందుతున్నారు. కొందరు యువకులు, విద్యార్థులు ఖరీదైన క్రీడా వాహనాల (స్పోర్ట్సు)తో రద్దీ రహదారులపై రెచ్చిపోతున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా చిత్ర, విచిత్ర విన్యాసాలకు పాల్పడుతున్నారు. కొందరు డబ్బులు సులువుగా సంపాదించటానికి పందేలు కాస్తూ పోటీలు పడుతుంటే.. మరి కొందరు ఫేస్‌బుక్, వాట్సఫ్, టెలిగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. 

ప్రాంతాలు ఇవీ.. నగరంలోని ఇన్నర్‌రింగ్‌రోడ్డు, బృందావన్‌గార్డెన్స్, ఎన్టీఆర్‌ స్టేడియం, లక్ష్మీపురం, విద్యానగర్, గుజ్జనగుండ్ల, కొరిటెపాడు, జేకేసీ రోడ్డు, ఆర్టీఓ కార్యాలయం పరిసరాలు, నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతికి వెళ్లే మార్గాలు, తెనాలి, చెన్నై జాతీయ రహదారులపై యువకులు బైక్‌ రేస్‌లకు పాల్పడుతున్నారు. 

కొరవడిన పోలీసు నిఘా.. నిత్యం రద్దీగా ఉండే ఆయా రహదారులపై తరచూ యువకులు పందేలు నిర్వహిస్తున్నారు. గతంలో పోలీసులు ఆయా మార్గాల్లో నిఘాపెట్టి చర్యలు తీసుకోవడంతో కొద్ది రోజులు కట్టడి చేయగలిగారు. ఇటీవల కాలంలో పోలీసులు నిఘా కొరవడింది. దీంతో మళ్లీ బైక్‌రేసర్లు విజృంభిస్తున్నారు. బుల్లెట్లు, స్పోర్ట్సు బైక్‌లతో ఒక్కో వాహనంపై ఇద్దరు యువకులు కుర్చొని మితిమీరిన వేగంతో పెద్దశబ్దాలు చేస్తూ రోడ్లపై పందేలు నిర్వహించడంతో అటుగా రాకపోకలు సాగించేవాళ్లు భయాందోళన చెందుతున్నారు. కొందరు వాహనం ముందు చక్కాలను పైకి లేపుతూ స్టంట్‌లకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో ఆ యువకులు ఢీకొట్టి వెళ్లిపోవడంతో అటుగా ప్రయాణించే వాహనచోదకులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యారు. 

కొని తెచ్చుకుంటున్న ప్రమాదాలు.. విద్యానగర్‌లో బైక్‌రేస్‌ నిర్వహిస్తున్న ఇద్దరు యువకులు పోటీలో ముందుగా వెళ్లాలనే లక్ష్యంతో మితిమీరిన వేగంతో తమ వాహనాన్ని నడిపి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒకరు ఘటనాస్థలిలో మృతిచెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన వైనం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. అయినప్పటికీ యువకులు బైక్‌రేస్‌లో మోజులోపడి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. 

చర్యలు తీసుకుంటాం..: ఆయా రహదారులపై నిఘాపెట్టి బైక్‌రేస్‌లు నిర్వహించే వారిపై చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని